కంటెంట్‌కు వెళ్లు

‘యెహోవా మా ప్రాణాల్ని కాపాడాడు’

‘యెహోవా మా ప్రాణాల్ని కాపాడాడు’

 ఇండియాలో ఉంటున్న సౌభాగ్య అనే స్త్రీ, తాను ప్రాణంగా ప్రేమించే తన భర్తను 2005​లో కోల్పోయింది. ఆయన ఆమెను, వాళ్ల మూడేళ్ల పాప మేఘనను బాగా చూసుకునేవాడు. ఆయన చనిపోవడంతో సౌభాగ్యకి ఇల్లు గడవడం చాలా కష్టమైంది.

 దానికి తోడు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, కొంతమంది సౌభాగ్యని చిన్నచూపు చూసేవాళ్లు. సొంత కుటుంబమే వాళ్లిద్దర్ని అడుక్కునే వాళ్లలా చూశారు, ఆమె వాళ్లకు భారంగా తయారైందని పదేపదే దెప్పిపొడిచేవాళ్లు. ఓదార్పు కోసం చూస్తున్న సౌభాగ్య, దగ్గర్లో ఉన్న ఒక చర్చీకి వెళ్లడం మొదలుపెట్టింది. అయితే అక్కడ కూడా ఆమె దగ్గర డబ్బులు లేవని ఆమెను విలువలేనిదానిగా చూశారు. అయితే సౌభాగ్య తన కాళ్ల మీద తను నిలబడడానికి ఉద్యోగం చేయాలనుకుంది, కానీ చెప్పులు అరిగిపోయేలా తిరిగినా ఆమెకు ఉద్యోగం మాత్రం దొరకలేదు.

 సౌభాగ్య ఇలా అంటుంది: “నాకు ఏ దారి కనిపించలేదు, ఇంక నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ నేను లేకపోతే మా పాప కూడా ఎన్నో బాధలు పడాల్సి వస్తుందని నాకు తెలుసు. అందుకే నేను మా ఇద్దరి ప్రాణాల్ని తీసేయాలనుకున్నాను.” తనను చేరదీసేవాళ్లు ఎవ్వరూ లేరని, తను ఎందుకూ పనికిరాదని భావిస్తూ సౌభాగ్య విషం కొనడానికి బయటికి వెళ్లింది.

 సౌభాగ్య ట్రైన్‌లో తిరిగి తన ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలిజబెత్‌ అనే ఒక యెహోవాసాక్షి, ఆమె దగ్గరికి వచ్చి కూర్చుని ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టింది. సౌభాగ్య తనకు ఉద్యోగం లేదని చెప్పినప్పుడు ఎలిజబెత్‌, ఆమెకు ఉద్యోగం వెతికే విషయంలో సహాయం చేస్తానని చెప్పింది. ఇంకా తను ఒక బైబిలు స్టడీకి వెళ్తున్నానని కూడా చెప్పింది. అది విని సౌభాగ్య ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఇంతకుముందు ఆమె ఎన్నో చర్చీలకు వెళ్లినా బైబిల్ని అధ్యయనం చేయడం గురించి ఎప్పుడూ వినలేదు. బైబిలు స్టడీ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి సౌభాగ్యని తన ఇంటికి రమ్మని ఎలిజబెత్‌ పిలిచింది.

 సౌభాగ్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతోనే ఉంది. కానీ మేఘనని వాళ్ల చుట్టాల్లో ఒకరు ఊరికి తీసుకెళ్లడంతో ఆమె వచ్చేంత వరకు ఆగాలని సౌభాగ్య అనుకుంది.

 ఈలోగా సౌభాగ్య, ఎలిజబెత్‌ ఇంటికి వెళ్లింది. ఆమె తనని ప్రేమగా ఆహ్వానించింది. ఎలిజబెత్‌ బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకం చూపించింది. తన భర్త ఈమధ్యే చనిపోవడంతో సౌభాగ్య, “చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?” అనే అంశం గురించి తెలుసుకోవాలనుకుంది. ఆమె వెంటనే బైబిలు స్టడీకి ఒప్పుకుంది.

 ఎలిజబెత్‌ తర్వాతి వారంలో జరగబోయే సమావేశానికి ఆహ్వానించినప్పుడు సౌభాగ్య దానికి ఒప్పుకుంది. ఆమెకు కార్యక్రమం అంతా బాగా నచ్చింది. ఎంతగా అంటే ఆమె యెహోవాసాక్షుల్లో ఒకరిగా అవ్వాలని నిర్ణయించుకుంది. సమావేశం నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు ఉద్యోగం కూడా దొరికింది.

 సౌభాగ్య బైబిలు స్టడీని కొనసాగించింది. తను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను పూర్తిగా తీసేసుకుంది ఎందుకంటే ఇప్పుడు తన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. కొంతకాలానికి ఆమె, తర్వాత ఆమె కూతురు మేఘన కూడా బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరూ క్రమ పయినీర్లుగా సేవచేస్తున్నారు, అంతేకాదు మేఘన ఇండియాలో ఉన్న ఒక అనువాద కార్యాలయంలో రిమోట్‌ వాలంటీర్‌గా పనిచేస్తుంది.

నేడు సౌభాగ్య, మేఘన

 ఎలిజబెత్‌ ఆ రోజు ట్రైన్‌లో సౌభాగ్య దగ్గరకు వచ్చి ఆమె మీద శ్రద్ధ చూపించి, ఆమెతో సత్యం పంచుకున్నందుకు సౌభాగ్య, మేఘన ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు. వాళ్లు యెహోవాకు కూడా చాలా రుణపడి ఉన్నారు. మేఘన ఇలా అంటుంది: “ఒకవేళ మాకు ఆ రోజు సత్యం తెలియకపోయుంటే మేము ఈ పాటికే చనిపోయుండేవాళ్లం. కానీ మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మా అమ్మ, నేను ఎప్పుడెప్పుడు మా నాన్నను తిరిగి కలుసుకొని హగ్‌ చేసుకుంటామా అని ఎదురుచూస్తున్నాం. అప్పుడు మేము ఆయనకు యెహోవా గురించి చెప్తాం, అలాగే యెహోవా మా ప్రాణాల్ని ఎలా కాపాడాడో కూడా చెప్తాం.”