కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

యెషయా 41:10—​‘నేను నీకు తోడైయున్నాను భయపడకు’

యెషయా 41:10—​‘నేను నీకు తోడైయున్నాను భయపడకు’

 “భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆందోళనపడకు, ఎందుకంటే నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను, నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.”—యెషయా 41:10, కొత్త లోక అనువాదం.

 ‘నేను నీకు తోడైయున్నాను భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును.’—యెషయా 41:9,10, పరిశుద్ధ గ్రంథము.

యెషయా 41:10 అర్థమేంటి?

 తన నమ్మకమైన సేవకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సహాయం చేస్తానని యెహోవా a దేవుడు వాళ్లకు భరోసా ఇస్తున్నాడు.

 నేను నీకు తోడుగా ఉన్నాను.” తన సేవకులు ఎందుకు భయపడకూడదో యెహోవా చెప్తున్నాడు. కారణం, వాళ్లు ఒంటరిగా లేరు. వాళ్లు పడే బాధలు ఆయన చూస్తున్నాడు, వాళ్ల ప్రార్థనలు ఆయన వింటున్నాడు, ఒకరకంగా ఆయన వాళ్లతోపాటు వాళ్ల పక్కనే ఉన్నాడు.—కీర్తన 34:15; 1 పేతురు 3:12.

 నేను నీ దేవుణ్ణి.” తన సేవకులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాసరే, తాను వాళ్ల దేవునిగా ఉంటానని, వాళ్లను తన సేవకులుగా అంగీకరిస్తానని చెప్తూ యెహోవా వాళ్లను ఊరటనిస్తున్నాడు. తమకు సహాయం చేయకుండా ఏ పరిస్థితీ దేవున్ని ఎప్పటికీ అడ్డుకోలేదు అని వాళ్లు పూర్తి నమ్మకంతో ఉండవచ్చు.—కీర్తన 118:6; రోమీయులు 8:32; హెబ్రీయులు 13:6.

 నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను, నీతి అనే నా కుడిచేతితో నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను.” తాను ఖచ్చితంగా సహాయం చేస్తానని నొక్కిచెప్పడానికి యెహోవా ఒకే విషయాన్ని మూడు వేర్వేరు విధాల్లో చెప్తున్నాడు. తన ప్రజలకు సహాయం అవసరమైనప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో చూపించడానికి ఒక పదచిత్రాన్ని కూడా ఉపయోగించాడు. ఎవరైనా పడిపోతే, దేవుడు తన కుడిచేతిని చాపి వాళ్లను పైకి లేపుతాడు.—యెషయా 41:13.

 దేవుడు ముఖ్యంగా, తన మాటలున్న బైబిలు ద్వారా తన సేవకులను బలపర్చి, వాళ్లకు సహాయం చేస్తాడు. (యెహోషువ 1:8; హెబ్రీయులు 4:12) ఉదాహరణకు పేదరికం, అనారోగ్యం, ప్రియమైనవాళ్లను కోల్పోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు ఉపయోగపడే సలహాలు బైబిల్లో ఉన్నాయి. (సామెతలు 2:6, 7) అంతేకాదు, దేవుడు తన పవిత్రశక్తిని లేదా చురుకైన శక్తిని ఇచ్చి మనం సమస్యల వల్ల నిరాశపడిపోకుండా ఉండడానికి, సరిగ్గా ఆలోచించడానికి సహాయం చేయగలడు.—యెషయా 40:29; లూకా 11:13.

యెషయా 41:10 సందర్భం

 ఈ మాటలు, ఆ తర్వాతి కాలంలో బబులోనుకు బందీలుగా వెళ్లిన నమ్మకమైన యూదులకు ఓదార్పునిచ్చాయి. వాళ్లు బందీలుగా ఉండాల్సిన సమయం పూర్తి కావస్తున్నప్పుడు, చుట్టుపక్కల దేశాలను నాశనం చేసి బబులోనుకు ముప్పుగా తయారైన ఒక శత్రువు గురించిన వార్తలు వినిపిస్తాయి. (యెషయా 41:2-4; 44:1-4) బబులోను, దాని చుట్టుపక్కల దేశాలు అలాంటి వార్తలు విని భయంతో వణికిపోయినా, యూదులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా వాళ్లను కాపాడతాడు. మూడుసార్లు ఆయన “భయపడకు” అనే మాట ఉపయోగించి వాళ్లకు ధైర్యం చెప్పాడు.—యెషయా 41:5, 6, 10, 13, 14.

 యెషయా 41:10లోని మాటల్ని యెహోవా దేవుడు మొదట బబులోనులో బందీలుగా ఉన్న నమ్మకమైన యూదుల కోసం చెప్పినా, ఆ మాటల నుండి తన సేవకులందరూ ఓదార్పు పొందాలనే ఉద్దేశంతో వాటిని భద్రపర్చాడు. (యెషయా 40:8; రోమీయులు 15:4) ఆయన గతంలో తన సేవకులకు సహాయం చేసినట్టే ఇప్పుడు కూడా సహాయం చేస్తున్నాడు.

యెషయా 41వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.

a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.