కంటెంట్‌కు వెళ్లు

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏమిటి?

దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

ప్రాచీనకాలంలోని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చిన నియమాలే పది ఆజ్ఞలు. వీటినే పది మాటలు అని కూడా అంటారు. అసెరెట్‌ హడ్‌వరిమ్‌ అనే హీబ్రూ పదబంధాన్ని అక్షరార్థంగా అనువదిస్తే, “పది మాటలు” అని అర్థం. ఈ పదబంధం మొదటి ఐదు పుస్తకాల్లో (టోరహ్‌) మూడుసార్లు కనిపిస్తుంది. (నిర్గమకాండము 34:28; ద్వితీయోపదేశకాండము 4:13; 10:4) దానికి సమానమైన గ్రీకు పదబంధం: డెకా (పది) లోగూస్‌ (మాటలు). దాన్నుండే “డెకలాగ్‌” అనే పదం వచ్చింది.”

దేవుడు ఆ పది ఆజ్ఞల్ని రెండు రాతిపలకల మీద రాసి సీనాయి పర్వతం మీద తన ప్రవక్తైన మోషేకు ఇచ్చాడు. (నిర్గమకాండము 24:12-18) ఆ పది ఆజ్ఞల్ని నిర్గమకాండము 20:1-17 లో, అలాగే ద్వితీయోపదేశకాండము 5:6-21 లో చూడొచ్చు.

 పది ఆజ్ఞల లిస్టు

  1. యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి.—నిర్గమకాండము 20:3.

  2. విగ్రహాల్ని పూజించకూడదు.—నిర్గమకాండము 20:4-6.

  3. దేవుని పేరును వ్యర్థంగా ఉపయోగించకూడదు.—నిర్గమకాండము 20:7.

  4. విశ్రాంతి రోజును పాటించాలి.—నిర్గమకాండము 20:8-11.

  5. తల్లిదండ్రుల్ని గౌరవించాలి.—నిర్గమకాండము 20:12.

  6. హత్య చేయకూడదు.—నిర్గమకాండము 20:13.

  7. వ్యభిచారం చేయకూడదు.—నిర్గమకాండము 20:14.

  8. దొంగతనం చేయకూడదు.—నిర్గమకాండము 20:15.

  9. అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.—నిర్గమకాండము 20:16.

  10. వేరేవాళ్లకు చెందినవి ఆశించకూడదు.—నిర్గమకాండము 20:17.

 పది ఆజ్ఞల లిస్టులు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి?

బైబిలు ఇది మొదటి ఆజ్ఞ, ఇది రెండో ఆజ్ఞ అని చెప్పట్లేదు. దానివల్ల, పది ఆజ్ఞల్ని ఏ వరుసలో పెట్టాలనే విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ఎక్కువమంది, పైన లిస్టులో ఉన్న క్రమాన్ని ఉపయోగిస్తారు. అయితే కొంతమంది వేరే క్రమాన్ని కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మొదటి, రెండవ, చివరి ఆజ్ఞల్లోనే ఆ తేడా కనిపిస్తుంది. *

 పది ఆజ్ఞల ఉద్దేశం ఏమిటి?

పది ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగం. దానిలో 600 కన్నా ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయి. అవి దేవునికి, ప్రాచీన ఇశ్రాయేలు జనానికి మధ్య జరిగిన ఒప్పందానికి లేదా నిబంధనకు షరతులుగా పనిచేశాయి. (నిర్గమకాండము 34:27) ఇశ్రాయేలు ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వర్ధిల్లుతారని దేవుడు వాళ్లకు మాటిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 28:1-14) అయితే ధర్మశాస్త్ర ముఖ్య ఉద్దేశం, మెస్సీయ లేదా క్రీస్తు కోసం ఇశ్రాయేలీయుల్ని సిద్ధం చేయడమే.—గలతీయులు 3:24.

 క్రైస్తవులు పది ఆజ్ఞలు పాటించాలా?

లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని, అందులోని పది ఆజ్ఞల్ని ముఖ్యంగా ప్రాచీన ఇశ్రాయేలు ప్రజల కోసమే ఇచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 5:2, 3; కీర్తన 147:19, 20) క్రైస్తవులు దాని కింద లేరు, చివరికి క్రైస్తవులుగా మారిన యూదులు కూడా ఆ ‘ధర్మశాస్త్రం నుండి విడుదల పొందారు.’ (రోమీయులు 7:6) * మోషే ధర్మశాస్త్రం స్థానంలోకి “క్రీస్తు శాసనం” వచ్చింది, అందులో తన అనుచరుల కోసం యేసు ఇచ్చిన నిర్దేశాలన్నీ ఉంటాయి.—గలతీయులు 6:2; మత్తయి 28:19, 20.

