కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

నిర్గమకాండం 20:12—“మీ అమ్మానాన్నల్ని గౌరవించు”

నిర్గమకాండం 20:12—“మీ అమ్మానాన్నల్ని గౌరవించు”

 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు ఎక్కువకాలం జీవించేలా మీ అమ్మానాన్నల్ని గౌరవించు.”—నిర్గమకాండం 20:12, కొత్త లోక అనువాదం.

 “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.”—నిర్గమకాండము 20:12, పరిశుద్ధ గ్రంథము.

నిర్గమకాండం 20:12 అర్థమేంటి?

 దేవుడు పూర్వకాలంలోని ఇశ్రాయేలీయులకు, తమ అమ్మానాన్నల్ని గౌరవించమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులు దానికి ఇష్టంగా లోబడేలా దేవుడు ఆ ఆజ్ఞలో ఒక ఆశీర్వాదాన్ని కూడా చేర్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రానికి క్రైస్తవులు ఇప్పుడు లోబడాల్సిన అవసరం లేకపోయినా, దానిలో ఉన్న దేవుని ప్రమాణాలు మాత్రం మారలేదు. ధర్మశాస్త్రంలోని నియమాల వెనకున్న సూత్రాలు ఇప్పటికీ వర్తిస్తాయి; కాబట్టి క్రైస్తవులు వాటిని విలువైనవిగా చూడాలి.—కొలొస్సయులు 3:20.

 చిన్న పిల్లలైనా, ఎదిగిన పిల్లలైనా తమ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వడం ద్వారా, వాళ్ల మాట వినడం ద్వారా వాళ్లను గౌరవించవచ్చు. (లేవీయకాండం 19:3; సామెతలు 1:8) పిల్లలు పెద్దయ్యి, వాళ్లకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా తల్లిదండ్రులకు ప్రేమగా సహాయం చేయడం ఒక వరంగా భావిస్తారు. ఉదాహరణకు, తల్లిదండ్రుల వయసు పైబడినప్పుడు వాళ్ల బాగోగులు చూసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తారు, అవసరమైనప్పుడు డబ్బుపరమైన సహాయాన్ని కూడా అందిస్తారు.—మత్తయి 15:4-6; 1 తిమోతి 5:4, 8.

 ఇశ్రాయేలీయుల పిల్లలు తమ తల్లిదండ్రులు ఇద్దరినీ, అంటే నాన్నతోపాటు అమ్మను కూడా గౌరవించాలి. అలా చేసినప్పుడు కుటుంబంలో తల్లికున్న ప్రాముఖ్యతను గుర్తించినట్లు అవుతుంది. (సామెతలు 6:20; 19:26) ఈ కాలం పిల్లలు కూడా అలానే చేయాలి.

 అయితే, అమ్మానాన్నల్ని గౌరవించాలనే ఆజ్ఞకు దేవుడు ఒక హద్దు విధించాడు. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేయమని అమ్మానాన్నలు గానీ, ఇంకెవరైనా గానీ చెప్తే దాన్ని చేయకూడదని ఇశ్రాయేలీయుల పిల్లలకు ధర్మశాస్త్రం చెప్పింది. (ద్వితీయోపదేశకాండం 13:6-8) అందుకే నేటి క్రైస్తవులు కూడా, “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు” అని గుర్తుంచుకుంటారు.—అపొస్తలుల కార్యాలు 5:29.

 అమ్మానాన్నల్ని గౌరవించే పిల్లలు, యెహోవా తమకు ఇచ్చే దేశంలో ‘ఎక్కువకాలం జీవిస్తారని, వర్ధిల్లుతారని’ ధర్మశాస్త్రం మాటిచ్చింది. (ద్వితీయోపదేశకాండం 5:16) అలాంటి మంచి పిల్లలు, అమ్మానాన్నల మీద తిరుగుబాటు చేసే ఎదిగిన పిల్లలకు వచ్చే శిక్షను తప్పించుకుంటారు. (ద్వితీయోపదేశకాండం 21:18-21) అయితే కాలం మారింది గానీ, ఆ నియమాల వెనకున్న సూత్రాలు మారలేదు. (ఎఫెసీయులు 6:1-3) మనం చిన్నవాళ్లమైనా, పెద్దవాళ్లమైనా మన సృష్టికర్తకు లెక్క అప్పజెప్పాలి. దేవుడు మాటిచ్చినట్టు ఆయనకు అలాగే అమ్మానాన్నలకు లోబడే పిల్లలు ఎక్కువకాలం జీవిస్తారు, చెప్పాలంటే వాళ్లకు శాశ్వతకాలం జీవించే అవకాశం దొరుకుతుంది.—1 తిమోతి 4:8; 6:18, 19.

నిర్గమకాండం 20:12 సందర్భం

 నిర్గమకాండం 20:12 లోని ఆజ్ఞ, పది ఆజ్ఞల్లో ఏ స్థానంలో ఉందో ఆలోచిస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. (నిర్గమకాండం 20:1-17) ఆ ఆజ్ఞ కంటే ముందున్న ఆజ్ఞలు, ఇశ్రాయేలీయులు సత్యదేవుణ్ణి మాత్రమే ఆరాధించడానికి సంబంధించినవి. ఆ తర్వాత ఉన్న ఆజ్ఞలు, తోటి మనుషులతో వ్యవహరించడానికి సంబంధించినవి అంటే భర్తకు లేదా భార్యకు ద్రోహం చేయకూడదు, దొంగతనం చేయకూడదు వంటివాటికి సంబంధించినవి. అయితే అమ్మానాన్నలకు లోబడాలనే ఆజ్ఞ అటు దేవుని విషయంలో, ఇటు మనుషుల విషయంలో మనకున్న బాధ్యతలకు సంబంధించింది కాబట్టి అది ఆ ఆజ్ఞల మధ్యలో సరిగ్గా కూర్చుంటుంది.

నిర్గమకాండం 20వ అధ్యాయం చదవండి. చదువుతున్నప్పుడు అధస్సూచీల్లో ఉన్న వివరణల్ని, క్రాస్‌ రెఫరెన్సులను కూడా చూడండి.