కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యోహాను 16:33“నేను లోకమును జయించి యున్నాను”

యోహాను 16:33“నేను లోకమును జయించి యున్నాను”

 “నా వల్ల మీరు శాంతి పొందాలని మీకు ఈ విషయాలు చెప్పాను. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను.”—యోహాను 16:33, కొత్త లోక అనువాదం.

 “నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.”—యోహాను 16:33, పరిశుద్ధ గ్రంథము.

యోహాను 16:33 అర్థమేంటి?

 యేసు ఈ మాటలతో తన శిష్యులకు ధైర్యం చెప్పాడు; కష్టాలు, వ్యతిరేకత ఉన్నా వాళ్లు కూడా దేవున్ని సంతోషపెట్టగలరని ప్రేమతో వాళ్లకు భరోసా ఇచ్చాడు.

 “నా వల్ల a మీరు శాంతి పొందాలని మీకు ఈ విషయాలు చెప్పాను.” ఆ వచనంలోని మిగతా మాటలు చూస్తే, యేసు గొడవలు లేకపోవడం వల్ల ఉండే శాంతి గురించి మాట్లాడట్లేదని అర్థమౌతుంది. బదులుగా అది హృదయంలో, మనసులో ఉండే శాంతి. లోలోపల ఉండే ఈ శాంతి, పవిత్రశక్తిని పంపిస్తానని మాటిచ్చిన యేసు “వల్ల” సాధ్యమౌతుంది. ఆ శక్తివంతమైన “సహాయకుడి” వల్ల అంటే పవిత్రశక్తి వల్ల యేసు శిష్యులు ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకొని స్థిరంగా నిలబడగలుగుతారు.యోహాను 14:16, 26, 27.

 “లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అయితే ధైర్యం తెచ్చుకోండి!” తన శిష్యులు అన్యాయం, హింస లాంటి కష్టాలు ఎదుర్కొంటారని యేసు నిర్మొహమాటంగా చెప్పాడు. (మత్తయి 24:9; 2 తిమోతి 3:12) అయినప్పటికీ, వాళ్లు ‘ధైర్యం తెచ్చుకోవడానికి’ కారణం ఉంది.యోహాను 16:33.

 “నేను లోకాన్ని జయించాను.” ఇక్కడ లోకం అనే మాట, దేవునిగా దూరంగా ఉన్న నీతి లేని మానవ సమాజాన్ని సూచిస్తుంది. b 1 యోహాను 5:19 ఇలా చెప్తుంది: “లోకమంతా దుష్టుని [లేదా సాతాను] గుప్పిట్లో ఉంది” కాబట్టి “లోకంలో” ప్రజలు దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా ఆలోచిస్తారు, ప్రవర్తిస్తారు.1 యోహాను 2:15-17.

 సాతాను, అతని లోకం దేవుని ఇష్టం చేయకుండా యేసును ఆపడానికి ప్రయత్నించారు; దేవుని గురించి ఇతరులకు ప్రకటించడం, అలాగే విమోచన క్రయధనంగా యేసు పరిపూర్ణ ప్రాణాన్ని బలి అర్పించడం దేవుని ఇష్టంలో భాగం. (మత్తయి 20:28; లూకా 4:13; యోహాను 18:37) అయితే యేసు లోక ప్రభావం తన మీద పడకుండా, అది తనను దేవునికి దూరం చేయకుండా చూసుకున్నాడు. ఆయన చనిపోయేవరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందుకే యేసు తాను లోకాన్ని జయించానని, “లోక పరిపాలకుడు” అయిన సాతానుకు తన మీద “ఎలాంటి పట్టూ లేదు” అని చెప్పగలిగాడు.యోహాను 14:30.

 అలా యేసు తన సొంత ఆదర్శాన్ని చూపిస్తూ, సాతాను అలాగే అతని లోకం అడ్డుకోవడానికి ప్రయత్నించినా తన అనుచరులు కూడా దేవునికి నమ్మకంగా ఉండగలరని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే యేసు ఇలా అంటున్నాడు: “నేను లోకాన్ని జయించానంటే, మీరు కూడా జయించగలరు.”

యోహాను 16:33 సందర్భం

 యేసు ఈ మాటల్ని తాను చనిపోయే ముందు రాత్రి చెప్పాడు. తాను ఇంకాసేపట్లో చనిపోతానని యేసుకు తెలుసు కాబట్టి, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని తన నమ్మకమైన అపొస్తలులకు చివరిగా కొన్ని సలహాలు ఇచ్చాడు. వాళ్లకు కొన్ని ముఖ్యమైన వాస్తవాలు బోధించాడు. అవేంటంటే: వాళ్లు ఇక ఆయన్ని చూడరు, వాళ్లకు హింసలు వస్తాయి, చివరికి చంపుతారు కూడా. (యోహాను 15:20; 16:2, 10) ఆ మాటలు విని తన అపొస్తలులు భయపడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లను ప్రోత్సహించడానికి, వాళ్లలో ధైర్యం నింపడానికి యేసు చివర్లో యోహాను 16:33లో ఉన్న మాటల్ని చెప్పాడు.

 యేసు మాటలు, ఆదర్శం ఇప్పుడున్న ఆయన శిష్యులకు కూడా ప్రోత్సాహాన్నిస్తాయి. శ్రమలు వచ్చినా, క్రైస్తవులందరూ దేవునికి నమ్మకంగా ఉండగలరు.

a “నా వల్ల” అని అనువదించిన గ్రీకు పదాన్ని “నా యందు” అని కూడా అనువదించవచ్చు. ఆ మాట, యేసు శిష్యులు ఆయనతో ఐక్యంగా ఉండడం ద్వారా శాంతిని పొందవచ్చని సూచిస్తుంది.

b యోహాను 15:19, అలాగే 2 పేతురు 2:5లో కూడా “లోకం” అనే మాటను అదే భావంతో ఉపయోగించారు.