కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

ఒకప్పుడు గొడవలు, కొట్లాటలే నా ప్రపంచం

ఒకప్పుడు గొడవలు, కొట్లాటలే నా ప్రపంచం
  • పుట్టింది: 1956

  • దేశం: కెనడా

  • ఒకప్పుడు: జీవితంలో నిరాశ, తాగుబోతు-తిరుగుబోతు, అందరితో గొడవలు పెట్టుకునేవాడు

నా గతం

 నేను కెనడాలోని అల్బర్టాలో ఉన్న కాల్గరీ అనే సిటీలో పుట్టాను. నా చిన్నప్పుడే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు; అమ్మ నన్ను తీసుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అమ్మమ్మ, తాతయ్య మా ఇద్దర్నీ కంటికి రెప్పలా చూసుకున్నారు, నేను చాలా ఆనందంగా ఉండేవాడిని. ఇప్పటికీ, ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా మనసంతా సంతోషంగా అనిపిస్తుంది.

 కానీ నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు అందమైన కలలా ఉన్న నా జీవితం హఠాత్తుగా చెదిరిపోయింది! కారణం? అమ్మ మా నాన్నను మళ్లీ పెళ్లి చేసుకోవడం. వాళ్ల పెళ్లి తర్వాత అమెరికాలో ఉన్న మిస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌లో ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్లిపోయాం. మా నాన్న కోపిష్ఠి అని, కొడతాడని అర్థం కావడానికి ఎక్కువకాలం పట్టలేదు. నేను కొత్త స్కూల్లో చేరిన మొదటి రోజు ఇంటికి తిరిగొచ్చాను. స్కూల్లో కొందరు నన్ను కొట్టినా, ఏడ్పించినా నేను వాళ్లను తిరిగి ఏమీ అనలేదని నాన్నకు తెలిసింది. ఆయనకు నా మీద ఎంత కోపం వచ్చిందంటే, స్కూల్లో పిల్లలు కొట్టిన దానికన్నా చాలా గట్టిగా నన్ను కొట్టాడు. ‘ఓహో! ఎవరైనా ఏదైనా అంటే తిరిగి కొట్టాలన్న మాట’ అని ఆరోజు అనుకున్నాను! నాకు ఏడేళ్లు ఉన్నప్పుడే మిగతా పిల్లల్ని కొట్టడం మొదలుపెట్టాను.

 మా నాన్న సూటిపోటి మాటలతో అమ్మకు చాలా కోపం తెప్పించేవాడు; అమ్మ కూడా అంతే కోపంగా ఆయన్ని తిట్టేది, కొట్టేది కూడా. ఇదంతా చూసిన నేను 11 ఏళ్లు కూడా నిండకుండానే డ్రగ్స్‌కు, మందుకు అలవాటుపడ్డాను. ఎంత కోపిష్ఠిగా మారిపోయానంటే, వీధిలో ఎవరు కనిపిస్తే వాళ్లతో ఎప్పుడూ గొడవలు పడేవాడిని. నా హైస్కూల్‌ పూర్తయ్యే సరికి ఒక రౌడీలా మారిపోయాను.

 నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడు, యూ.స్‌. మెరైన్‌ కార్ప్స్‌లో చేరాను. ఒక మనిషిని ఎలా చంపాలో వాళ్ల శిక్షణ ద్వారా తెలుసుకున్నాను. ఐదేళ్ల తర్వాత, మిలిటరీ వదిలేసి సైకాలజీ చదవడానికి వెళ్లాను. అది పూర్తిచేసి ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లో చేరాలని అనుకున్నాను. దాంతో అమెరికాలోని ఒక యూనివర్సిటీలో చేరాను, ఆ తర్వాత కెనడాకు వెళ్లిపోయి అక్కడ చదువును కొనసాగించాను.

 యూనివర్సిటీలో చదువుతుండగానే మనుషుల మీద, మొత్తం సమాజం మీద విసుగు వచ్చేసింది. మనుషులందరూ స్వార్థపరుల్లా అనిపించారు, ఈ ప్రపంచం మొత్తం పాడైపోయినట్లు, మనుషుల సమస్యలకు అసలు పరిష్కారమే లేనట్లు అనిపించింది! ఈ ప్రపంచాన్ని మార్చడం మనుషుల వల్ల కాదని అప్పుడు ఫిక్స్‌ అయిపోయాను.

