కంటెంట్‌కు వెళ్లు

మద్యం తాగే అలవాటును ఎలా అదుపులో పెట్టుకోవచ్చు?

మద్యం తాగే అలవాటును ఎలా అదుపులో పెట్టుకోవచ్చు?

ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు, లేదా బోర్‌ కొట్టినప్పుడు కూడా కొందరు మద్యం ఎక్కువగా తాగుతుంటారు. మీరు ఒకప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా తాగుతున్నారా? అలాగైతే, పరిస్థితి మీ చెయ్యి దాటిపోకుండా, మీరు మద్యానికి బానిస కాకుండా ఉండాలంటే ఏంచేయాలి? మీకు సహాయం చేసే కొన్ని విషయాలు గమనించండి.

 మితంగా తాగడం అంటే ఏంటి?

బైబిలు సూత్రం: ‘ద్రాక్షారసం ఎక్కువగా తాగేవాళ్లతో సహవ​సించకు.’—సామెతలు 23:20.

ఆలోచించండి: కొద్దిగా మద్యం తాగడం తప్పని బైబిలు చెప్పట్లేదు. (ప్రసంగి 9:7) అయితే మితంగా తాగడానికి, అతిగా తాగడానికి, తాగుబోతుతనానికి మధ్య తేడా గురించి అది మాట్లాడుతుంది. (లూకా 21:34; ఎఫెసీయులు 5:18; తీతు 2:3) మనం తాగుబోతులం అవ్వకపోయినా, అతిగా తాగడంవల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆరోగ్యం, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి.—సామెతలు 23:29, 30.

చాలామంది అధికారులు, మితంగా తాగడానికీ అతిగా తాగడానికీ తేడా ఉందని చెప్తారు. ఆ తేడాను ఒక వ్యక్తి రోజుకు ఎన్ని పెగ్గులు తాగుతాడు, వారానికి ఎన్నిసార్లు తాగుతాడు అనేదాన్ని బట్టి వాళ్లు లెక్కిస్తారు. అయితే మద్యం ఒక్కొక్కరి మీద ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. * దాని ప్రకారం ఆలోచిస్తే, ఒక్కోసారి అస్సలు తాగకపోవడమే మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం:

“కేవలం ఒకటి లేదా రెండు పెగ్గులు కూడా అతిగా తాగడం కావచ్చు—ఉదాహరణకు:

 • డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు లేక యంత్రాలతో పనిచేస్తున్నప్పుడు.

 • గర్భంతో ఉన్నప్పుడు లేక బిడ్డకు పాలిస్తున్నప్పుడు.

 • కొన్నిరకాల మందులు వాడుతున్నప్పుడు.

 • కొన్నికొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు.

 • మీరు తాగడం అదుపు చేసుకోలేనప్పుడు.”

 మీరు ఎక్కువగా తాగుతున్నారని గుర్తించడం ఎలా?

బైబిలు సూత్రం: ‘మన మార్గాల్ని పరిశీలించుకొని, జాగ్రత్తగా పరీక్షించుకుందాం.’—విలాపవాక్యాలు 3:40.

ఆలోచించండి: తాగే విషయంలో మీ అలవాట్లను తరచూ పరిశీలించుకొని, అవసరమైన మార్పులు చేసుకుంటే మద్యం వల్ల వచ్చే చెడు పర్యవసానాలకు దూరంగా ఉండవచ్చు. మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. కింది విషయాలు పరిస్థితి మీ చెయ్యి దాటిపోతోందని సూచించవచ్చు.

 • మద్యం తాగితేనే మీరు సంతోషంగా ఉంటున్నారు. సేదదీరాలన్నా, నలుగురితో కలవాలన్నా, సరదాగా ఉండాలన్నా ముందు మద్యం తాగడం తప్పనిసరి అని మీకు అనిపిస్తుంది. సమస్యల్ని తట్టుకోవడానికి మీరు మద్యం మీద ఆధారపడుతున్నారు.

 • ముందుకన్నా ఇప్పుడు ఎక్కువ తాగుతున్నారు. మీరు ముందుకన్నా ఎక్కువసార్లు తాగుతున్నారు. మరింత ఘాటుగా తాగుతున్నారు, అలాంటివి చాలా పెగ్గులు తాగితేనే ఇప్పుడు మీకు మత్తెక్కుతోంది.

 • తాగడం వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి. అది ఇంట్లోనే కావచ్చు లేదా పనిచేసే చోటే కావచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్థోమతకు మించి తాగుతున్నారు.

 • తాగిన తర్వాత, సురక్షితం కాని పనులు చేస్తున్నారు. అంటే డ్రైవింగ్‌ చేయడం, స్విమ్మింగ్‌ చేయడం, యంత్రాలు నడపడం లాంటివి.

 • మీరు అతిగా తాగుతున్నారని ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు అలా అన్నప్పుడు మీరు సాకులు చెప్తున్నారు. మీ అలవాటును దాచడానికి ప్రయత్నిస్తున్నారు, లేదా ఎక్కువ తాగట్లేదని అబద్ధాలు చెప్తున్నారు.

 • మీరు తాగడం మానలేకపోతున్నారు. మీరు తక్కువ తాగడానికి లేదా తాగడం పూర్తిగా మానేయడానికి ప్రయత్నించారు కానీ మీ వల్ల కావట్లేదు.

