కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

నా జీవితం దాదాపు అదుపు తప్పిపోయింది

నా జీవితం దాదాపు అదుపు తప్పిపోయింది
  • పుట్టిన సంవత్సరం: 1971

  • దేశం: టోంగా

  • ఒకప్పుడు: మత్తుపదార్థాలు తీసుకునేవాణ్ణి, జైలుకు వెళ్లాను

నా గతం

 మేము టోంగాలో ఉండేవాళ్లం. అది 170 ద్వీపాల సముదాయం, అది పసిఫిక్‌ మహాసముద్రం నైరుతి దిక్కున ఉంటుంది. టోంగాలో జీవితం చాలా సాదాసీదాగా ఉంటుంది, కరెంటు గానీ వాహనాలు గానీ ఉండవు. మా ఇంటికి మాత్రం నీటి సరఫరా ఉండేది, మాకు కొన్ని కోళ్లు కూడా ఉండేవి. స్కూలు సెలవు రోజుల్లో నేను, మా అన్న, మా తమ్ముడు పొలం చూసుకోవడానికి నాన్నకు సహాయం చేసేవాళ్లం. ఆ పొలంలో మేము అరటిపండ్లు, కందగడ్డలు, చేమదుంపలు, కర్రపెండలం పండించేవాళ్లం. వాటిని అమ్మితే వచ్చే డబ్బుతో, చిన్నచిన్న పనులు చేస్తే వచ్చే డబ్బుతో నాన్న ఇంటిని చూసుకునేవాడు. ఆ ద్వీపాల్లో ఉండే చాలామందిలాగే మా కుటుంబానికి కూడా బైబిలంటే చాలా గౌరవం ఉండేది, మేము క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవాళ్లం. అయినాసరే, కాస్త సంపన్న దేశానికి వెళ్తేనే మా జీవితాలు బాగుపడతాయని నమ్మేవాళ్లం.

 నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు మా మామయ్య మేము అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. అక్కడి పద్ధతులకు అలవాటుపడడం మాకు చాలా కష్టమైంది! ఆర్థికంగా మా పరిస్థితి కాస్త మెరుగుపడింది, కానీ మేము ఉన్న చోట ఘోరమైన నేరాలు జరిగేవి, మత్తుపదార్థాలు ఎక్కువగా వాడేవాళ్లు. రాత్రుళ్లు తరచూ కాల్పుల శబ్దం వినిపించేది, మా ఇరుగుపొరుగు వాళ్లలో చాలామంది నేరస్తుల ముఠాలకు భయపడుతూ ఉండేవాళ్లు. తమనుతాము కాపాడుకోవడానికి, గొడవలు పరిష్కరించుకోవడానికి చాలామంది తమ దగ్గర తుపాకి పెట్టుకునేవాళ్లు. అలాంటి ఒక గొడవలో నాకు బుల్లెట్‌ తగిలింది, అది ఇప్పటికీ నా ఛాతీలోనే ఉంది.

 హైస్కూల్లో చదువుతున్నప్పుడు నాకు మిగతాపిల్లల్లా ఉండాలని అనిపించేది. మెల్లమెల్లగా అల్లరి పార్టీలు, విపరీతంగా తాగడం, దౌర్జన్యం, మత్తుపదార్థాలు అలవాటయ్యాయి. కొకెయిన్‌కి బానిసనయ్యాను. మత్తుపదార్థాలు కొనుక్కోవడానికి దొంగతనాలు మొదలుపెట్టాను. మా ఇంట్లోవాళ్లు భక్తిగా చర్చికి వెళ్తూ ఉన్నా, చెడ్డ పనులు చేయమనే తోటివాళ్ల ఒత్తిడిని ఎదిరించడానికి నాకు ఎలాంటి సహాయం దొరకలేదు. నేను చేసిన దౌర్జన్యాలకు నన్ను చాలాసార్లు అరెస్టు చేశారు. నా జీవితం దాదాపు అదుపు తప్పిపోయింది! చివరికి నన్ను జైల్లో పెట్టారు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

