ఒకప్పుడు వాళ్ల మతంలో ఉండి బయటికి వెళ్లినవాళ్లను యెహోవాసాక్షులు ఎలా చూస్తారు?
మేము ప్రతీఒక్కరితో ప్రేమగా, దయగా, గౌరవంగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తాం. యెహోవాసాక్షుల్లో ఎవరైనా వెనకబడితే, లేదా యెహోవాను ఆరాధించడం ఆపేస్తే మేము అతనితో a కలిసి మాట్లాడి, అతన్ని ప్రేమిస్తున్నామని భరోసా ఇచ్చి, మళ్లీ దేవునికి దగ్గరవ్వాలని కోరుకునేలా సహాయం చేస్తాం.—లూకా 15:4-7.
కొన్నిసార్లు, ఒక వ్యక్తి చేసిన పనుల వల్ల అతన్ని సంఘం నుండి తొలగించాల్సి రావచ్చు. (1 కొరింథీయులు 5:13) అయితే, మేము మా తోటి ఆరాధకుల్ని ప్రాణంగా ప్రేమిస్తాం కాబట్టి వాళ్లు సంఘం నుండి తొలగించబడే పరిస్థితి రాకుండా, ముందే వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ వాళ్లు సంఘం నుండి తొలగించబడినా, బైబిలు చెప్తున్నట్టు మేము వాళ్ల మీద ప్రేమ, గౌరవం చూపించడం మానం.—మార్కు 12:31; 1 పేతురు 2:17.
ఒక వ్యక్తిని సంఘం నుండి ఎందుకు తొలగించాల్సి వస్తుంది?
ఒక క్రైస్తవుడు ఘోరమైన పాపం చేసి, మారడానికి ఇష్టపడకపోతే అతన్ని సంఘం నుండి తొలగించాలని బైబిలు స్పష్టంగా చెప్తుంది. b (1 కొరింథీయులు 5:11-13) ఎలాంటి ఘోరమైన పాపాల వల్ల తొలగించబడే అవకాశం ఉందో బైబిలు చెప్తుంది. ఉదాహరణకు, వ్యభిచారం, తాగుబోతుతనం, హత్య, గృహ హింస, దొంగతనం లాంటివి.—1 కొరింథీయులు 6:9, 10; గలతీయులు 5:19-21; 1 తిమోతి 1:9, 10.
అయితే, ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసిన వెంటనే మేము అతన్ని సంఘం నుండి తొలగించం. ముందుగా సంఘపెద్దలు c అతనికి తన ప్రవర్తనను మార్చుకునేలా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. (రోమీయులు 2:4) వాళ్లు సౌమ్యంగా, మృదువుగా, దయగా అతనికి నచ్చజెప్పడానికి చూస్తారు. (గలతీయులు 6:1) అలా ప్రేమగా చెప్పడం వల్ల ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. (2 తిమోతి 2:24-26) కానీ, ఎన్నిసార్లు సహాయం చేసినా అతను అలవాటుగా బైబిలు ప్రమాణాల్ని మీరుతూ, పశ్చాత్తాపపడకపోతే అతన్ని సంఘం నుండి తొలగించాలి. అప్పుడు పెద్దలు, ఆ వ్యక్తి ఇక యెహోవాసాక్షి కాదు అని సంఘంలో చిన్న ప్రకటన చేస్తారు.
పెద్దలు సౌమ్యంగా, మృదువుగా, దయగా తప్పిదస్థునికి నచ్చజెప్పడానికి చూస్తారు
అలవాటుగా పాపం చేస్తూ ఉండే వ్యక్తిని తొలగించడం వల్ల ఏంటి ప్రయోజనం? ఒకటి, దేవుని పవిత్రమైన ప్రమాణాల్ని సంఘం పాటించినట్టు అవుతుంది, అలాగే ఆ వ్యక్తి వల్ల సంఘంలో ఉన్న మిగతావాళ్లు చెడిపోకుండా ఉంటారు. (1 కొరింథీయులు 5:6; 15:33; 1 పేతురు 1:16) ఇంకో ప్రయోజనం ఏంటంటే, తప్పు చేసిన వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టి మార్పులు చేసుకునేలా అది అతన్ని కదిలించవచ్చు.—హెబ్రీయులు 12:11.
సంఘం నుండి తొలగించినవాళ్లను యెహోవాసాక్షులు ఎలా చూస్తారు?
సంఘం నుండి తొలగించబడిన వ్యక్తితో “సహవాసం మానేయాలి, కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు” అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 5:11) కాబట్టి మేము అలా తొలగించబడిన వ్యక్తితో సహవసించం. అలాగని అతన్ని పూర్తిగా వదిలేయం. ఒక వ్యక్తిగా అతన్ని గౌరవిస్తాం. అతను మా కూటాలకు రావచ్చు, అక్కడ బహుశా యెహోవాసాక్షులు అతన్ని పలకరించాలని అనుకోవచ్చు. d అతను పెద్దల సహాయం కూడా అడగవచ్చు.
