కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

కీర్తన 23:4—“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను”

కీర్తన 23:4—“గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను”

 “గాఢాంధకార లోయలో నడిచినా, హాని కలుగుతుందని నేను భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు; నీ దుడ్డుకర్ర, నీ చేతికర్ర నాకు ధైర్యాన్నిస్తాయి.”—కీర్తన 23:4, కొత్త లోక అనువాదం.

 “గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.”—కీర్తన 23:4, పరిశుద్ధ గ్రంథము.

కీర్తన 23:4 అర్థమేంటి? a

 దేవుడు తనను ఆరాధించేవాళ్లను శ్రద్ధగా చూసుకుంటూ, వాళ్లను రక్షిస్తాడు. వాళ్లు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాసరే ఆయన వాళ్లను కాపాడతాడు. ఈ వచనం, దేవుడు తన ఆరాధకుల్ని శ్రద్ధగా చూసుకునే తీరును, ఓ కాపరి తన గొర్రెల్ని చూసుకునే తీరుతో పోల్చింది. b ఇక్కడ వర్ణించినట్టు గాఢాంధకారం కమ్ముకున్నా, ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా వాళ్లు తమకు ఎవరూ లేరని భయపడరు. వాళ్లకు దేవుడు తమ పక్కనే ఉన్నట్టు సురక్షితంగా అనిపిస్తుంది.

 బైబిలు కాలాల్లో, కాపరులు తమ గొర్రెల్ని క్రూర మృగాల దాడి నుండి కాపాడడానికి దండాన్ని లేదా దుడ్డుకర్రను వాడేవాళ్లు. ఆ కర్రల చివరన ఓ వంపుతిరిగి ఉండేది. తమ గొర్రెల్ని నడిపించడానికి లేదా అపాయంలో పడకుండా వెనక్కి లాగడానికి దాన్ని వాడేవాళ్లు. అదేవిధంగా, యెహోవా దేవుడు కూడా తనను ఆరాధించేవాళ్లను కాపాడుతూ, నడిపిస్తాడు. వాళ్లు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎన్నో రకాలుగా వాళ్లను శ్రద్ధగా చూసుకుంటాడు.

  •   ఆయన రాయించిన బైబిలు ద్వారా వాళ్లను నిర్దేశిస్తాడు, ఓదారుస్తాడు.—రోమీయులు 15:4.

  •   వాళ్ల ప్రార్థనలు వింటూ వాళ్లకు మనశ్శాంతిని దయచేస్తాడు.—ఫిలిప్పీయులు 4:6, 7.

  •   తోటి ఆరాధకుల్ని ఉపయోగించి ప్రోత్సహిస్తాడు.—హెబ్రీయులు 10:24, 25.

  •   ఇప్పుడు పడుతున్న బాధనంతటినీ మరిపించేంత గొప్ప భవిష్యత్తు రాబోతుందనే ఖచ్చితమైన ఆశను వాళ్లలో నింపుతాడు.—కీర్తన 37:29; ప్రకటన 21:3-5.

కీర్తన 23:4 సందర్భం

 కీర్తన 23ను రాసిన దావీదు చిన్నతనంలో గొర్రెల కాపరి. తర్వాత ఆ కాలంలో ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. (1 సమూయేలు 17:34, 35; 2 సమూయేలు 7:8) ఓ గొర్రెల కాపరి తన గొర్రెల్ని చూసుకున్నట్టే, యెహోవా తన ఆరాధకులను నడిపిస్తూ, పోషిస్తూ, సేదదీరుస్తూ ఉన్న వర్ణనతో ఈ కీర్తన మొదలౌతుంది.—కీర్తన 23:1-3.

 4వ వచనంలో దేవుడు అందించే కాపుదల ఎంత గొప్పదో దావీదు చెప్తున్నాడు. అయితే, మొదటి 3 వచనాల్లో దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు “ఆయన” అని ప్రస్తావించిన దావీదు 4వ వచనానికి వచ్చేసరికి “నీ” అని మార్చాడు. ఆ చిన్న మార్పు యెహోవాతో దావీదుకున్న దగ్గర అనుబంధానికి అద్దంపడుతోంది. దేవుడు తనను శ్రద్ధగా చూసుకుంటున్నాడని, ఆయన తాను పడుతున్న ఇబ్బందులు గమనిస్తున్నాడని దావీదుకు తెలుసు. అందువల్ల, దావీదు దేని గురించీ భయపడలేదు.

 తర్వాతి రెండు వచనాల్లో అంటే 5, 6 వచనాల్లో పోలిక కాపరి-గొర్రెల నుండి అతిథి-ఆతిథేయికి మారడం గమనిస్తాం. ఉదారంగా ఉండే ఆతిథేయిలా యెహోవా దేవుడు, దావీదును తన ప్రత్యేక అతిథిలా చూసుకుంటాడు. చివరికి దావీదు శత్రువులు కూడా దేవుడు ఇస్తున్న కాపుదలను అడ్డుకోలేరు. జీవితాంతం దేవుడు తనపట్ల మంచితనాన్ని, ప్రేమను చూపిస్తాడని దావీదు బలంగా నమ్మాడు.

 దేవుడు తన ఆరాధకుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో 23వ కీర్తనలోని పోలికలు వర్ణిస్తున్నాయి.—1 పేతురు 2:25.

a కొన్ని అనువాదాల్లో ఇది 22వ కీర్తన కిందే ఉంది. మొత్తం కీర్తనలు 150 ఉన్నా, కొన్ని బైబిళ్లలో మాత్రం కీర్తనల్ని హీబ్రూ మాసొరెటిక్‌ చేతిరాత ప్రతిలోని వరుస ప్రకారం పేర్చారు, ఇంకొన్నిట్లోనేమో క్రీ.పూ. 2వ శతాబ్దంలో పూర్తయిన హీబ్రూ లేఖనాల అనువాదమైన గ్రీకు సెప్టువజింటు ప్రకారం పేర్చారు.

b యెహోవా అని పేరుపెట్టుకున్న దేవుణ్ణి, బైబిలు చాలాసార్లు సౌమ్యుడైన కాపరిలా వర్ణించింది. ఆయన ఆరాధకుల్ని రక్షణ కోసం, సహాయం కోసం ఆయన మీద ఆధారపడే గొర్రెల్లా వర్ణించింది.—కీర్తన 100:3; యెషయా 40:10, 11; యిర్మీయా 31:10; యెహెజ్కేలు 34:11-16.