కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

“జీవితంలో నాకు ఏదీ తక్కువ కాలేదని అనిపించింది”

“జీవితంలో నాకు ఏదీ తక్కువ కాలేదని అనిపించింది”
  • పుట్టిన సంవత్సరం: 1962

  • దేశం: కెనడా

  • ఒకప్పుడు: అనైతికంగా జీవించాడు

నా గతం

 నేను కెనడాలో క్విబెక్‌ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన మాంట్రియల్‌లో పుట్టాను. నాకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్లు. రోజ్‌మాంట్‌ అనే ప్రశాంతమైన ప్రాంతంలో మా అమ్మానాన్నలు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మేమంతా ప్రశాంతంగా, హాయిగా జీవించాం.

 చిన్నప్పటి నుండి నాకు బైబిలు అంటే చాలా ఇష్టం. 12 ఏళ్లప్పుడు కొత్త నిబంధనలో యేసు జీవితం గురించి చదివాను, అది నాకు బాగా నచ్చింది, ఇప్పటికీ నాకది గుర్తుంది. ఇతరుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, కనికరం నాకు బాగా నచ్చాయి, నేనూ ఆయనలా ఉండాలనుకున్నాను. విచారకరంగా, పెద్దయ్యాక చెడు స్నేహాల వల్ల ఆ కోరిక తగ్గిపోయింది.

 మా నాన్న సాక్సోఫోన్‌ వాయించేవాడు. ఆయన నాకు తన సాక్సోఫోన్‌నే కాదు, సంగీతం మీద తనకున్న ప్రేమను కూడా వారసత్వంగా ఇచ్చాడు. తర్వాత అదే నా జీవితం అయిపోయింది. సంగీతం మీద ఇష్టంతో, వెంటనే గిటార్‌ వాయించడం నేర్చుకున్నాను. తర్వాత, కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఒక రాక్‌ బ్యాండ్‌ మొదలుపెట్టాను, మేము చాలా చోట్ల ప్రోగ్రామ్స్‌ చేశాం. మ్యూజిక్‌ కంపెనీలకు చెందిన కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు నన్ను చూసి, నాకు ఆఫర్లు ఇచ్చారు. ఒక పెద్ద రికార్డింగ్‌ కంపెనీతో పని చేస్తానని కాంట్రాక్ట్‌ మీద సంతకం పెట్టాను. నా సంగీతానికి చాలా పాపులారిటీ వచ్చింది, క్విబెక్‌లో నా పాటల్ని రేడియోలో ఎప్పుడూ ప్లే చేస్తుండేవాళ్లు.

 జీవితంలో నాకు ఏదీ తక్కువ కాలేదని అనిపించింది. యౌవనంలోనే చాలా పెద్ద పేరు వచ్చింది. నాకు నచ్చింది చేస్తూ చాలా డబ్బు సంపాదించాను. పగలంతా జిమ్‌లో వ్యాయామం చేసేవాణ్ణి, ఇంటర్వ్యూలు, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేవాణ్ణి, టీవీ కార్యక్రమాల్లో కనిపించేవాణ్ణి. రాత్రంతా ప్రోగ్రామ్స్‌ చేసేవాణ్ణి, పార్టీలకు వెళ్లేవాణ్ణి. వందలమంది ఫ్యాన్స్‌ వల్ల వచ్చే ఒత్తిడిని తట్టుకోవడానికి యౌవనంలోనే మద్యం సేవించడం మొదలుపెట్టాను, మెల్లగా డ్రగ్స్‌ తీసుకోవడం అలవాటైంది. నేను చాలా నిర్లక్ష్యంగా, విచ్చలవిడిగా జీవించాను.

 నేను సంతోషంగా ఉన్నాను అనుకుని కొందరు నన్ను చూసి అసూయపడ్డారు. కానీ లోపల ఏదో తెలీని వెలితి నన్ను వేధించేది. ముఖ్యంగా నేను ఒంటరిగా ఉన్నప్పుడు అలా ఎక్కువగా అనిపించేది. ఆందోళనతో కృంగిపోయాను. విషాదకరంగా, నాకు బాగా సక్సెస్‌ వచ్చిన సమయంలో నా ప్రొడ్యూసర్లు ఇద్దరు ఎయిడ్స్‌ వల్ల చనిపోయారు. నేను చాలా షాక్‌కు గురయ్యాను. నాకు సంగీతమంటే చాలా ఇష్టం కానీ దానితోపాటు వచ్చే జీవనశైలి నాకు విరక్తి కలిగించింది.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే ...

 నాకు చాలా సక్సెస్‌ వచ్చినా, ఈ లోకంలో చాలా చెడు జరుగుతుందనే విషయం నాకు తెలుసు. ఇంత అన్యాయం ఎందుకు ఉంది? దేవుడు ఎందుకు చర్య తీసుకోవడం లేదనే ప్రశ్న వచ్చేది. నేను చాలాసార్లు జవాబుల కోసం దేవునికి ప్రార్థించాను. మ్యూజిక్‌ టూర్ల మధ్యలో కొన్ని రోజులు ఖాళీ ఉండేది. ఆ సమయంలో నేను మళ్లీ బైబిలు చదవడం మొదలుపెట్టాను. నేను చదివినదాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను, కానీ లోకాంతం చాలా దగ్గర్లోనే ఉందని మాత్రం అర్థమైంది.