సంఘం నుండి తొలగించబడిన వాళ్లు మా మీటింగ్స్‌కి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు
ఒకవేళ సంఘం నుండి తొలగించబడిన వ్యక్తికి భార్యాపిల్లలు ఉండి, వాళ్లు ఇంకా యెహోవాసాక్షులే అయితే అప్పుడేంటి? అతను యెహోవాను ఆరాధించడం ఆపేసినంత మాత్రాన తన భార్యకు భర్త కాకుండా పోడు, తన పిల్లలకు తండ్రి కాకుండా పోడు. వాళ్లు ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి భార్యాపిల్లలతో అతని బంధం అలాగే ఉంటుంది, వాళ్లందరూ ఒకరితో ఒకరు ప్రేమగానే మెలగాలి.
తొలగించబడిన వ్యక్తి తనను కలవమని సంఘపెద్దల్ని అడగవచ్చు. అప్పుడు వాళ్లు బైబిలు నుండి ప్రేమగా సలహా ఇస్తారు, పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగి రమ్మని దయగా ప్రోత్సహిస్తారు. (జెకర్యా 1:3) ఒకవేళ అతను తప్పు మానుకుని, బైబిల్లో ఉన్న నైతిక ప్రమాణాల ప్రకారం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చూపిస్తే, అతను మళ్లీ సంఘంలో ఒకడవ్వవచ్చు. అప్పుడు సంఘం, కొరింథులోని క్రైస్తవులు చేసినట్టే అతన్ని ‘దయతో క్షమించి ఓదారుస్తుంది.’—2 కొరింథీయులు 2:6-8.
ఒకప్పుడు తొలగించబడి ఇప్పుడు తిరిగి వచ్చినవాళ్లు ఏమంటున్నారు?
ఒకప్పుడు సంఘం నుండి తొలగించబడి, మళ్లీ దేవుని దగ్గరికి తిరిగి వచ్చిన కొంతమంది యెహోవాసాక్షులు ఏమంటున్నారో చూడండి.
“నేను సంఘానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నప్పుడు, బయట ఇన్ని సంవత్సరాలు నేను ఏమేం చేశానో పెద్దలు గుచ్చిగుచ్చి అడుగుతారని అనుకున్నాను. కానీ వాళ్లు సింపుల్‌గా, ‘మీరు గతాన్ని వదిలేసి ముందుకు సాగడం మీద మనసుపెట్టండి చాలు’ అన్నారు. అప్పుడు నా ప్రాణానికి హాయిగా అనిపించింది.”—మారియా, యునైటెడ్ స్టేట్స్.
“నేను ఎప్పుడెప్పుడు తిరిగొస్తానా అని సంఘమంతా ఎదురుచూసింది. నాకు చాలా విలువ ఉందని అనిపించింది. బ్రదర్స్-సిస్టర్స్ అలాగే యెహోవా నన్ను క్షమించారని, జరిగిపోయినదాన్ని వదిలేసి ఇక ముందుకు సాగాలని అనిపించేలా వాళ్లు చేశారు. నేను కోలుకునేలా సహాయం చేయడానికి పెద్దలు ఎప్పుడూ తోడుగా ఉన్నారు. వాళ్లు నన్ను ఓదార్చారు. యెహోవా నాకు ఇప్పటికీ విలువ ఇస్తున్నాడని, ప్రేమిస్తున్నాడని అర్థమయ్యేలా చేశారు.”—మాల్కమ్, సియర్రా లియోన్.
“నాకు సంతోషంగా అనిపించిన విషయం ఏంటంటే, యెహోవా తన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే తన సంస్థను శుభ్రంగా ఉంచుతున్నాడు. తప్పిదస్థుల్ని సంఘం నుండి తొలగించడం అనేది, బయటివాళ్లకు కఠినంగా అనిపించవచ్చేమో కానీ నిజానికి అది చాలా అవసరం, పైగా అందులో ప్రేమ కనిపిస్తుంది. మన పరలోక తండ్రి ఇంత ప్రేమించే, క్షమించే దేవుడని తెలుసుకుని నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతుంది.”—శాండి, యునైటెడ్ స్టేట్స్.
a ఇక్కడ “అతను” అని చెప్పినప్పటికీ, ఈ ఆర్టికల్‌లో ఉన్న విషయాలు ఆడవాళ్లకు, మగవాళ్లకు ఇద్దరికీ వర్తిస్తాయి.
b ఒకప్పుడు, పశ్చాత్తాపపడని తప్పిదస్థుల్ని బహిష్కరించాం అని అనేవాళ్లం. కానీ ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటనే ఉపయోగిస్తూ, వాళ్లను సంఘం నుండి తొలగించాం అని అంటున్నాం.
c పెద్దలు అంటే బైబిలు నుండి బోధిస్తూ, యెహోవా ప్రజల్ని కాసే పరిణతిగల క్రైస్తవ పురుషులు. వాళ్లు దేవుని ప్రజలకు సహాయం చేస్తారు, ప్రోత్సహిస్తారు. వాళ్లు డబ్బుల కోసం పనిచేయరు.—1 పేతురు 5:1-3.
d చాలా అరుదుగా, ఒక వ్యక్తి సంఘాన్ని వదిలేసి వెళ్లడమే కాకుండా, సంఘాన్ని పాడుచేయడానికి లేదా సంఘంలో ఉన్నవాళ్లు తప్పు చేసేలా వాళ్లను చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అదే జరిగితే, అలాంటి వ్యక్తిని “పలకరించకండి” అని బైబిలు ఇస్తున్న ఆజ్ఞను మేము పాటిస్తాం.—2 యోహాను 9-11.