 జీవితంలో చేయడానికి ఏమీ లేదని అనిపించాక మందుకు, డ్రగ్స్‌కు అలవాటుపడి మత్తులో తేలుతూ ఉండేవాడిని; డబ్బు సంపాదించడం, అమ్మాయిలతో సుఖాన్ని అనుభవించడం ఇదే జీవితంగా బ్రతికాను. ఈ పార్టీ అయిపోతే, ఇంకో పార్టీ... ఈ అమ్మాయి అయిపోతే, ఇంకో అమ్మాయి ఇవే ఆలోచనలు. మిలిటరీ శిక్షణ ఉందనే ధైర్యంతో ఎవర్ని పడితే వాళ్లని కొట్టేవాడిని. నేను ఏది రైట్‌ అనుకుంటే అదే రైట్‌, నా దృష్టిలో ఎవరైనా తప్పు చేస్తున్నట్లు అనిపిస్తే వదిలిపెట్టేవాడిని కాదు. నా జీవితం మీద నాకే కంట్రోల్‌ లేకుండా పోయింది; గొడవలు, కొట్లాటలే నా ప్రపంచం.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే. . .

 ఒకరోజు మా ఇంటి బేస్‌మెంట్‌లో నేనూ నా ఫ్రెండ్‌ డ్రగ్స్‌ తీసుకుని విపరీతంగా మత్తులో తేలుతూ, గంజాయిని అక్రమంగా అమ్మడానికి సిద్ధం చేస్తున్నాం. ఆ పని మధ్యలో నా ఫ్రెండ్‌ నన్ను, ‘నువ్వు దేవున్ని నమ్ముతావా?’ అని అడిగాడు. “ప్రపంచంలో ఉన్న కష్టాలన్నిటికీ కారణం ఆయనే అయితే, ఆయన గురించి తెల్సుకోవాల్సిన అవసరం నాకు లేదు” అన్నాను. తర్వాతి రోజు కొత్తగా ఒక ఉద్యోగంలో చేరాను. మొదటి రోజే, యెహోవాసాక్షి అయిన తోటి ఉద్యోగి ఒకరు నా దగ్గరికి వచ్చి, “ప్రపంచంలో ఉన్న కష్టాలన్నిటికీ కారణం దేవుడని అనుకుంటున్నావా?” అని అడిగాడు. నిన్నే కదా ఈ మాట అన్నాను అని గుర్తొచ్చి, అతనేం చెప్తాడో వినాలనే ఆసక్తి కలిగింది. తర్వాతి ఆరు నెలలు, ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం; జీవితం గురించి నాకున్న ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు బైబిల్లో జవాబులు కూడా చూపించాడు.

 అప్పుడు నేనొక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్న విషయాలు చెప్తే వినడానికి ఇష్టపడేది కాదు. ఒక ఆదివారం తన దగ్గరికి వెళ్లి, మనతో బైబిలు గురించి మాట్లాడడానికి యెహోవాసాక్షుల్ని ఇంటికి పిలిచాను అని చెప్పాను. తర్వాతి రోజు చూస్తే తను ఇంట్లో కనిపించలేదు, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకుని వెళ్లిపోయింది. బయటికెళ్లి చాలా ఏడ్చాను, సహాయం చేయమని దేవున్ని బ్రతిమాలుకున్నాను. నేను యెహోవా అనే దేవుని పేరు ఉపయోగించి ప్రార్థన చేయడం అదే మొదటిసారి!—కీర్తన 83:18.

 రెండు రోజుల తర్వాత, యెహోవాసాక్షులైన ఒక జంట నాకు స్టడీ మొదలుపెట్టారు. వాళ్లు వెళ్లిపోయాక మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు అనే పుస్తకాన్ని చదవడం కొనసాగించి, ఆ రాత్రికే పూర్తి చేసేశాను. a యెహోవా దేవుని గురించి, ఆయన కొడుకైన యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న విషయాలు నా మనసుకు చాలా నచ్చాయి. యెహోవాకు దయ ఉందని, మన బాధల్ని చూసి ఆయన బాధపడుతున్నాడని తెలుసుకున్నాను. (యెషయా 63:9) దేవునికి నాపై ఉన్న ప్రేమ గురించి, మరి ముఖ్యంగా నా కోసం తన కొడుకుని బలి ఇవ్వడం గురించి తెలుసుకున్నప్పుడు నిజంగా చలించిపోయాను. (1 యోహాను 4:10) యెహోవాకు ‘ఎవ్వరూ నాశనమవ్వడం ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.’ అందుకే నా విషయంలో ఆయన అంత ఓర్పు చూపించాడని అర్థమైంది. (2 పేతురు 3:9) యెహోవా నన్ను తనవైపు ఆకర్షించుకుంటున్నట్లు అనిపించింది.—యోహాను 6:44.

