కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యోహాను 14:27​—“శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను”

యోహాను 14:27​—“శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను”

 “నేను మీకు శాంతిని ఇచ్చి వెళ్తున్నాను; నా శాంతినే మీకు ఇస్తున్నాను. నేను మీకు ఇచ్చే శాంతి, లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. ఆందోళన పడకండి, భయపడకండి.”—యోహాను 14:27, కొత్త లోక అనువాదం.

 “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”—యోహాను 14:27, పరిశుద్ధ గ్రంథము.

యోహాను 14:27 అర్థమేంటి?

 ఈ మాటలతో యేసు, తన అపొస్తలులకు సమస్యలు వచ్చినప్పుడు అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని ప్రేమతో హామీ ఇచ్చాడు. దేవుని సహాయంతో వాళ్లు కూడా తనలాగే లోపల మనశ్శాంతిని కాపాడుకోవచ్చు.

 యేసు తన అపొస్తలులకు ఇచ్చిన శాంతి ఎలాంటిది? యేసు తన శాంతిని, అంటే తాను అనుభవించిన శాంతినే వాళ్లకు ఇచ్చాడు. అది గొడవలు, కష్టాలు లేకపోవడం వల్ల వచ్చిన శాంతి కాదు. (యోహాను 15:20; 16:33) యేసుకు అన్యాయం ఎదురైంది, చివరికి ఆయన్ని చంపేశారు కూడా. అలాంటి సమయంలో కూడా ఆయన మనసు, హృదయం ప్రశాంతంగా ఉన్నాయి. (లూకా 23:27, 28, 32-34; 1 పేతురు 2:23) తన తండ్రైన యెహోవా a ప్రేమ, ఆమోదం తనకు ఉన్నాయని యేసుకు తెలుసు, కాబట్టి ఆయన మనశ్శాంతితో ఉన్నాడు.—మత్తయి 3:16, 17.

 యేసు, ఆయన తండ్రి వాళ్లను ప్రేమిస్తున్నారని, తమ ఆమోదం అపొస్తలులకు ఉందని హామీ ఇవ్వడం ద్వారా యేసు వాళ్లకు శాంతిని ఇచ్చాడు. (యోహాను 14:23; 15:9, 10; రోమీయులు 5:1) యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసం మీద ఆధారపడిన ఈ శాంతి వాళ్ల భయాల్ని, ఆందోళనల్ని తీసేసుకోవడానికి సహాయం చేసింది. (యోహాను 14:1) యేసు ఇక వాళ్లతో పాటు లేకపోయినా, దేవుని పవిత్రశక్తి వాళ్లు ధైర్యంగా, మనశ్శాంతితో ఉండడానికి సహాయం చేస్తుందని ఆయన మాటిచ్చాడు. (యోహాను 14:25-27) యెహోవా ఆమోదం, మద్దతు తమకు ఉన్నాయని తెలుసు కాబట్టి యేసు అనుచరులు కష్టమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలరు.—హెబ్రీయులు 13:6.

 యేసు భూమ్మీద ఉన్నప్పుడు ప్రజలు ‘శాంతి కలగాలి’ అనే మాటతో ఒకరినొకరు పలకరించుకునేవాళ్లు. (మత్తయి 10:12, 13) అయితే యేసు తన అపొస్తలులకు శాంతి కలగాలని కేవలం కోరుకోలేదు; వాళ్లకు శాంతిని ఇచ్చాడు. అంతేకాదు, యేసు ఇచ్చిన శాంతి, లోకం b ఇచ్చే ఎలాంటి శాంతి కన్నా వేరుగా ఉంది. లోకం అనుబంధాలు, సంపదలు, పేరుప్రతిష్ఠలు, హోదా లాంటి వాటి ద్వారా కొంత శాంతిని ఇవ్వగలుగుతుంది. అయితే యేసు ఇచ్చిన శాంతి బయటి పరిస్థితుల మీద ఆధారపడే శాంతి కాదు. అది ఎప్పుడూ లోపల ఉండే మనశ్శాంతి.

యోహాను 14:27 సందర్భం

 యేసు తాను చనిపోయే ముందు రాత్రి తన నమ్మకమైన అపొస్తలులతో ఈ మాటలు చెప్పాడు. ఆ రాత్రి ఆయన త్వరలోనే వాళ్లను విడిచి వెళ్తానని చెప్పాడు. (యోహాను 13:33, 36) ఆ మాటలు విన్నప్పుడు అపొస్తలులు దుఃఖంతో నిండిపోయారు. (యోహాను 16:6) కాబట్టి యేసు, తాను వెళ్లిపోయాక ఏం జరుగుతుందో అని వాళ్లు ఆందోళన పడాల్సిన అవసరం ఎందుకు లేదో వివరిస్తూ వాళ్లకు ధైర్యం చెప్పాడు.

 యేసు మాటలు ఈ రోజుల్లో క్రైస్తవులకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మనం కూడా శాంతితో ఉండవచ్చు. (2 థెస్సలొనీకయులు 3:16) మనం యేసు శిష్యులు అయినప్పుడు, యేసు అలాగే ఆయన తండ్రైన యెహోవా మనల్ని ప్రేమిస్తున్నారనీ వాళ్ల ఆమోదం మనకు ఉందనీ నేర్చుకుంటాం. (కొలొస్సయులు 3:15; 1 యోహాను 4:16) కాబట్టి మనం అతిగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు.—కీర్తన 118:6; ఫిలిప్పీయులు 4:6, 7; 2 పేతురు 1:2.

 యోహాను పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే స్వయంగా ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” ఆర్టికల్‌ చూడండి.

b బైబిల్లో, “లోకం” అనే మాట దేవునికి దూరమైన మానవ సమాజాన్ని సూచించవచ్చు.