కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

ప్రసంగి 3:11—“ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు”

ప్రసంగి 3:11—“ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు”

 “ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు; నిరంతరం జీవించడమనే ఆలోచనను కూడా వాళ్ల హృదయంలో పెట్టాడు; అయినా సత్యదేవుడు చేసిన పనిని మనుషులు ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు.”—ప్రసంగి 3:11, కొత్త లోక అనువాదం.

 “దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు.”—ప్రసంగి 3:11, పరిశుద్ధ గ్రంథము.

ప్రసంగి 3:11 అర్థమేంటి?

 “ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు.” ఇక్కడ “అందంగా” అని అనువదించిన హీబ్రూ పదం కేవలం పైపై అందాన్ని మాత్రమే సూచించదు. ఆ పదాన్ని “పద్ధతిగా,” “సరిగ్గా,” లేదా “తగినట్టుగా” అని కూడా అనువదించవచ్చు. (ప్రసంగి 3:11, అధస్సూచి) దేవుని అందమైన పనుల్లో ఆయన సృష్టించిన వాటన్నిటితో పాటు, తన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఆయన చేసేవన్నీ ఉన్నాయి.—దానియేలు 2:21; 2 పేతురు 3:8; ప్రకటన 4:11.

 “నిరంతరం జీవించడమనే ఆలోచనను కూడా వాళ్ల హృదయంలో పెట్టాడు.” దేవుడు మనుషుల్ని ఎల్లప్పుడూ జీవించేలా సృష్టించాడు. (కీర్తన 37:29) అందుకే, వాళ్లలో ఎల్లప్పుడూ జీవించాలనే కోరిక కూడా పెట్టాడు. కానీ మొదటి మానవ జంట అయిన ఆదాము, హవ్వ దేవుని మాట వినకుండా వాళ్లకు అలాగే వాళ్ల సంతానానికి మరణం తీసుకొచ్చారు. (ఆదికాండం 3:17-19; రోమీయులు 5:12) అయినాసరే దేవుడు, “ప్రతీ జీవి కోరికను” అంటే ఎప్పటికీ జీవిస్తూ ఉండాలనే మనుషుల కోరికను కూడా తీరుస్తానని మాటిస్తున్నాడు. (కీర్తన 145:16) మనుషులు మళ్లీ శాశ్వత జీవితం పొందడం కోసం యెహోవా a ఎలా ఏర్పాటు చేశాడో బైబిలు వివరిస్తుంది.—రోమీయులు 6:23.

 “సత్యదేవుడు చేసిన పనిని మనుషులు ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేరు.” దేవుని తెలివి ఎంత లోతైనది, అపారమైనది అంటే, దాన్ని “కనుక్కోవడం అసాధ్యం” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 11:33) అయినాసరే, ఎవరైతే ఆయన్ని సంతోషపెట్టాలని కోరుకుంటారో, వాళ్లకు తన ఉద్దేశాలు తెలియజేయడానికి దేవుడు ఇష్టపడతాడు.—ఆమోసు 3:7.

ప్రసంగి 3:11 సందర్భం

 ప్రసంగి పుస్తకాన్ని ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను రాశాడు, ఆయన దేవుడిచ్చిన తెలివి గలవాడని ప్రసిద్ధికెక్కాడు. జీవితంలో నిజంగా ఏవి ముఖ్యమైనవి, ఏవి వ్యర్థమైనవి అనేదాని గురించి ఆ పుస్తకంలో మంచిమంచి సలహాలు ఉన్నాయి. (ప్రసంగి 1:2, 3; 2:1, 17; 7:1; 12:1, 13) సొలొమోను, మనుషుల జీవితంలో జరుగుతూ ఉండే రకరకాల పనులు లేదా కార్యకలాపాల గురించి 3వ అధ్యాయంలో వివరించాడు. (ప్రసంగి 3:1-8, 10) ఈ కార్యకలాపాల్లో వేటిని చేయాలో, ఎప్పుడు చేయాలో ఎంచుకునే స్వేచ్ఛను దేవుడు మనుషులకు ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండం 30:19, 20; యెహోషువ 24:15) అయితే మనుషులు దేవుని ఉద్దేశానికి అనుగుణంగా, ఆయన నియమించిన ‘సమయంలో’ అంటే ఆయన సమయపట్టిక ప్రకారం పని చేసినప్పుడే, వాళ్ల కష్టం నుండి నిజంగా మంచి ఫలితాలు పొందుతారు. సొలొమోను దాన్ని, “దేవుడు ఇచ్చిన బహుమతి” అన్నాడు.—ప్రసంగి 3:1, 12, 13.

 ప్రసంగి పుస్తకం గురించిన ప్రాముఖ్యమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ చిన్న వీడియో చూడండి.

a యెహోవా అనేది దేవుడే ఎంచుకున్న పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.