కంటెంట్‌కు వెళ్లు

ఉపవాసం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఉపవాసం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిలు కాలాల్లో, సరైన ఉద్దేశంతో చేసిన ఉపవాసాన్ని దేవుడు అంగీకరించాడు. కానీ తప్పుడు ఉద్దేశాలతో చేసిన ఉపవాసాన్ని దేవుడు అంగీకరించలేదు. అయితే, మనకాలంలోని ప్రజలు ఉపవాసం ఉండాలనిగానీ, అలా ఉండకపోతే అది తప్పనిగానీ బైబిలు చెప్పట్లేదు.

బైబిలు కాలాల్లో కొంతమంది ఎందుకు ఉపవాసం ఉన్నారు?

  • దేవుని సహాయం, నిర్దేశం పొందడం కోసం. యెరూషలేముకు ప్రయాణిస్తున్న ప్రజలు దేవుని సహాయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని చూపించడానికి ఉపవాసం ఉన్నారు. (ఎజ్రా 8:21-23) పౌలు, బర్నబాలు సంఘంలో పెద్దల్ని నియమించేటప్పుడు కొన్నిసార్లు ఉపవాసం ఉన్నారు.—అపొస్తలుల కార్యాలు 14:23.

  • దేవుని సంకల్పం మీదే దృష్టిపెట్టేందుకు. బాప్తిస్మం తర్వాత, యేసు తాను చేయబోయే పరిచర్య అంతటిలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చేలా తనను తాను సిద్ధం చేసుకోవడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు.—లూకా 4:1, 2.

  • గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాప పడుతున్నామని చూపించేందుకు. దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.”—యోవేలు 2:12-15.

  • ప్రాయశ్చిత్త దినాన్ని గుర్తు చేసుకునేందుకు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినాన ఉపవాసం ఉండాలనే ఆజ్ఞ ఉంది. * (లేవీయకాండము 16:29-31) ఆ సమయంలో ఉపవాసం ఉండడం సరైనదే, ఎందుకంటే వాళ్లు అపరిపూర్ణులని, వాళ్లకు దేవుని క్షమాపణ అవసరమని అది ఇశ్రాయేలీయులకు గుర్తు చేసేది.

ఏయే తప్పుడు ఉద్దేశాలతో కొంతమంది ఉపవాసం ఉంటారు?

  • ఇతరుల్ని మెప్పించడానికి. మతపరంగా ఉపవాసం ఉండేటప్పుడు అది వ్యక్తిగత విషయంగా, దేవునికీ ఆ వ్యక్తికి మాత్రమే సంబంధించిన విషయంగా ఉండాలని యేసు బోధించాడు.—మత్తయి 6:16-18.

  • నీతిమంతులని నిరూపించుకోవడానికి. ఉపవాసం ఉండడంవల్ల ఒక వ్యక్తి నైతికంగా లేదా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరడు.—లూకా 18:9-14.

  • కావాలని చేసిన తప్పుకు పరిహారం చేసుకోవడానికి. (యెషయా 58:3, 4) దేవునికి లోబడుతూ చేసిన ఉపవాసాలను, నిజమైన పశ్చాత్తాపంతో చేసిన ఉపవాసాలను మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు.

  • మతపరమైన ఆచారాన్ని పాటించడానికి. (యెషయా 58:5-7) సాధారణంగా ఒక తండ్రి, తన పిల్లలు ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తేనే సంతోషిస్తాడు గానీ, ఏదో ప్రేమించాలి కదా అని ప్రేమిస్తే ఆయన సంతోషించడు. ఉపవాసం విషయంలో దేవుడు కూడా అలాగే భావిస్తాడు.

క్రైస్తవులు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందా?

లేదు. ప్రాయశ్చిత్త దినాన ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ పశ్చాత్తాపం చూపించే ప్రజల కోసం యేసు శాశ్వతంగా పాపపరిహారాన్ని చెల్లించిన తర్వాత, ఇశ్రాయేలీయుల కాలంలోని ఆ ఆచారాన్ని దేవుడు రద్దు చేశాడు. (హెబ్రీయులు 9:24-26; 1 పేతురు 3:18) ప్రాయశ్చిత్త దినం మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగంగా ఉండేది, కానీ క్రైస్తవులు ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం కింద లేరు. (రోమీయులు 10:4; కొలొస్సయులు 2:13, 14) అందుకే ఉపవాసం ఉండాలా, వద్దా అని ప్రతీ క్రైస్తవుడు సొంతగా నిర్ణయించుకోవాలి.—రోమీయులు 14:1-4.

