కంటెంట్‌కు వెళ్లు

లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్తుందా?

లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

లైంగిక ఆనందం పొందడం తప్పని బైబిలు చెప్పట్లేదుగానీ, అది పెళ్లైనవాళ్లకు దేవుడిచ్చిన ఓ బహుమానం అని చెప్తుంది. దేవుడు మనషుల్ని “స్త్రీనిగాను పురుషునిగాను” సృష్టించి, తాను చేసినదంతా “చాలమంచిదిగ” ఉందని భావించాడు. (ఆదికాండము 1:27, 31) దేవుడు మొదటి స్త్రీపురుషుల్ని వివాహంలో జతచేసినప్పుడు, “వారు ఏక శరీరమైయుందురు” అని అన్నాడు. (ఆదికాండము 2:24) అంటే, వాళ్లిద్దరూ లైంగిక ఆనందాన్ని పొందుతూ, ఒకరి భావోద్వేగ అవసరాలు మరొకరు తీర్చుకోవాలి.

భర్త తన భార్య దగ్గర పొందే ఆనందాన్ని బైబిలు ఇలా వర్ణిస్తుంది: “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము. ... ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందుచుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.” (సామెతలు 5:18, 19) భార్య కూడా లైంగిక ఆనందాన్ని పొందే విధంగా దేవుడు సృష్టించాడు. బైబిలు ఇలా చెప్తుంది: “భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను.”—1 కొరింథీయులు 7:3.

లైంగిక ఆనందానికి హద్దులు ఉన్నాయి

లైంగిక సంబంధాలు భార్యాభర్తల మధ్య మాత్రమే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే హెబ్రీయులు 13:4 ఇలా చెప్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.” భార్యభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలి, అలాగే వాళ్లు చేసుకున్న ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్లు తమ సొంత కోరికల్ని తీర్చుకోవడం ద్వారా కాదుగానీ బైబిల్లోని ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా మరింత ఆనందం పొందుతారు. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”​—అపొస్తలుల కార్యములు 20:35.