కంటెంట్‌కు వెళ్లు

బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందా?

బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

అవును. బైబిలు ఒక సైన్సు పాఠ్యపుస్తకం కాకపోయినా, సైన్సుకు సంబంధించిన విషయాలను అది ఖచ్చితంగా చెప్తుంది. బైబిలుతో సైన్సు ఏకీభవిస్తుందని చూపించే కొన్ని ఉదాహరణలు చూద్దాం. బైబిలు సైన్సు గురించిన వాస్తవాలను చెబుతుంది. వాటికి, ఆ కాలంలో జీవించిన ప్రజల నమ్మకాలకూ ఎంతో తేడా ఉంది.

  • విశ్వానికి ఆరంభం ఉంది. (ఆదికాండము 1:1) అయితే ఎన్నో పురాతన కట్టుకథలు, ఈ విశ్వం సృష్టించబడలేదు కానీ చిందరవందర స్థితి నుండి దానంతటదే తయారైందని చెప్తున్నాయి. విశ్వానికి జన్మనిచ్చిన దేవుళ్లు రెండు మహాసముద్రాల నుండి పుట్టారని బబులోనీయులు నమ్మేవాళ్లు. ఇతర పురాణాలు, ఈ విశ్వం ఓ పెద్ద గుడ్డు నుండి వచ్చిందని చెప్తున్నాయి.

  • ఈ విశ్వం, మనం అర్థంచేసుకోగల నియమాలతో పనిచేస్తుందే గానీ దేవుళ్ల చపలచిత్తాన్ని బట్టి కాదు. (యోబు 38:33; యిర్మీయా 33:25) ఊహించలేని విధంగా లేదా కొన్నిసార్లు కఠినంగా ఉండే ఆ దేవుళ్ల పనులను మనుష్యులు చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేరని ప్రపంచవ్యాప్తంగా కట్టుకథలు చెప్తున్నాయి.

  • భూమి శూన్యంలో వేలాడుతోంది. (యోబు 26:7) ప్రాచీన కాలంలో ఎంతోమంది ప్రజలు భూమి బల్లపరుపుగా ఉందని, దాన్ని చాలా బలంగల వ్యక్తి మోస్తున్నాడని లేదా గేదె, తాబేలు లాంటి జంతువు మోస్తుందని నమ్మేవాళ్లు.

  • మహాసముద్రాలు, ఇతర జలాల నుండి ఆవిరైన నీరు వర్షం, మంచు, వడగండ్ల రూపంలో తిరిగి ఈ భూమ్మీద పడి నదులు, సరస్సులు నిండుతున్నాయి. (యోబు 36:27, 28; ప్రసంగి 1:7; యెషయా 55:10; ఆమోసు 9:6) అయితే, భూగర్భ సముద్ర జలాల వల్ల నదులు నిండుతున్నాయని ప్రాచీన గ్రీకులు నమ్మేవారు. 18వ శతాబ్దం వరకు వారు అలా నమ్ముతూ వచ్చారు.

  • పర్వతాలు ఎత్తు పెరుగుతాయి, తగ్గుతాయి. ఇప్పుడున్న అనేక పర్వతాలు ఒకప్పుడు మహాసముద్రం కింద ఉండేవి. (కీర్తన 104:6, 8) అయితే అనేక పురాణాలు, ఇప్పుడు మనం చూస్తున్న పర్వతాలను దేవుళ్లే ఆ రూపంలో చేశారని చెబుతున్నాయి.

  • పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం. శవాన్ని తాకిన తర్వాత శుభ్రంగా అవ్వడానికి ఏమి చేయాలో, అంటురోగాలు ఉన్నవాళ్లను ఎలా వేరుగా ఉంచాలో, పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి మల విసర్జన తర్వాత ఏమి చేయాలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమాలు ఇచ్చాడు. (లేవీయకాండము 11:28; 13:1-5; ద్వితీయోపదేశకాండము 23:13) ఆ నియమాలు ఇచ్చిన కాలంలోనే గాయాలు మానడానికి ఈజిప్టు ప్రాంత ప్రజలు ఒకానొక చికిత్సా విధానాన్ని పాటించేవాళ్లు. ఆ చికిత్సా విధానంలో గాయాలకు మనిషి మలంతో చేసిన మిశ్రమాన్ని రాసేవాళ్లు.

బైబిల్లోని విషయాలు సైన్సు ప్రకారం లేవా?

