కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

డాల్ఫిన్‌లో ఉన్న సోనార్‌

డాల్ఫిన్‌లో ఉన్న సోనార్‌

 డాల్ఫిన్‌లు నీటిలో ప్రయాణించడానికి, చుట్టూ ఉండే పరిసరాలను పరిశీలించడానికి రకరకాల శబ్దాలు చేస్తూ, ఈలలు వేస్తూ, వాటికి వచ్చే ప్రతిధ్వనులను వింటాయి. బాటిల్‌ నోస్‌ డాల్ఫిన్‌కున్న (టర్సియోప్స్‌ ట్రన్‌కేటూస్‌) సహజసిద్ధమైన సోనార్‌ను (శబ్ద తరంగాల సహాయంతో వస్తువుల్ని కనిపెట్టే పరికరం) చూసి శాస్త్రవేత్తలు, నీటి అడుగున శబ్ద తరంగాలతో పనిచేసే యంత్రాలను (acoustic systems) తయారు చేస్తున్నారు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడానికి వాటిని తయారు చేస్తున్నారు.

 ఆలోచించండి: డాల్ఫిన్‌కు ఉండే ఈ సోనార్‌తో అది సముద్రపు అడుగున ఇసుకలో దాక్కున్న చేపలను పసిగట్టగలదు, ఏది చేపో ఏది రాయో కూడా తెలుసుకోగలదు. స్కాట్లాండ్‌ ఎడిన్బర్గ్‌లోని హెరోయ్‌ట్‌-వాట్‌ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న కీత్‌ బ్రౌన్‌ ఏమంటున్నారంటే డాల్ఫిన్‌ “మంచి నీళ్లు, ఉప్పు నీళ్లు, ద్రావకం లేదా చమురు ఏ పాత్రల్లో ఉన్నాయో ఆ తేడాను కూడా పది మీటర్ల [32.8 అడుగుల] దూరం నుండే గుర్తించగలదు.” అలాంటి కొన్ని సామర్థ్యాలైనా ఉన్న పరికరాలను తయారుచేయాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు.

ఏ పాత్రలో ఏ పదార్థం ఉందో, డాల్ఫిన్లు పది మీటర్ల దూరం నుండే తెలుసుకోగలవు

 డాల్ఫిన్‌ నోటితో శబ్దాలు చేసే పద్ధతిని, వాటి వినికిడిని పరిశీలించి, పరిశోధకులు అలాంటి వాటినే తయారుచేయడానికి ప్రయత్నించారు. ఫలితం, మీటరు (3.3 అడుగు) కంటే తక్కువ పొడవున్న సిలిండరులో అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలతో అమర్చిన ఒక సోనార్‌ పరికరం. ఈ పరికరాన్ని టోర్పిడో క్షిపణిలా కనిపించే ఒక రొబొట్‌ వాహనానికి పెట్టారు. సముద్రపు అడుగుభాగాన్ని బాగా పరీక్షించి, నేలలో పూడుకుపోయిన వైర్లు లేదా పైపుల్లాంటి వాటిని కనిపెట్టి, నేరుగా ముట్టకుండానే వాటి గురించి తెలుసుకునేందుకు వీలుగా ఈ పరికరాన్ని రూపొందించారు. దీన్ని రూపొందించిన వాళ్లు చమురు, గ్యాస్‌ పరిశ్రమలో ముందుముందు ఇది బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇప్పుడున్న సోనార్‌లకన్నా డాల్ఫిన్‌లను చూసి తయారు చేసిన సోనార్‌లు సేకరించే సమాచార పరిధి పెరగాలి. నీటి అడుగుభాగంలో యంత్రాలను సరైన స్థానంలో అమర్చేలా, అవి ఎక్కడైనా చిట్లినా కనిపెట్టేలా అంటే చమురును త్రవ్వే రిగ్గుల కాళ్లకు ఎక్కడైనా చిన్న బీటలు వస్తే వాటిని కనిపెట్టేలా, లేదా పైప్‌లైన్లు ఎక్కడైనా మూసుకుపోతే వాటిని కనిపెట్టడానికి నిపుణులకు సహాయ పడేలా ఈ సోనార్‌ ఉండాలి.

 మీరేమంటారు? శబ్ద తరంగాలను ఉపయోగించి వస్తువులను కనిపెట్టే సోనార్‌ బాటిల్‌ నోస్‌ డాల్ఫిన్‌కు దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా తయారు చేశారా?