 1997లో నేను జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు నా చేతిలో బైబిలు ఉండడం తోటి ఖైదీ చూశాడు. ఆ రోజు క్రిస్మస్‌, టోంగా వాళ్లు దాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. క్రీస్తు పుట్టుక గురించి బైబిలు నిజంగా ఏం చెప్తుందో నీకు తెలుసా అని అతను నన్ను అడిగాడు. దాని గురించి నాకు అసలేమీ తెలీదు. అతను యేసు పుట్టుక గురించి బైబిలు ఎంత సరళంగా చెప్తుందో నాకు చూపించాడు, క్రిస్మస్‌ సమయంలో చేసే చాలా ఆచారాల గురించిన ప్రస్తావన కూడా బైబిల్లో లేదని నేను గమనించాను. (మత్తయి 2:1-12; లూకా 2:5-14) అది చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది, బైబిలు ఇంకా ఏం చెప్తుందో తెలుసుకోవాలనుకున్నాను. అతను ప్రతీవారం జైల్లో జరిగే యెహోవాసాక్షుల కూటాలకు వెళ్తూ ఉండేవాడు, కాబట్టి అతనితో పాటు నేనూ వెళ్లాలనుకున్నాను. అక్కడ వాళ్లు బైబిల్లోని ప్రకటన పుస్తకం చర్చిస్తున్నారు. వాళ్లు చెప్పింది చాలావరకు నాకు అర్థంకాలేదు, కానీ ప్రతీది బైబిలు నుండి చెప్తున్నారని మాత్రం గమనించాను.

 వాళ్లు నాతో కూడా బైబిలు అధ్యయనం చేస్తామని చెప్పినప్పుడు నేను సరే అన్నాను. దానివల్ల నేను మొదటిసారి, ఈ భూమంతా అందమైన తోటగా మారుతుందనే బైబిలు వాగ్దానం గురించి తెలుసుకున్నాను. (యెషయా 35:5-8) దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నా జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాలని నాకు అర్థమైంది. నేను చెడ్డ అలవాట్లకు బానిసగా ఉంటే, దేవుడు వాగ్దానం చేసిన మంచి పరిస్థితుల్లో ఉండనని గ్రహించాను. (1 కొరింథీయులు 6:9, 10) కాబట్టి నా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని, పొగతాగడం మానుకోవాలని, ఇంకెప్పుడూ అతిగా తాగకూడదని, మత్తుపదార్థాలు తీసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.

 1999లో, నా జైలుశిక్ష ముగిసే ముందు అధికారులు నన్ను వేరే జైలుకు మార్చారు. సంవత్సరం కన్నా ఎక్కువ కాలం పాటు నేను యెహోవాసాక్షుల్ని కలవలేకపోయాను. అయితే నా జీవితంలో మార్పులు చేసుకుంటూనే ఉండాలని తీర్మానించుకున్నాను. తర్వాతి సంవత్సరం, అమెరికాలో ఉండడానికి నాకిచ్చిన అనుమతిని ప్రభుత్వం రద్దుచేసింది, నన్ను తిరిగి టోంగాకి పంపించేశారు.

 టోంగాలో నేను చాలా ఆత్రంగా యెహోవాసాక్షుల్ని వెతికి మళ్లీ బైబిలు అధ్యయనం మొదలుపెట్టాను. నేర్చుకుంటున్న విషయాలు నాకు బాగా నచ్చాయి. అమెరికాలో లాగే మా ద్వీపంలోని యెహోవాసాక్షులు కూడా ప్రతీది బైబిలు నుండి చెప్పేవాళ్లు. అది నాకు చాలా నచ్చింది.

