కంటెంట్‌కు వెళ్లు

సృష్టిలో అద్భుతాలు

ఆక్టోపస్‌ అద్భుతమైన చేయి

ఆక్టోపస్‌ అద్భుతమైన చేయి

 శరీరంలో సులువుగా ప్రవేశించలేని ప్రాంతాల్లో ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు ఎక్కువ కోయకుండానే ఆపరేషన్‌ చేసేందుకు డాక్టర్లకు సహాయం చేసే పరికరాలను రోబోటిక్‌ ఇంజనీర్లు తయారు చేస్తున్నారు. ఈ రంగంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణను, ఎటైనా సులువుగా కదిలే ఆక్టోపస్‌ చేయిని లేదా టెంటకిల్‌ని చూసే తయారు చేశారు.

 ఆలోచించండి: ఆక్టోపస్‌కున్న ఎనిమిది చేతులు సాగగలవు, ఎటంటే అటు తిరగగలవు. వీటి సహాయంతో ఆక్టోపస్‌ బాగా ఇరుకు ప్రదేశాల్లో ఉన్న వాటిని కూడా లాగి, పట్టుకొని, నలిపి వేయగలదు. ఆక్టోపస్‌ దాని టెంటకిల్స్‌ను ఏ వైపైనా వంచడమే కాదు, అవసరానికి తగ్గట్టు దాని చేతుల్లో ఏ ప్రాంతాన్నైనా గట్టిగా బిగించగలదు.

 వాటిలానే సున్నితంగా, ఎటంటే అటు తిరిగే ఒక రోబోట్‌ చేయి, ఆపరేషన్‌ చేసేటప్పుడు ఎక్కువ కోయకుండానే చక్కగా ఆపరేషన్‌ పూర్తి చేసేందుకు, సాటిలేని సహాయకంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రకమైన పరికరం ఉపయోగించి ఆపరేషన్లు చేయడం వల్ల మరింత సంక్లిష్టమైన పద్ధతుల్లో ఆపరేషన్లు చేయించుకోవడం నుండి రోగులు తప్పించుకోగలరు.

 ఆక్టోపస్‌కున్న ఎటంటే అటు తిరిగే టెంటకిల్స్‌ ఎలా పని చేస్తున్నాయో చూడండి

 అలాంటి ఒక రోబోట్‌ చేయిని ఇప్పటికే తయారు చేసి కృత్రిమ ఆపరేషన్లలో ఉపయోగిస్తున్నారు. 135 మిల్లీ మీటర్లు (5 అంగుళాలు) పొడవుండే ఆ చేయిలో ఒక భాగం శరీరంలోని సున్నితమైన అంతర్గత భాగాలను నేర్పుగా పైకెత్తి వాటికి ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తగా పట్టుకుంటే, ఆ చేయిలో మరో భాగం ఆపరేషన్‌ చేస్తుంది. ఈ పరికరాన్ని తయారు చేసిన టీంలో సభ్యుడైన డాక్టర్‌ టోమ్మాసొ రాంట్సానీ ఇలా చెప్తున్నారు, “మరింత అధునాతన సదుపాయాలున్న, కొత్త మెరుగైన పరికరాలకు ఇది నాంది పలుకుతుందని మేము నమ్ముతున్నాం.”

మృదువుగా, ఎటంటే అటు తిరగ గలిగే ఒక రోబోట్‌ చేయి ఆపరేషన్‌ చేసేటప్పుడు సాటిలేని సహాయకంగా ఉంటుంది

 మీరేమంటారు? ఆక్టోపస్‌ చేయి దానికదే వచ్చిందా? లేదా ఎవరైనా దాన్ని అలా చేశారా?