 పది ఆజ్ఞలు ఇప్పటికీ పనికొస్తాయా?

అవును. పది ఆజ్ఞలు దేవుని ఆలోచనను తెలియజేస్తాయి కాబట్టి వాటిని పరిశీలించడం వల్ల మనం ప్రయోజనం పొందవచ్చు. (2 తిమోతి 3:16, 17) పది ఆజ్ఞలు ఏ సూత్రాల మీద ఆధారపడి ఉన్నాయో ఆ సూత్రాలు నమ్మదగినవి, ఎప్పటికీ పనికొచ్చేవి. (కీర్తన 111:7, 8) నిజానికి, ఎక్కువమంది “కొత్త నిబంధన” అని పిలిచే బోధలకు కూడా ఆ సూత్రాలే ఆధారం.—“ కొత్త నిబంధనలో కనిపించే పది ఆజ్ఞల్లోని సూత్రాలు” అనే భాగం చూడండి.

మోషే ధర్మశాస్త్రం మొత్తం, అలాగే అందులోని పది ఆజ్ఞలు రెండు ప్రాథమిక ఆజ్ఞల ఆధారంగా రూపొందాయని యేసు బోధించాడు. ఆయనిలా అన్నాడు: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ నిండు మనసుతో ప్రేమించాలి.’ ఇదే అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ, మొదటిది కూడా. రెండో ఆజ్ఞ కూడా దాని లాంటిదే. అదేమిటంటే, ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’ ఈ రెండు ఆజ్ఞలే మొత్తం ధర్మశాస్త్రానికి ... ఆధారం.” (మత్తయి 22:34-40) కాబట్టి క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, వాళ్లు దేవుణ్ణి, సాటి మనుషుల్ని ప్రేమించాలి.—యోహాను 13:34; 1 యోహాను 4:20, 21.

  కొత్త నిబంధనలో కనిపించే పది ఆజ్ఞల్లోని సూత్రాలు

సూత్రం

కొత్త నిబంధన రెఫరెన్సు

యెహోవా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి

ప్రకటన 22:8, 9

విగ్రహాల్ని పూజించకూడదు

1 కొరింథీయులు 10:14

దేవుని పేరును గౌరవించాలి

మత్తయి 6:9

దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించాలి

హెబ్రీయులు 10:24, 25

తల్లిదండ్రుల్ని గౌరవించాలి

ఎఫెసీయులు 6:1, 2

హత్య చేయకూడదు

1 యోహాను 3:15

వ్యభిచారం చేయకూడదు

హెబ్రీయులు 13:4

దొంగతనం చేయకూడదు

ఎఫెసీయులు 4:28

అబద్ధసాక్ష్యం చెప్పకూడదు

ఎఫెసీయులు 4:25

వేరేవాళ్లకు చెందినవి ఆశించకూడదు

లూకా 12:15

^ పేరా 13 యూదుల ఎంతోకాలంగా ఉపయోగించే క్రమం ప్రకారం, “నిర్గ[మకాండము] 20వ అధ్యాయం, 2వ వచనం మొదటి ‘మాటగా’ (ఆజ్ఞగా) ఎంచబడేది; 3-6 వచనాలు ఒకే ఆజ్ఞగా, అంటే రెండవ ఆజ్ఞగా ఎంచబడేవి.” (ద జూయిష్‌ ఎన్‌సైక్లోపీడియా) కానీ క్యాథలిక్కులు, నిర్గమకాండము 20వ అధ్యాయం 1-6 వచనాల్ని ఒకే ఆజ్ఞగా పరిగణిస్తారు. దాని ప్రకారం, దేవుని పేరును అగౌరవపర్చడం గురించిన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ అవుతుంది. అయితే మొత్తం పది ఆజ్ఞలు ఉండేలా, వాళ్లు చివరి ఆజ్ఞను రెండు ఆజ్ఞలుగా విడగొట్టారు. అంటే పొరుగువాని భార్యను ఆశించకూడదు అనేది ఒక ఆజ్ఞ, అతనికి చెందినవేవీ ఆశించకూడదు అనేది ఇంకో ఆజ్ఞ.

^ పేరా 15 బైబిలు రోమీయులు 7:7 లో, “ధర్మశాస్త్రానికి” ఒక ఉదాహరణగా పదవ ఆజ్ఞను ప్రస్తావించింది. కాబట్టి “పది ఆజ్ఞలు” ధర్మశాస్త్రంలో భాగమని రుజువౌతోంది.