 మా నాన్న చర్చిలో మంచి హోదాలో ఉండేవాడు కాబట్టి చుట్టుపక్కల వాళ్లకు ఆయన గురించి బాగా తెలుసు. నేను యెహోవాసాక్షులతో కలుస్తున్నానని తెలిసి మా ఇంట్లోవాళ్లు కంగారుపడ్డారు, చాలా కోప్పడ్డారు. అయితే బైబిలు సూత్రాలు పాటిస్తూ నేను చెడ్డ అలవాట్లు మానుకుంటున్నానని గమనించినప్పుడు వాళ్లు చాలా సంతోషించారు.

టోంగాలోని చాలామంది మగవాళ్లలా నేను ప్రతీవారం కొన్ని గంటల పాటు కావా తాగేవాణ్ణి

 నేను మానేయడానికి చాలా కష్టపడిన చెడ్డ అలవాట్లలో ఒకటి, కావా అనే పానీయాన్ని అతిగా తాగడం. మా సంప్రదాయంలో చాలామంది అలా అతిగా తాగేవాళ్లు. మిరియాల చెట్టు వేళ్ల నుండి తయారుచేసే ఆ పానీయం మత్తు కలిగిస్తుంది. టోంగాలోని మగవాళ్లు ప్రతీవారం కొన్ని గంటల పాటు దాన్ని తాగుతుంటారు. నేను టోంగాకి తిరిగొచ్చిన తర్వాత, ప్రతీ రాత్రి కావా క్లబ్బుకు వెళ్లి మత్తెక్కే వరకు ఆ పానీయం తాగేవాణ్ణి. నేను అలా తయారవ్వడానికి ఒక కారణం, బైబిలు ప్రమాణాల మీద ఏమాత్రం గౌరవంలేని నా స్నేహితులు. అయితే, నా అలవాట్లు దేవునికి నచ్చవని అర్థంచేసుకోవడానికి యెహోవాసాక్షులు నాకు సహాయం చేశారు.

 నేను యెహోవాసాక్షుల కూటాలన్నిటికీ వెళ్లడం మొదలుపెట్టాను. అలా దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించే వాళ్లతో కలవడం వల్ల నా చెడ్డ అలవాట్లను మానుకోగలిగాను. 2002లో నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షిని అయ్యాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

 ‘యెహోవా మీ విషయంలో ఓర్పు చూపిస్తున్నాడు. ఎవ్వరూ నాశనం కావడం ఆయనకు ఇష్టంలేదు, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని ఆయన కోరుకుంటున్నాడు’ అని బైబిలు చెప్తుంది; దేవుడు అలా ఓర్పు చూపించడం వల్ల నేను ప్రయోజనం పొందాను. (2 పేతురు 3:9) అవినీతితో నిండిన ఈ వ్యవస్థను కావాలనుకుంటే దేవుడు ఎప్పుడో నాశనం చేసివుండొచ్చు. కానీ నాలాంటి వాళ్లు తనతో స్నేహం చేయగలిగేలా ఆయన ఇంతకాలం ఓపిక పడుతున్నాడు. ఈ విషయంలో ఇతరులకు సహాయం చేసేలా నన్ను ఉపయోగించుకుంటాడని అనుకుంటున్నాను.

 యెహోవా సహాయంతో, నా జీవితం పూర్తిగా అదుపు తప్పకుండా చూసుకోగలిగాను. ప్రాణాలు తీసే వ్యసనం కోసం ఇప్పుడు నేను దొంగతనాలు చేయట్లేదు. బదులుగా, యెహోవా స్నేహితులు అయ్యేలా చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేస్తున్నాను. యెహోవాసాక్షులతో కలవడం వల్ల, నాకు మంచి భార్య దొరికింది. ఆమె పేరు టియ. మాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, మాది చాలా సంతోషమైన కుటుంబం. మేమందరం కలిసి, శాంతియుత పరిస్థితుల్లో ఎప్పటికీ జీవించవచ్చనే బైబిలు వాగ్దానం గురించి ఇతరులకు చెప్తుంటాం.