కంటెంట్‌కు వెళ్లు

వృద్ధుల్లో ఆశను నింపి, వాళ్లను ఓదార్చడం

వృద్ధుల్లో ఆశను నింపి, వాళ్లను ఓదార్చడం

చాలా దేశాల్లోలాగే ఆస్ట్రేలియాలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. వాళ్లలో కొంతమంది నర్సింగ్‌ హోమ్‌లలో ఉంటున్నారు, అక్కడ పనిచేసేవాళ్లు వాళ్ల ఆరోగ్యాన్ని, రోజువారీ అవసరాల్ని దయతో చూసుకుంటున్నారు.

నిజమే, అక్కడ ఉండే చాలామందికి భౌతిక అవసరాలు చూసుకుంటే సరిపోదు. కొన్నిసార్లు వాళ్లకు బోర్‌ కొడుతుంది, ఒంటరితనం బాధిస్తుంది, నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియాలోని పోర్ట్‌లండ్‌ పట్టణంలో యెహోవాసాక్షులు రెండు వృద్ధాశ్రమాలను ప్రతీవారం సందర్శించి అక్కడివాళ్లలో ఆశను నింపుతున్నారు, వాళ్లను ఓదారుస్తున్నారు.

నర్సింగ్‌ హోమ్‌లలో ఉండేవాళ్లకు తగినట్టు బైబిలు చర్చలు

స్థానిక యెహోవాసాక్షులు అక్కడ ఉండే వృద్ధుల్ని కలిసి, వాళ్లతో బైబిలు అంశాల గురించి, అంటే యేసు జీవితంలోని ముఖ్యమైన సంఘటనల వంటివాటి గురించి చర్చిస్తారు. జేసన్‌ ఇలా అంటున్నాడు: “మేము బైబిల్లోని కొంతభాగాన్ని వృద్ధులతో పాటు చదువుతాం, తర్వాత దాన్ని వాళ్లతో చర్చిస్తాం.” ఆ చర్చకు వచ్చే వృద్ధుల్లో చాలామందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి జబ్బుల్ని, మరణాన్ని తీసేస్తానని దేవుడు చేసిన వాగ్దానాల గురించి యెహోవాసాక్షులు వాళ్లతో మాట్లాడతారు. అలా వాళ్లలో ఆశను నింపి వాళ్లను ఓదారుస్తారు.

టోనీ అనే స్థానిక యెహోవాసాక్షి ఇలా అంటున్నాడు: “మొదట్లో మేము వాళ్లతో అరగంటసేపు ఉండేవాళ్లం, అయితే అక్కడివాళ్లు ఇంకాసేపు ఉండమనేవాళ్లు. ఇప్పుడు చర్చలు గంటసేపు జరుగుతున్నాయి. నిజానికి, వాళ్లలో ఒకామె ఆ చర్చలు రెండు గంటలపాటు జరగాలని అంటుంది!” వాళ్లలో కొంతమందికి చూపు ఉండదు, కొంతమంది మంచం నుండి లేవలేరు, వస్తువుల్ని చేతితో పట్టుకోలేరు. కాబట్టి చర్చలు జరిగినంతసేపూ యెహోవాసాక్షులు వాళ్లకు సహాయం చేస్తూ, వాళ్లు వీలైనంతగా చర్చల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు.

సందర్శనంలో భాగంగా యెహోవాసాక్షులు, అక్కడి వృద్ధులు కలిసి దేవునికి స్తుతిగీతాలు పాడతారు. తరచూ అక్కడివాళ్లు ఇంకా ఎక్కువ పాటలు పాడదామని అంటుంటారు. వాళ్లలో ఒకరైన జాన్‌ * ఇలా అన్నాడు: “మీరు తీసుకొచ్చే పాటలంటే మాకు చాలా ఇష్టం. వాటివల్ల మేము దేవుని గురించి తెలుసుకుని, ఆయన మీద గౌరవం చూపించగలుగుతున్నాం.” వాళ్లలో ఒకరైన జూడత్‌కు చూపులేదు, ఆమె తనకు నచ్చిన పాటలన్నిటినీ కంఠస్థం చేసింది!

యెహోవాసాక్షులు ఆ వృద్ధుల్లో ప్రతీఒక్కరి బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటారు. నర్సింగ్‌ హోమ్‌లో ఎవరికైనా బాగోలేకపోతే యెహోవాసాక్షులు వాళ్ల గదికి కూడా వెళ్తారని బ్రయన్‌ అనే స్వచ్ఛంద సేవకుడు చెప్తున్నాడు. అతనింకా ఇలా అంటున్నాడు: “మేము వాళ్లతో మాట్లాడి వాళ్లెలా ఉన్నారో చూస్తాం. వీలైతే ఇంకో రోజు కూడా వచ్చి, వాళ్ల ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాం.”

