కెనడాలోని ఆదిమవాసి ప్రజలకు మంచివార్త ప్రకటిస్తున్నారు
కెనడాలో 60 కంటే ఎక్కువ ఆదిమవాసి (స్థానిక) భాషలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక భాషను మాతృభాషగా కలిగిన కెనడావాళ్లు దాదాపు 2,13,000 మంది ఉన్నారు.
ఆ ప్రజల హృదయాల్లో మంచివార్తను నాటడానికి, చాలామంది యెహోవాసాక్షులు వాటిలో ఒక భాషను నేర్చుకున్నారు. ఆ భాషలు నేర్పడానికి యెహోవాసాక్షులు తరగతులు నిర్వహించారు. 2015 చివరికల్లా, 250 కన్నా ఎక్కువమంది ఏదోక భాషను నేర్చుకున్నారు.
దానికి తోడు, కెనడాలో మాట్లాడే ఎనిమిది ఆదిమవాసి భాషల్లోకి యెహోవాసాక్షులు బైబిలు ప్రచురణల్ని, చిన్నచిన్న వీడియోలను అనువదించారు. ఆ భాషలు ఏవంటే, ఆల్‌గోన్‌క్విన్, బ్లాక్‌ఫుట్, ప్లెయిన్స్ క్రీ, వెస్ట్ స్వాంపీ క్రీ, ఇనూక్టిటూట్, మోహాక్, ఓడావా, ఉత్తర ఆజిబ్వ. a
ఆదిమవాసి భాష మాట్లాడడం నేర్చుకునేవాళ్లు, అది చాలా కష్టమైన పనని అంటున్నారు. సోదరి కార్మా ఇలా అంటోంది: “నేను బ్లాక్‌ఫుట్ అనువాద బృందానికి సహాయం చేయడం మొదలుపెట్టినప్పుడు, నాకు కటికచీకట్లో పనిచేస్తున్నట్లు అనిపించింది. నాకు ఆ భాష సరిగ్గా రాదు. నేను బ్లాక్‌ఫుట్ భాష చదవలేను, ఆ భాష శబ్దాల్ని కూడా గుర్తించలేను.”
వెస్ట్స్వాంపీ క్రీ అనువాద బృందంతో పనిచేస్తున్న టెరన్స్, “చాలా పదాలు పెద్దగా ఉంటాయి, పలకడానికి చాలా కష్టంగా ఉంటాయి” అంటున్నాడు. ఒన్టారియోలోని, మానిటౌలిన్ దీవిలో పూర్తికాల సేవకుడైన డానియేల్ ఇలా అంటున్నాడు: “ఓడావా భాష నేర్చుకోవడానికి తగినన్ని సహాయకాలు లేవు. దాన్ని నేర్చుకోవాలంటే, ఆ భాష మాట్లాడే బామ్మనో, తాతయ్యనో పట్టుకోవడమే ఉత్తమమైన మార్గం.”
పడిన కష్టానికి ఫలితం ఉంటుందా? ఆజిబ్వా మాట్లాడే ఒకామె, యెహోవాసాక్షులు చేసే కృషిని చూసి, వాళ్లకూ మిగతా మతాల ప్రజలకూ మధ్యవున్న తేడాను గుర్తించారు. యెహోవాసాక్షులు ప్రజల ఇళ్లకు వెళ్తూ, వాళ్లకు ఆజిబ్వా భాషలో లేఖనాలను చదివి వినిపిస్తూ బైబిలు విషయాల గురించి సులువుగా మాట్లాడేలా ప్రజలకు సహాయం చేస్తున్నారని ఆమె అన్నారు.
ఆల్‌బర్టాలోని బ్లడ్ ట్రైబ్ రిజర్వ్‌లో పెరిగిన బర్ట్ అనే అనువాదకుడు ఏమంటున్నాడంటే: “బ్లాక్‌ఫుట్ మాట్లాడే చాలామంది, మన ప్రచురణను గుండెలకు హత్తుకుంటూ, ‘ఇది మా భాష. ఇది నా కోసం!’ అనడం నేను చూశాను. తమ భాషలో ఉన్న వీడియోను చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో నీళ్లు తిరగడం నేను చాలాసార్లు చూశాను.”
తన మాతృభాష అయిన క్రీ భాషలో ఉన్న “బైబిలు ఎందుకు చదవాలి?” అనే వీడియోను చూసిన ఒకామె దాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. తన తల్లి తనతో మాట్లాడుతున్నట్లు అనిపించిందని ఆమె చెప్పారు.
తీవ్రంగా కృషి చేస్తున్నారు
ఆదిమవాసి ప్రజలకు బైబిల్లోని ఓదార్పునిచ్చే సందేశాన్ని తెలియజేయడానికి చాలామంది యెహోవాసాక్షులు అసాధారణ కృషి చేశారు. టెరన్స్, అతని భార్య ఆర్లీన్ అలాంటి ఒక ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్లు ఇలా చెప్తున్నారు: “మేము లిటిల్ గ్రాండ్ రాపిడ్స్ అనే రిజర్వ్‌లో సాక్ష్యం ఇవ్వడానికి, వాహనాలతో రద్దీగా ఉన్న మంచు రోడ్లపై 12 గంటలపాటు ప్రయాణం చేశాం. అయితే ఆ పనికి అద్భుతమైన స్పందన లభించింది!”
కొంతమందైతే, తమ ఇళ్లలోని సౌకర్యాలను వదులుకొని, ఈ తెగల ప్రజలకు దగ్గరలో నివసించడానికి వెళ్లారు. డానియేల్, అతని భార్య లీయాన్ కలిసి మానిటౌలిన్ దీవిలో మూడు నెలలపాటు ఆనందంగా ప్రకటించిన తర్వాత, ఇక పూర్తిగా అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. “మాలోని నమ్మకాన్ని, మాకున్న ఆసక్తిని పెంచుకోవడానికి ఎక్కువ సమయం దొరకడం మాకెంతో నచ్చింది.”
“ఎందుకంటే, నాకు వాళ్లమీద నిజమైన ప్రేమ ఉంది”
ఆదిమవాసి ప్రజలకు మంచివార్త ప్రకటించడానికి యెహోవాసాక్షులు ఎందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు? బర్ట్ భార్య రోజ్ ఇలా వివరిస్తోంది: “నేనూ వీళ్లలో ఒకదాన్ని అయిపోవడం వల్లా, బైబిలు సూత్రాలు పాటించడం ద్వారా వచ్చే ప్రయోజనాలను చవిచూడడం వల్లా ఇతరులకు సహాయం చేయడానికి ప్రేరణ పొందుతున్నాను.”
సోదరి ఆర్లీన్ ఇలా అంటోంది: “క్రీ ప్రజలకు మన సృష్టికర్త నిర్దేశాలను పొందే అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను.” ఆమె ఇంకా ఇలా అంటోంది, “యెహోవాకు దగ్గరవ్వడానికీ, నేడు వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికీ వాళ్లకు సహాయం చేయగలగడం నిజంగా గొప్ప అవకాశం.”
మార్క్, బ్లాక్‌ఫుట్ అనువాద బృందంతో కలిసి పని చేస్తున్నాడు. అతను తన సమాజంలోని ఆదిమవాసి ప్రజలకు సహాయం చేయడానికి ఎందుకు కృషి చేస్తున్నాడు? అతనిలా అంటున్నాడు: “ఎందుకంటే, నాకు వాళ్లమీద నిజమైన ప్రేమ ఉంది.”
a అమెరికాలోని ఆదిమవాసి ప్రజలు కూడా వీటిలో కొన్ని భాషల్ని మాట్లాడతారు.