బైబిల్లోని విషయాలు సైన్సు ప్రకారం ఉన్నాయని, దాన్ని జాగ్రత్తగా చదివితే తెలుస్తుంది. ఈ విషయంలో కొన్ని అపోహలు ఇప్పుడు చూద్దాం:

అపోహ: ఈ విశ్వం 24 గంటలున్న ఆరు రోజుల్లో సృష్టించబడిందని బైబిలు చెప్తుంది.

నిజం: ఎంతోకాలం ముందు దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 1:1) అంతేకాదు, ఆదికాండము 1వ అధ్యాయంలో వివరించబడిన సృష్టి దినాల్లో ఒక దినం ఎంత సమయమో బైబిలు చెప్పడం లేదు కాని అది ఒక సుదీర్ఘ కాలమని అర్థమౌతుంది. నిజానికి ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించడానికి పట్టిన కాలాన్ని కూడా బైబిలు “దినము” అని పిలుస్తుంది.—ఆదికాండము 2:4.

అపోహ: కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis) జరిగేలా సూర్యుడు సృష్టించబడడానికి ముందే మొక్కలు ఉనికిలో ఉన్నాయని బైబిలు చెబుతుంది.—ఆదికాండము 1:11, 16.

నిజం: ‘ఆకాశంలో’ ఉన్న నక్షత్రాల్లో సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి బైబిలు ప్రకారం మొక్కల కన్నా ముందే దేవుడు సూర్యుణ్ణి సృష్టించాడు. (ఆదికాండము 1:1) సృష్టిలోని మొదటి “దినమే” సూర్యుడి నుండి బలహీనమైన కాంతి భూమ్మీద పడింది. సృష్టిలోని మూడో “దినం” కల్లా భూమ్మీది వాతావరణం తేలికపడడంతో, కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడేంత బలమైన కాంతి భూమ్మీద పడింది. (ఆదికాండము 1:3-5, 12, 13) ఆ తర్వాతే, సూర్యుడు భూమ్మీద నుండి స్పష్టంగా కనిపించాడు.—ఆదికాండము 1:16.

అపోహ: సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని బైబిలు చెప్తుంది.

నిజం: ప్రసంగి 1:5లో ఇలా ఉంది: ‘సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.’ అయితే, ఆ మాటలు భూమ్మీది నుండి సూర్యుణ్ణి చూసినప్పుడు దాని కదలికలు ఎలా ఉంటాయో చెప్తున్నాయి. ఈ రోజు కూడా, మనం “స్యూరోదయం,” “సూర్యాస్తమయం” వంటి పదాలు వాడినా, ఈ భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని మనకు తెలుసు.

అపోహ: భూమి బల్లపరుపుగా ఉందని బైబిలు చెప్తుంది.

నిజం: “భూదిగంతముల వరకు” అని బైబిలు చెబుతున్నప్పుడు, భూవ్యాప్తంగా అని దానర్థం. అంతేగానీ, భూమి బల్లపరుపుగా ఉందని లేదా దానికి హద్దులు ఉన్నాయని కాదు. (అపొస్తలుల కార్యములు 1:8) అలాగే, “నాలుగు దిగంతములు” లేదా నాలుగు దిక్కులు అనే మాటలు పూర్తి భూమి గురించి చెప్తున్నాయని మనం అర్థంచేసుకుంటాం.—యెషయా 11:12; లూకా 13:29.

అపోహ: ఒక వృత్తం (సర్కిల్‌) చుట్టుకొలత దాని వ్యాసానికి (డయామీటర్‌కి) ఖచ్చితంగా మూడు రేట్లు ఉంటుందని బైబిలు చెబుతుంది. కానీ, దాని అసలు విలువ అంటే పై (π) విలువ 3.1416.

నిజం: 1 రాజులు 7:23; 2 దినవృత్తాంతములు 4:2 వచనాలను బట్టి “పోతపోసిన సముద్రపు తొట్టి” వ్యాసం లేదా డయామీటర్‌ “పది మూరలు” అని, దాని “కైవారము” లేదా చుట్టుకొలత “ముప్పది మూరలు” అని ఉంది. ఇక్కడ ఇచ్చిన కొలతలు కేవలం దగ్గరగా ఉన్న పూర్ణ సంఖ్యలు కావచ్చు లేదా తొట్టి బయటి, లోపలి కొలతలు కావచ్చు.