కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

పైలట్‌ తిమింగిలం చర్మం దానికదే ఎలా శుభ్రం చేసుకుంటుంది?

పైలట్‌ తిమింగిలం చర్మం దానికదే ఎలా శుభ్రం చేసుకుంటుంది?

 ఓడ చుట్టూ లేదా అడుగు భాగంలో పెరిగే బార్నకల్స్‌, ఇతర జలచరాలు ఓడ నడిపేవాళ్లకు పెద్ద సమస్యగా ఉంటాయి. అలాంటి ప్రాణులు అతుక్కుని ఓడ పాడైపోవడం (బయోఫౌలింగ్‌) వల్ల ఓడల వేగం తగ్గుతుంది, వాటికి ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది, ఇంకా శుభ్రం చేయించడానికి ప్రతీ రెండు సంవత్సరాలకు సర్వీసింగ్‌ కోసం సముద్రంలోనుండి బయటకు తేవాల్సి ఉంటుంది. పరిష్కారాల కోసం శాస్త్రవేత్తలు ప్రకృతి వైపు చూస్తున్నారు.

 ఆలోచించండి: లాంగ్‌ ఫిన్డ్‌ పైలట్‌ తిమింగిలం (గ్లోబిసేఫాల మెలాస్‌) చర్మానికి, దానికదే సొంతగా శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉందని పరిశోధనలు చూపించాయి. దాని చర్మమంతా సూక్ష్మమైన గతుకులతో లేదా బుడుపులతో ఉంటుంది, వాటిని నానో రిడ్జెస్‌ అంటారు. అవి చాలా చిన్నగా ఉండడం వల్ల బార్నకల్‌ పిల్లలు/గుడ్లు దానికి గట్టిగా అతుక్కోలేవు. ఈ బుడుపుల మధ్య ఉండే ఖాళీలు జిగురు లాంటి ధ్రవంతో నిండి ఉంటాయి, అది సముద్రపు నాచు మీద, సూక్ష్మజీవుల మీద దాడి చేస్తుంది. తిమింగిలం దాని చర్మాన్ని విడిచినప్పుడు కొత్త జిగురును వదులుతుంది.

 తిమింగిలానికి స్వతహాగా ఉన్న ఈ శుభ్రం చేసుకునే సామర్థ్యాన్ని ఓడ గోడలకు ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు ప్రణాళిక వేస్తున్నారు. గతంలో ఈ సముద్ర ప్రాణులను నివారించే పెయింట్లను ఓడలకు రాసేవాళ్లు. కానీ వాటిలో ఎక్కువగా వాడుతున్న పెయింట్లు సముద్ర ప్రాణులకు విషపూరితంగా ఉన్నాయి కాబట్టి ఇటీవల కాలంలో వాటిని నిషేధించారు. పరిశోధకులు దానికి పరిష్కారంగా ఓడ అడుగుకు, చుట్టూ భాగానికి ఒక మెటల్‌ మెష్‌ తయారు చేశారు. ఆ మెష్‌పైన వరుసగా ఉన్న చిల్లుల్లో నుండి జీవులకు హాని చేయని ఒక రసాయనం బయటికి వస్తుంది. ఆ రసాయనం సముద్ర నీటితో కలిసినప్పుడు జిగురు ధ్రవంలా (జెల్‌) గట్టిపడుతుంది. అ జిగురు ఓడ చుట్టూ అలాగే ఓడ అడుగున ఒక పొరలా లేదా చర్మంలా ఏర్పడుతుంది. కొంతకాలానికి దాదాపు 0.7 మిల్లీ మీటర్ల [0.03 అంగుళాలు] మందం ఉన్న ఈ చర్మం ఊడిపోతుంది. ఊడిపోతున్నప్పుడు దానికి అతుక్కుని ఉన్న జీవులను కూడా తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు ఈ అమరిక మళ్లీ ఓడ మీద ఒక కొత్త జిగురు ధ్రవాన్ని విడుదల చేస్తుంది.

బార్నకల్స్‌ ఓడల వేగాన్ని తగ్గిస్తాయి, వాటిని తీయడం కూడా కష్టంగా ఉంటుంది.

 లాబరేటరీ పరీక్షలు చూపించిందేంటంటే, ఈ పద్ధతి వల్ల జలచరాలు అతుక్కుని ఓడలు పాడవకుండా 100 శాతం కాపాడవచ్చు. అది షిప్పింగ్‌ కంపెనీలకు చాలా లాభదాయకం, ఎందుకంటే ఓడను శుభ్రం చేయడానికి ఓడల రేవుకు లేదా పొడి డాక్‌యార్డుకు తేవడానికి ఎంతో ఖర్చు అవుతుంది.

 మీరేమంటారు? పైలట్‌ తిమింగిలానికి సొంతగా శుభ్రం చేసుకునే చర్మం దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా తయారు చేశారా?