 మద్యం తాగే అలవాటును అదుపులో పెట్టుకోవడానికి ఐదు చిట్కాలు

1. ప్రణాళిక వేసుకోండి.

బైబిలు సూత్రం: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.”—సామెతలు 21:5.

ఇలా చేసి చూడండి: వారంలో ఏయే రోజుల్లో మద్యం తాగుతారో ముందే ఎంచుకోండి. మితంగా ఇన్ని పెగ్గులు మాత్రమే తాగాలని నియమం పెట్టుకోండి. వారంలో కనీసం రెండు రోజులు అస్సలు తాగకూడదని నిర్ణయించుకోండి.

“అప్పుడప్పుడూ తాగకుండా ఉండడం అనేది, మద్యానికి బానిసలయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో చక్కని మార్గం” అని మద్యానికి సంబంధించిన విద్యను అందించే ఒక యూ.కె. ఆధారిత చారీటీ సంస్థ చెప్తుంది.

2. ప్రణాళికను ఆచరణలో పెట్టండి.

బైబిలు సూత్రం: ‘మీరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయండి.’—2 కొరింథీయులు 8:11.

ఇలా చేసి చూడండి: పెగ్గు సైజు ఖచ్చితంగా ఎంతో తెలుసుకోండి, అప్పుడు మీరు ఎంత తాగుతున్నారో సరిగ్గా లెక్కించగలుగుతారు. మద్యం కాకుండా మీకు ఇష్టమైన కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను కొనుక్కొని దగ్గర పెట్టుకోండి.

“చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మద్యం వల్ల వచ్చే సమస్యల్ని చాలావరకు తగ్గించుకోవచ్చు” అని యూ.ఎస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఆల్కహాల్‌ అబ్యూస్‌ అండ్‌ ఆల్కహాలిజమ్‌ చెప్తుంది.

3. మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి.

బైబిలు సూత్రం: “మీ మాట ‘అవును’ అంటే అవును, ‘కాదు’ అంటే కాదు అన్నట్టు ఉండాలి.”—యాకోబు 5:12.

ఇలా చేసి చూడండి: మీరు పెట్టుకున్న హద్దుకు మించి ఎవరైనా మద్యం అందిస్తే, మర్యాదగానే అయినా వాళ్లకు అర్థమయ్యేలా “వద్దు” అని చెప్పడానికి సిద్ధంగా ఉండండి.

“అలాంటి వాటికి మీరెంత త్వరగా ‘వద్దు’ అని చెప్పగలిగితే, మీరు రాజీపడే అవకాశం అంత తక్కువగా ఉంటుంది” అని యూ.ఎస్‌. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆన్‌ ఆల్కహాల్‌ అబ్యూస్‌ అండ్‌ ఆల్కహాలిజమ్‌ చెప్తుంది.

4. మీ నిర్ణయాల వల్ల కలిగే ప్రయోజనాల మీదే మనసుపెట్టండి.

బైబిలు సూత్రం: “ఒక విషయం ఆరంభం కన్నా దాని ముగింపే మేలు.”—ప్రసంగి 7:8.

ఇలా చేసి చూడండి: మద్యం తాగే విషయంలో నియంత్రణ పాటించాలని మీరెందుకు నిర్ణయించుకున్నారో కారణాలు రాసిపెట్టుకోండి. అందులో మంచి నిద్ర, ఆరోగ్యం, డబ్బు ఆదా, ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు వంటివి కూడా చేర్చండి. మీ నిర్ణయాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, సమస్యల గురించి కాకుండా ప్రయోజనాల గురించే ఎక్కువగా మాట్లాడండి.

5. దేవుని సహాయం తీసుకోండి.

బైబిలు సూత్రం: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.

ఇలా చేసి చూడండి: మద్యం తాగే విషయంలో మీ అలవాట్ల గురించి ఆందోళనగా ఉంటే, దేవుని సహాయం కోసం ప్రార్థించండి. బలాన్ని, అదుపు చేసుకునే శక్తిని ఇవ్వమని అడగండి. * ఆయన వాక్యమైన బైబిల్లో ఉన్న తెలివైన సలహాల్ని తెలుసుకోండి. దేవుని సహాయంతో మీరు, మద్యం తాగే అలవాటును ఖచ్చితంగా అదుపులో పెట్టుకోగలుగుతారు.

^ పేరా 9 ఉదాహరణకు, “స్త్రీలు ఒక రోజులో 4 లేదా అంతకన్నా ఎక్కువ పెగ్గులు తాగితే, లేక వారంలో 8 లేదా అంతకన్నా ఎక్కువ పెగ్గులు తాగితే; అలాగే పురుషులు ఒక రోజులో 5 లేదా అంతకన్నా ఎక్కువ పెగ్గులు తాగితే, లేక వారంలో 15 లేదా అంతకన్నా ఎక్కువ పెగ్గులు తాగితే” అది అతిగా తాగడం అని యూ.ఎస్‌. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ చెప్తుంది. పెగ్గు సైజు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత తాగితే మితంగా తాగినట్టో తెలుసుకోవడానికి మీ డాక్టర్‌ని సంప్రదించండి.

^ పేరా 43 మద్యం తాగే అలవాటును మీరు ఇంకా అదుపు చేసుకోలేకపోతుంటే, నిపుణుల సహాయం కూడా తీసుకోవాల్సి రావచ్చు.