 ఆ వారం నుండే మీటింగ్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు పొడవు జుట్టు, చెవికి పోగులు ఉండేవి, చూస్తే భయపడేలా ఉండేవాడిని; కానీ యెహోవాసాక్షులు నన్ను చాలా రోజుల తర్వాత కలిసిన బంధువును చూసినట్లు చూశారు. నిజమైన క్రైస్తవుల్లా ప్రవర్తించారు. మళ్లీ అమ్మమ్మ ఇంటికి తిరిగెళ్లినట్టు అనిపించింది, ఇంకా చెప్పాలంటే అమ్మమ్మ ఇంటికన్నా కూడా చాలా అద్భుతంగా అనిపించింది.

 బైబిల్లో నేర్చుకుంటున్న విషయాలకు తగ్గట్టుగా నా జీవితంలో మార్పులు చేసుకుంటూ వచ్చాను. జుట్టు కత్తిరించుకున్నాను, అమ్మాయిలతో తిరగడం లాంటివి ఆపేశాను, మందు-డ్రగ్స్‌ విడిచిపెట్టేశాను. (1 కొరింథీయులు 6:9, 10; 11:14) యెహోవాను సంతోషపెట్టాలని అవన్నీ చేశాను. ఆయనకు ఫలానా పని అసహ్యం అని తెలిసిన వెంటనే, గుండెల్లో గునపాలతో గుచ్చినట్లు అనిపించేది. ‘ఇలా ప్రవర్తించడం తప్పు’ అని నాకు నేను చెప్పుకునేవాడిని. ఆరు నూరైనా నా ఆలోచనలు, పనులు మార్చుకోవాలని ప్రయత్నించాను. యెహోవాకు నచ్చినట్లు చేయడం మొదలుపెట్టాక జీవితం హాయిగా అనిపించింది. స్టడీ మొదలుపెట్టిన ఆరు నెలలకు, అంటే 1989 జూలై 29న బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే. . .

 నా అలవాట్లను, పద్ధతుల్ని మార్చుకోవడానికి బైబిలు సహాయం చేసింది. ఒకప్పుడు నాకు నచ్చని వ్యక్తి ఎదురుపడితే రాక్షసుడిలా ప్రవర్తించేవాడిని. కానీ ఇప్పుడు మనుషులందరితో శాంతిగా ఉండడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాను. (రోమీయులు 12:18) ఇందులో నేను చేసిందేమీ లేదు; గొప్పతనమంతా యెహోవా ఇచ్చిన వాక్యానిది, ఆయన పవిత్రశక్తిదే.—గలతీయులు 5:22, 23; హెబ్రీయులు 4:12.

 ఒకప్పుడు డ్రగ్స్‌ మత్తులో ఉంటూ, అమ్మాయిలతో గడుపుతూ, గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడని. కానీ ఇప్పుడు యెహోవా దేవున్ని సంతోషపెడుతూ, ఆయన కోసం నేను చేయగలిగినదంతా చేస్తూ జీవిస్తున్నాను. అందులో భాగంగా, ఇతరులకు ఆయన గురించి చెప్తున్నాను. బాప్తిస్మం తీసుకున్న కొన్నేళ్ల తర్వాత, అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో సేవ చేయడానికి వేరే దేశం వెళ్లిపోయాను. ఇప్పటిదాకా ఎంతోమందికి యెహోవా గురించి నేర్పించాను, బైబిలు వాళ్ల జీవితాల్లో తెచ్చిన మార్పులను చూశాను. అంతకన్నా సంతోషకరమైన విషయం ఏంటంటే, నాలో వచ్చిన మార్పును చూసి మా అమ్మ కూడా యెహోవాసాక్షి అయింది.

 1999​లో ఎల్‌ సాల్వడార్‌లో ఇప్పుడు SKE అని పిలుస్తున్న పాఠశాలకు హాజరయ్యాను. మంచివార్తను ముందుండి ప్రకటించడం, బోధించడం, సంఘాన్ని కాయడం ఎలాగో ఆ పాఠశాల చక్కగా నేర్పించింది. అదే సంవత్సరంలో నేను యూహేనియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మేమిద్దరం గ్వాటెమాలలో పూర్తికాల సేవకులుగా పనిచేస్తున్నాం.

 ఇప్పుడు నాకు మనుషుల మీద విరక్తి లేదు, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. బైబిలు చెప్తున్నవాటిని పాటించడం వల్ల చెడు తిరుగుళ్లు, గొడవలు మానేశాను; నిజమైన ప్రేమను, మనశ్శాంతిని రుచి చూస్తున్నాను.

a యెహోవాసాక్షులు ఇప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకాన్ని స్టడీ చేయడానికి ఉపయోగిస్తున్నారు.