న్యూయార్క్‌లోని నేటివ్ అమెరికన్‌లకు ఉత్సవం సమయంలో అందిన మంచివార్త
నేటివ్ అమెరికన్ (అమెరికాలో పుట్టి పెరిగిన) ప్రజలు అమెరికాలోని పల్లె ప్రాంతాల్లో ప్రత్యేకంగా కేటాయించిన స్థలాల్లో జీవిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ, నిజానికి నేటివ్ అమెరికన్లలో 70 శాతం కన్నా ఎక్కువమంది పట్టణాల్లో జీవిస్తారు. అమెరికాలోని అతిపెద్ద పట్టణమైన న్యూయార్క్‌లో 2015 జూన్, 5-7 తేదీల్లో నేటివ్ అమెరికన్‌లు “గేట్‌వే టు నేషన్స్” అనే ఉత్సవం జరుపుకున్నారు. a అయితే, న్యూయార్క్‌లోని కొంతమంది యెహోవాసాక్షులకు ఆ ఉత్సవం గురించి తెలిసినప్పుడు, అక్కడికి వెళ్లడానికి వెంటనే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎందుకు?
యెహోవాసాక్షులు బైబిలు ఆధారిత ప్రచురణలను వందల భాషల్లోకి అనువదిస్తారు. అంతేకాదు నేటివ్ అమెరికన్ భాషలైన బ్లాక్‌ఫుట్, డకొట, హోపీ, మోహక్, నవాహో, ఒడావా, ప్లేన్స్ క్రీ వంటి చాలా భాషల్లోకి కూడా యెహోవాసాక్షులు ప్రచురణల్ని అనువదిస్తారు. అందుకే “గేట్‌వే టు నేషన్స్” ఉత్సవం జరుగుతున్న చోట సాక్షులు ఆకర్షణీయమైన టేబుళ్లను, కార్ట్‌లను పెట్టి వాటిమీద తమ ప్రచురణల్ని ఉంచారు. అలా ప్రదర్శన కోసం పెట్టినవాటిలో యు కెన్ ట్రస్ట్ ద క్రియేటర్! అనే కరపత్రం కూడా ఉంది.
మన వెబ్‌సైట్‌లో, పైన చెప్పిన దాదాపు అన్ని భాషల్లో ఆడియో, వీడియో ప్రచురణలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని రికార్డింగ్‌లను ఆసక్తి చూపించిన సందర్శకులకు వినిపించారు కూడా. కానీ, వేరేవాళ్లు తమ పోస్టర్లను, సైన్‌బోర్డులను, ప్రదర్శనలను ఇంగ్లీషు లేదా స్పానిష్ భాషల్లో మాత్రమే ఏర్పాటు చేశారు.
నేటివ్ అమెరికన్ భాషల్లోకి ప్రచురణల్ని అనువదించడానికి యెహోవాసాక్షులు చేసిన కృషిని చూసి, అలాగే పట్టణాల్లోనూ ఇంకా తాముండే ప్రాంతాల్లోనూ చేస్తున్న బైబిలు విద్యా పని గురించి తెలుసుకొని ఈ పండుగకు వచ్చిన చాలామంది ప్రజలు ముగ్ధులయ్యారు. సాక్షులు చేస్తున్న పని గురించి తెలుసుకున్న అక్కడి సిబ్బందిలో ఒకతను తనకు బైబిలు స్టడీ కావాలని అడిగాడు. అతను ఇలా అన్నాడు, “మీరు ఎప్పుడు వస్తారా, బైబిలు గురించి ఎప్పుడు నేర్చుకుందామా అని నేను ఎదురుచూస్తున్నాను.”
వినికిడి లోపం ఉన్న ఒక నేటివ్ అమెరికన్ జంట, సాక్షులు పెట్టిన టేబుల్ దగ్గరకు వచ్చింది. కానీ అక్కడున్న సాక్షులకు సంజ్ఞా భాష రాకపోవడంతో ఆ జంటతో వాళ్లు మాట్లాడలేకపోయారు. అదే సమయానికి సంజ్ఞా భాష నేర్చుకున్న ఒక సాక్షి అక్కడికి వచ్చింది. ఆమె వాళ్లతో దాదాపు 30 నిమిషాలు మాట్లాడి, వాళ్ల ప్రాంతంలోనే సంజ్ఞా భాషలో యెహోవాసాక్షుల సమావేశం ఎక్కడ జరుగుతుందో చెప్పింది.
ఈ బైబిలు విద్యా పనిలో యాభై కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు పాల్గొన్నారు. మూడు రోజులు జరిగిన ఆ ఉత్సవ సమయంలో వాళ్ల దగ్గరకు వచ్చిన సందర్శకులు 150 కన్నా ఎక్కువ ప్రచురణలను తీసుకున్నారు.
a ఆంథ్రోపాలజిస్టు అయిన విలియమ్ కె. పావుర్స్ ఆధునిక కాలాల్లో జరిగే ఉత్సవాల గురించి మాట్లాడుతూ, “ఆ సందర్భంలో సాధారణంగా కొంతమంది గుంపుగా పాటలు పాడుతుండగా మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలు కలిసి డాన్స్ చేస్తారు” అని చెప్పాడు.—ఎత్నోమ్యూజికాలజీ, సెప్టెంబరు 1968, పేజీ 354.