కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

V ఆకారంలో రెక్కలు తెరిచే క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుక

V ఆకారంలో రెక్కలు తెరిచే క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుక

 సీతాకోకచిలుకల్లో ఎగరడానికి ఉపయోగపడే కండరాలు ఉంటాయి. ఆ కండరాలు పనిచేయడానికి కావాల్సిన శక్తిని సాధారణంగా అవి సూర్యరశ్మి నుండి గ్రహిస్తాయి. అయితే మబ్బుపట్టిన రోజుల్లో క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుకలు, మిగతా సీతాకోకచిలుకల కన్నా ముందే ఎగురుతాయి. అది ఎలా సాధ్యం?

 ఆలోచించండి: గాల్లోకి ఎగరడానికి ముందు చాలారకాల సీతాకోకచిలుకలు ఎండలో తమ రెక్కల్ని మూసి ఉంచుతాయి లేదా అడ్డంగా చాపుతాయి. క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుకలు మాత్రం తమ రెక్కల్ని V ఆకారంలో చాపి ఉంచుతాయి. వీలైనంత చక్కగా వేడిని గ్రహించాలంటే, సీతాకోకచిలుకలు తమ రెక్కల్ని V ఆకారంలో (17 డిగ్రీల కోణంలో) తెరిచి ఉంచాలని పరిశోధనలు చూపిస్తున్నాయి. V ఆకారంలో రెక్కలు తెరవడం వల్ల సూర్యరశ్మి నేరుగా వాటి ఛాతీ భాగంలో ఉన్న, ఎగరడానికి సహాయపడే కండరాలపై పడుతుంది. అలా వాటికి ఎగరడానికి కావాల్సిన శక్తి వస్తుంది.

 ఇంగ్లాండ్‌లోని ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, సోలార్‌ పలకల్ని ఈ సీతాకోకచిలుకల్లా V ఆకారంలో రూపొందిస్తే ఎక్కువ శక్తిని తయారుచేయగలమా అని పరిశోధన చేశారు. V ఆకారంలో రూపొందిస్తే, మామూలు కన్నా 50 శాతం ఎక్కువ శక్తిని తయారుచేయవచ్చని ఆ పరిశోధన వల్ల తేలింది.

 సీతాకోకచిలుక రెక్కల ఉపరితలానికి కాంతిని పరావర్తనం లేదా రిఫ్లెక్ట్‌ చేసే గుణం చాలా ఎక్కువ అని కూడా పరిశోధకులు గమనించారు. అలా కాంతిని ఎక్కువగా పరావర్తనం చెందించే వాటి రెక్కల నిర్మాణశైలిని, V ఆకారాన్ని ఉపయోగించి పరిశోధకులు ఎక్కువ శక్తిని తయారుచేసే తేలికైన సోలార్‌ పలకల్ని రూపొందించారు. ఈ ఫలితాల్ని గమనించిన తర్వాత ఆ పరిశోధనా బృందంలోని సభ్యుడైన ప్రొఫెసర్‌ రిచర్డ్‌ ఫ్రెంచ్‌ కాన్‌స్టంట్‌, క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుకల్ని “సౌరశక్తిని గ్రహించడంలో నిపుణులు” అని అన్నాడు.

 మీరేమంటారు? V ఆకారంలో రెక్కలు తెరిచి ఉంచాలనే జ్ఞానం క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుకలకు దానంతటదే వచ్చిందా? లేక దేవుడు ఇచ్చాడా?