 యేసు ఒకసారి 40 రోజులు ఎడారిలో ఉపవాసం ఉన్నాడని బైబిల్లో చదివాను. (మత్తయి 4:1, 2) అప్పుడు, నేనూ అలా చేస్తే బహుశా దేవుడు నాకూ కనిపిస్తాడేమో అని నాకు అనిపించింది. కాబట్టి ఉపవాసం మొదలుపెట్టడానికి ఒక తేదీ పెట్టేసుకున్నాను. ఉపవాసం మొదలుపెట్టడానికి రెండు వారాల ముందు, ఇద్దరు యెహోవాసాక్షులు నా తలుపు తట్టారు, వాళ్లు రావడం నాకు ముందే తెలిసినట్లు నేను వాళ్లను లోపలికి ఆహ్వానించాను. వాళ్లలో ఒకడైన జాక్‌ కళ్లల్లోకి చూసి ఇలా అడిగాను: “మనం చివరిరోజుల్లో జీవిస్తున్నామో లేదో ఎలా తెలుస్తుంది?” జవాబుగా ఆయన బైబిలు తెరిచి 2 తిమోతి 3:1-5 చదివాడు. నేను వాళ్లమీద ప్రశ్నల వర్షం కురిపించాను. వాళ్లు చెప్పిన అర్థవంతమైన, లేఖనాధారిత జవాబులు నాకు చాలా నచ్చాయి. వాళ్లను ఇంకొన్నిసార్లు కలిశాక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది.

 నేను సాక్షులతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. కొన్ని రోజులకు పొడుగ్గా ఉన్న నా జుట్టును కత్తిరించాను, దగ్గర్లోని రాజ్యమందిరంలో జరిగే ప్రతీ మీటింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ అందరు నన్ను ఆప్యాయంగా ఆహ్వానించడం చూసినప్పుడు, మొత్తానికి నేను సత్యాన్ని కనుగొన్నానని అనిపించింది.

 అయితే, నేను బైబిలు అధ్యయనంలో నేర్చుకుంటున్న వాటిని పాటించడానికి చాలా మార్పులు చేసుకోవాలని గ్రహించాను. మొదటిగా, నేను డ్రగ్స్‌ తీసుకోవడం మానేయాలి, నా విచ్చలవిడి జీవితాన్ని వదిలేయాలి. స్వార్థపూరితమైన నా వైఖరిని మార్చుకొని, ఇతరుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం నేర్చుకోవాలి. నాకు భార్య లేదు కాబట్టి నా ఇద్దరు పిల్లల భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాలు నేను ఒక్కడినే చూసుకోవడం నేర్చుకోవాలి. అందుకే నేను నా మ్యూజిక్‌ కెరీర్‌ను వదిలేసి, ఒక ఫ్యాక్టరీలో తక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో చేరాను.

 ఈ మార్పులన్నీ చేసుకోవడం అంత ఈజీ కాదు. డ్రగ్స్‌ మానేసేటప్పుడు దానికి సంబంధించిన శారీరక సమస్యలు ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు మళ్లీ డ్రగ్స్‌ తీసుకున్నాను. (రోమీయులు 7:19, 21-24) విచ్చలవిడి జీవితాన్ని వదిలేయడం చాలా చాలా కష్టమైంది. అంతేకాదు, నా కొత్త ఉద్యోగం వల్ల చాలా అలసిపోయేవాణ్ణి, తక్కువ జీతం వల్ల కూడా బాధగా అనిపించేది. ఒకప్పుడు సంగీతం వాయిస్తూ రెండు గంటల్లో సంపాదించిన డబ్బు కోసం ఇప్పుడు నేను మూడు నెలలు కష్టపడాలి.

 ఈ కష్టమైన మార్పులు చేసుకుంటూ, ముందుకు సాగడానికి ప్రార్థన నాకు సహాయం చేసింది. క్రమంగా బైబిలు చదవడం కూడా చాలా ముఖ్యమని తెలిసింది. కొన్ని బైబిలు వచనాలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి. అందులో ఒకటి 2 కొరింథీయులు 7:1. ఆ వచనం, “మన శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం” అని క్రైస్తవులందర్నీ ప్రోత్సహిస్తోంది. నేను నా చెడు అలవాట్లను మానగలను అనే అభయాన్ని ఇచ్చిన ఇంకో లేఖనం ఫిలిప్పీయులు 4:13. అక్కడ ఇలా ఉంది: “ఎందుకంటే, నాలో శక్తిని నింపే దేవుని వల్ల దేన్నైనా ఎదుర్కొనే బలం నాకుంది.” యెహోవా దేవుడు నా ప్రార్థనలు విని, నేను చివరికి బైబిలు సత్యాన్ని అర్థం చేసుకుని, పాటించేలా నాకు సహాయం చేశాడు. దానితో ఆయనకు నా జీవితాన్ని సమర్పించుకోవాలని నాకనిపించింది. (1 పేతురు 4:1, 2) 1997లో నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే ...

 నా పాత జీవితంలోనే కొనసాగి ఉంటే ఈపాటికి నేను చనిపోయి ఉండేవాడిని అని నాకు బాగా తెలుసు. బదులుగా నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను! నా ప్రియమైన భార్య ఎల్వీ నాకు దొరికిన ఒక గొప్ప వరం. మేమిద్దరం కలిసి పూర్తికాల సేవకులుగా ఇతరులకు బైబిలు గురించి నేర్పిస్తూ ఎంతో ఆనందిస్తున్నాం. ఎంతో సంతోషంతో, సంతృప్తితో జీవిస్తున్నాను. యెహోవా నన్ను తనవైపు ఆకర్షించినందుకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి.—యోహాను 6:44.