ఉపవాసం ఉండడం తమ ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం కాదని క్రైస్తవులు గుర్తిస్తారు. ఉపవాసం ఉంటేనే సంతోషంగా ఉంటామని బైబిలు ఎక్కడా చెప్పట్లేదు. బదులుగా నిజ క్రైస్తవులు ‘సంతోషంగల దేవుడైన’ యెహోవా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ, సంతోషంగా ఆరాధన చేస్తారు.—1 తిమోతి 1:11; ప్రసంగి 3:12, 13; గలతీయులు 5:22.

ఉపవాసం గురించిన అపోహలు

అపోహ: కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌ బైబిలు ప్రకారం అపొస్తలుడైన పౌలు క్రైస్తవ దంపతుల్ని ఉపవాసం ఉండమని చెప్తున్నాడు.—1 కొరింథీయులు 7:5.

నిజం: ప్రాచీన బైబిలు రాతప్రతుల్లోని 1 కొరింథీయులు 7:5 లో ఉపవాసం అనే పదం లేదు. * అంతేకాదు బైబిలు నకలు రాసినవాళ్లు కేవలం మొదటి కొరింథీయుల్లోని వచనంలోనే కాకుండా మత్తయి 17:21; మార్కు 9:29; అపొస్తలుల కార్యాలు 10:30 లేఖనాల్లో కూడా ఉపవాసం అనే పదాన్ని చేర్చారు. ఆధునిక బైబిలు అనువాదకుల్లో చాలామంది అలా కల్పించి చేర్చిన పదాలను అనువదించలేదు.

అపోహ: యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు క్రైస్తవులు ఉపవాసం ఉండాలి. *

నిజం: తన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఉపవాసం ఉండమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించలేదు. (లూకా 22:14-18) బదులుగా తాను చనిపోయిన తర్వాత శిష్యులు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు. అయితే దాన్ని ఒక ఆజ్ఞలా చెప్పలేదుగానీ తాను చనిపోయిన తర్వాత జరిగే పరిస్థితి గురించి అలా చెప్పాడు. (మత్తయి 9:15) పైగా, యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యే క్రైస్తవుల్లో ఎవరైనా ఆకలిగా ఉంటే ఇంటి దగ్గరే తిని రమ్మని బైబిలు చెప్తుంది.—1 కొరింథీయులు 11:33, 34.

^ పేరా 5 దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: ప్రాయశ్చిత్త దినాన “మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను,” లేదా “మీ ప్రాణాల్ని దుఃఖపరుచుకోండి.” (లేవీయకాండము 16:29, 31; కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) ఆ పదాలు ఉపవాసం ఉండడాన్ని సూచిస్తున్నాయని అర్థమౌతుంది. (యెషయా 58:3) కాంటెంపరరీ ఇంగ్లీషు వర్షన్‌ ఈ వచనాన్ని ఇలా అనువదిస్తుంది: “మీరు ఏమి తినకుండా మీ పాపాల విషయంలో బాధను వ్యక్తం చేయండి.”

^ పేరా 13 బ్రూస్‌ ఎమ్‌. మెట్జర్‌ రాసిన టెక్చువల్‌ కామెంటరీ ఆన్‌ ది గ్రీక్‌ న్యూ టెస్ట్‌ మెంట్‌ అనే పుస్తకం మూడో ఎడిషన్‌లో, 554వ పేజీ చూడండి.

అపోహ: బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు కాబట్టి, దాన్ని గుర్తుచేసుకుంటూ క్రైస్తవులు కూడా 40 రోజులు ఉపవాసం ఉండాలి.

నిజం: అలా ఉపవాసం ఉండాలని యేసు ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు, పైగా తొలి క్రైస్తవులు దాన్ని ఆచరించినట్లు కూడా ఎలాంటి లేఖనాధారాలు లేవు.

^ పేరా 14 40 రోజులు ఉపవాసం ఉండడం గురించి న్యూ కాథలిక్‌ ఎన్‌ సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “మొదటి మూడు శతాబ్దాల్లో, పస్కా భోజనాన్ని [ఈస్టర్‌] సిద్ధపరిచే సమయంలో వారం కన్నా ఎక్కువ రోజులు ఉపవాసం ఉండేవాళ్లు కాదు; ఎంతలేదన్నా ఒకటి లేదా రెండు రోజులు పొడిగించేవాళ్లు తప్ప, అంతకు మించి కాదు. . . . 40 రోజుల గురించిన ప్రస్తావన మొట్టమొదటిసారి థ కౌన్సిల్‌ ఆఫ్‌ నైసియాకు (325) చెందిన ఐదవ క్యానన్‌లో కనిపించింది. కానీ అవి లెంట్‌ డేస్‌ గురించే చెప్పబడ్డాయా లేక వేరేదాని గురించి చెప్పబడ్డాయా అని కొంతమంది విద్వాంసులు వాదిస్తారు.”—రెండవ ఎడిషన్‌, 8వ సంపుటి, 468వ పేజీ.