“దేవుడే మిమ్మల్ని మా దగ్గరికి పంపించాడు”

నర్సింగ్‌ హోమ్‌లో ఉండే చాలామంది ఆ సందర్శనాల్ని ఇష్టపడతారు. ప్రతీవారం జరిగే చర్చకు హాజరయ్యే పీటర్‌ ఇలా అంటున్నాడు: “నేను ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్లాలా అని ఆత్రంగా ఎదురు చూస్తుంటాను.” తనను చూసుకుంటున్న పనివాళ్లతో జూడత్‌ ఇలా అంటుంది: “ఈరోజు బుధవారం! దయచేసి, బైబిలు అధ్యయన గుంపుకు వెళ్లడానికి నన్ను రెడీ చేయండి, ఆలస్యంగా వెళ్లడం నాకు ఇష్టంలేదు!”

వృద్ధులు తాము నేర్చుకుంటున్న వాటిని బట్టి ఎంతో సంతోషిస్తున్నారు, ముందెన్నటి కన్నా దేవునికి మరింత దగ్గరగా ఉన్నట్టు భావిస్తున్నారు. యేసు బోధల్లో ఒకదాని గురించి చర్చించాక రాబర్ట్‌ ఇలా అన్నాడు: “బైబిల్లోని ఈ భాగం ముందెప్పుడూ నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది!” ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో నేర్చుకున్న డేవిడ్‌ ఇలా అంటున్నాడు: “ప్రార్థన వల్ల దేవునితో ఒక అనుబంధం ఏర్పడింది, ఇప్పుడు ఆయన నాకొక నిజమైన వ్యక్తిగా ఉన్నాడు.”

భవిష్యత్తు గురించిన బైబిలు వాగ్దానాల్ని నేర్చుకోవడం అంటే వాళ్లకు చాలా ఆసక్తి. లినెట్‌ అనే ఆమె యెహోవాసాక్షులతో ఇలా అంది, “బైబిలుతో ఇంత ఓదార్పును ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.” ఇంకొకామె ఇలా అంది: “దేవుడే మిమ్మల్ని మా దగ్గరికి పంపించాడు!”

మార్గ్‌రట్‌కి ఈ సందర్శనాలు ఎంత నచ్చాయంటే, ఇప్పుడామె స్థానిక రాజ్యమందిరంలో జరిగే యెహోవాసాక్షుల కూటాలకు క్రమంగా హాజరౌతోంది. ఆమె ఆరోగ్యాన్ని, అంతగా కదల్లేని స్థితిని బట్టి, అలా హాజరవ్వడానికి ఆమె చాలా కష్టపడుతుంది. యెహోవాసాక్షులతో ఆమె ఇలా అంది: “మీరు మా అందరికీ బ్రతకడానికి కావల్సింది ఇచ్చారు.”

‘మీరు చాలా మంచి చేస్తున్నారు’

అక్కడ పనిచేసేవాళ్లు కూడా యెహోవాసాక్షుల సందర్శనాల్ని విలువైనవిగా ఎంచుతున్నారు. ఆనా అనే పేరున్న స్థానిక యెహోవాసాక్షి ఇలా అంటుంది: “చర్చల తర్వాత వృద్ధులు చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించడం వల్ల, అక్కడ పనిచేసేవాళ్లు చర్చలకు రమ్మని వృద్ధుల్ని ప్రోత్సహిస్తుంటారు.” ముందు మాట్లాడిన బ్రయన్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “అక్కడ పనిచేసేవాళ్లు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చక్కగా సహకరిస్తారు. తాము చేయగలిగినదాని కన్నా ఎక్కువ సహాయం చేస్తారు.”

తమ ప్రియమైనవాళ్లు ఆ చర్చల్ని ఎంతగా ఆనందిస్తున్నారో చూసి, ఆ వృద్ధుల కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషపడుతుంటారు. అక్కడ ఉండే ఒక వృద్ధురాలి కూతురు యెహోవాసాక్షుల్ని మెచ్చుకుంటూ ఇలా అంది: “మీరు అమ్మకు చాలా మంచి చేస్తున్నారు.”

^ పేరా 7 నర్సింగ్‌ హోమ్‌లో ఉండేవాళ్ల పేర్లు అసలు పేర్లు కావు.