కంటెంట్‌కు వెళ్లు

వాషింగ్‌ మెషిన్‌ కింద దాచిన పేపర్లు

వాషింగ్‌ మెషిన్‌ కింద దాచిన పేపర్లు

జరీన బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాక, రష్యా విడిచి తన సొంత దేశమైన సెంట్రల్‌ ఆసియాకు వచ్చేసింది. ఆమె తన ఇద్దరు కూతుళ్లకు కూడా తన నమ్మకాలు నేర్పించాలని అనుకుంది. అయితే జరీన ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల ఆమె వాళ్ల కుటుంబ సభ్యులతో కలిసి ఒకే గది ఉన్న ఇంట్లో ఉండేది. అంటే వాళ్ల అమ్మ, నాన్న, తమ్ముడు, అతని భార్య కూడా అదే గదిలో ఉండేవాళ్లు. జరీన తన పిల్లలకు బైబిలు సత్యాలు నేర్పించకూడదని ఆమె అమ్మానాన్నలు గట్టిగా హెచ్చరించారు. ఒకవేళ జరీన బైబిలు గురించి మాట్లాడినా వినొద్దని పిల్లలకు కూడా చెప్పారు.

తన పిల్లలకు యెహోవా గురించి ఎలా నేర్పించాలా అని జరీన చాలా ఆలోచించేది. (సామెతలు 1:8) తనకు సహాయం చేయమని, కావాల్సిన తెలివిని ఇవ్వమని యెహోవాకు పట్టుదలగా ప్రార్థన చేసేది. కేవలం ప్రార్థన చేయడమే కాదు, దానికి తగ్గట్లుగా కూడా ప్రవర్తించింది. ఆమె తన పిల్లల్ని వాకింగ్‌కు తీసుకెళ్లి, సృష్టిలోని అద్భుతాల గురించి వాళ్లతో మాట్లాడేది. అలాంటి చిన్న సంభాషణల వల్ల ఆ పిల్లలకు సృష్టికర్త మీద ఆసక్తి పెరిగింది.

వాళ్లకున్న ఆసక్తిని పెంచడానికి బైబిలు నిజంగా ఏం బోధిస్తోంది? a అనే పుస్తకాన్ని ఉపయోగించాలని జరీన అనుకుంది. ఆమె పుస్తకంలో ఉన్న పేరాలను, ప్రశ్నలను ఉన్నదున్నట్టు ఒక పేపరు మీద రాసేది. అందులో పిల్లలకు అర్థంకాని విషయాలు ఏమైనా ఉంటే, అవి వాళ్లకు అర్థమయ్యేలా కాస్త వివరంగా రాసేది. తర్వాత ఆ పేపర్లను, ఒక పెన్సిల్‌ను బాత్‌రూంలో వాషింగ్‌ మెషిన్‌ కింద దాచేది. ఆమె కూతుళ్లు అక్కడికి వెళ్లినప్పుడు వాటిని తీసుకుని చదివి, జవాబులు రాసేవాళ్లు.

జరీనకు వేరే ఇల్లు దొరికే వరకు, ఆ పద్ధతిలోనే బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని రెండు అధ్యాయాలను పిల్లలతో స్టడీ చేసింది. ఇల్లు మారాక ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు తన నమ్మకాల గురించి బోధించగలిగింది. ఆమె ఇద్దరు కూతుళ్లు 2016 అక్టోబరులో బాప్తిస్మం తీసుకున్నారు. జరీన తెలివిని, వివేచనను ఉపయోగించి తన పిల్లలకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడం వల్ల ఎంత మంచి ఫలితం వచ్చిందో కదా!

a ఇప్పుడు చాలామంది ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! అనే పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు.