కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యోహాను 15:13—“వానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు”

యోహాను 15:13—“వానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు”

 “స్నేహితుల కోసం ప్రాణం పెట్టడం కన్నా గొప్ప ప్రేమ లేదు.”—యోహాను 15:13, కొత్త లోక అనువాదం.

 “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు.”—యోహాను 15:13, పరిశుద్ధ గ్రంథము.

యోహాను 15:13 అర్థమేంటి?

 తన అనుచరుల మధ్య ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టేంత బలమైన ప్రేమ ఉండాలని అర్థం చేసుకునేలా యేసు వాళ్లకు సహాయం చేస్తున్నాడు.

 దీనికి ముందు యేసు తన అపొస్తలులకు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇదే నా ఆజ్ఞ.” (యోహాను 15:12) యేసు వాళ్లను ఎలా ప్రేమించాడు? ఏమాత్రం స్వార్థం చూసుకోకుండా, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటూ ప్రేమ చూపించాడు. పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన తన కన్నా తన అనుచరుల అలాగే ఇతరుల అవసరాలకు, సంక్షేమానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రజల రోగాలు బాగుచేసి, వాళ్లకు దేవుని రాజ్యం a గురించి బోధించాడు. ఇతరుల కోసం తక్కువ స్థాయి పనులు కూడా చేశాడు. (మత్తయి 9:35; లూకా 22:27; యోహాను 13:3-5) అయితే, యోహాను 15:13 లో యేసు, ప్రేమను చూపించే చాలా గొప్ప పద్ధతి గురించి మాట్లాడాడు. నిజానికి ఆ మాటలు చెప్పిన కొన్ని గంటలకే ఆయన ఇష్టపూర్వకంగా “ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని” ఇచ్చాడు. (మత్తయి 20:28; 22:39) అలా ఆయన తనను తాను ప్రేమించుకున్న దాని కన్నా ఇతరుల్ని ఎక్కువగా ప్రేమించానని సాటిలేని విధంగా చూపించాడు.

 యేసుకు ప్రజలంటే ప్రేమ. తన బోధలు పాటించే వాళ్లంటే ఇంకా ఎక్కువ ప్రేమ. ఆయన శిష్యులు ఆయన నిర్దేశాలు పాటించారు, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన్ని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్లను ప్రాణ స్నేహితుల్లా చూశాడు. (లూకా 22:28; యోహాను 15:14, 15) అందుకే వాళ్ల కోసం ప్రాణం పెట్టడానికి ఇంకా ఇష్టంగా ముందుకొచ్చాడు.

 మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు యేసు మాటల ప్రకారం జీవించారు, వాళ్లు ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లు. (1 యోహాను 3:16) నిజానికి స్వార్థంలేని ప్రేమ, అంటే యేసు చూపించిన లాంటి ప్రేమ నిజ క్రైస్తవులను గుర్తించడానికి అతిపెద్ద గుర్తింపు చిహ్నంగా ఉంటుంది.—యోహాను 13:34, 35.

యోహాను 15:13 సందర్భం

 యోహాను సువార్త 13 నుండి 17 అధ్యాయాల్లో యేసు చనిపోవడానికి ముందు తన 11 మంది నమ్మకమైన అపొస్తలులకు చెప్పిన మాటలు, వాళ్లతో కలిసి చేసిన చివరి ప్రార్థన ఉన్నాయి. తర్వాత కొన్ని గంటల్లో ఆయన చనిపోయాడు. 15వ అధ్యాయంలో యేసు తన శిష్యులు నిజంగా తన అనుచరులని నిరూపించుకోవాలంటే తనతో ఐక్యంగా ఉండాలని చెప్పడానికి, ద్రాక్షచెట్టుకు ఉన్న ఫలించే తీగలతో వాళ్లను పోల్చాడు. వాళ్లను “ఎక్కువగా ఫలిస్తూ” ఉండమని ప్రోత్సహించాడు. (యోహాను 15:1-5, 8) అలా ఫలించడానికి ఒక మార్గం, ఇతరుల మీద నిస్వార్థమైన ప్రేమను చూపించడం. అందుకోసం వాళ్లు యేసు ప్రకటించిన సందేశాన్ని, అంటే “దేవుని రాజ్యం గురించిన మంచివార్తను” ప్రకటించాలి.—లూకా 4:43; యోహాను 15:10, 17.

 యోహాను పుస్తకం గురించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a దేవుని రాజ్యం, పరలోకం నుండి పరిపాలించే ఒక ప్రభుత్వం. భూమిని పరిపాలించడానికి, భూమి విషయంలో తన సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఆ రాజ్యాన్ని స్థాపించాడు. (దానియేలు 2:44; మత్తయి 6:9, 10) దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?” అనే ఆర్టికల్‌ చూడండి.