కంటెంట్‌కు వెళ్లు

“ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” నిజంగా యేసు మృతదేహాన్ని చుట్టిన వస్త్రమా?

“ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” నిజంగా యేసు మృతదేహాన్ని చుట్టిన వస్త్రమా?

బైబిలు ఇచ్చే జవాబు

“ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” గురించి బైబిలు ప్రస్తావించట్లేదు. అది యేసు మృతదేహాన్ని చుట్టివుంచిన ఒక నార వస్త్రమని చాలామంది నమ్ముతారు. అందుకే, క్రైస్తవ మతం చాలా పవిత్రంగా ఎంచే చిహ్నాల్లో అది కూడా ఒకటని కొందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం అది ఇటలీకి చెందిన టూరిన్‌లోని ఒక చర్చిలో, ఒక పెట్టెలో ఎంతో జాగ్రత్తగా భద్రపర్చబడి ఉంది.

“ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” నిజమని బైబిలు వృత్తాంతాలు చెప్తున్నాయా? లేదు.

ఆ వస్త్రానికి సంబంధించిన మూడు విషయాల్ని, వాటికి భిన్నంగా బైబిలు చెప్తున్న విషయాల్ని పరిశీలించండి.

 1. ష్రౌడ్‌ అంటే 442 సెంటీమీటర్లు పొడవు, 113 సెంటీమీటర్లు వెడల్పు ఉండి, పొడవు వెంబడి 8 సెంటీమీటర్ల అంచు కుట్టబడివున్న ఒక వస్త్రం.

  బైబిలు ఏం చెప్తుంది? యేసు మృతదేహాన్ని ఒక నార వస్త్రంతో కాదుగానీ నార వస్త్రాలతో చుట్టారు, తలకు వేరే వస్త్రాన్ని చుట్టారు. యేసు పునరుత్థానమయ్యాక, ఆయన అపొస్తలుల్లో ఒకరు ఖాళీ సమాధి దగ్గరికి వచ్చి “అక్కడ నారబట్టలు పడివుండడం చూశాడు.” బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “యేసు తలకు చుట్టబడిన నారబట్ట మిగతా నారబట్టల దగ్గర లేదు. అది చుట్టబడి వేరే చోట ఉంది.”—యోహాను 20:6, 7.

 2. ష్రౌడ్‌ మీద ఉన్న మరకలు, స్నానం చేయించని మృతదేహం తాలూకు రక్తపు మరకలు అని భావిస్తారు.

  బైబిలు ఏం చెప్తుంది? యేసు చనిపోయినప్పుడు, శిష్యులు “యూదుల ఆచారం ప్రకారం” ఆయన మృతదేహాన్ని సిద్ధం చేశారు. (యోహాను 19:39-42) అందులో భాగంగా, పాతిపెట్టే ముందు మృతదేహానికి స్నానం చేయించి తైలాలు, సుగంధ ద్రవ్యాలు పూస్తారు. (మత్తయి 26:12; అపొస్తలుల కార్యాలు 9:37) కాబట్టి నార వస్త్రాలతో చుట్టే ముందు శిష్యులు యేసు మృతదేహానికి స్నానం చేయించి ఉంటారు.

 3. ష్రౌడ్‌ మీద “ఒక మనిషి శరీరంలోని ముందు భాగం, వెనక భాగం, అలాగే తల దగ్గర ఆ వస్త్రాన్ని రెండుసార్లు చుట్టిన ఆనవాలు ఉంటాయి” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తుంది.

  బైబిలు ఏం చెప్తుంది? యేసు శిష్యులు ఆయన మరణం గురించి, ఖాళీగా ఉన్న సమాధి గురించి, “దేవదూతలు కనిపించి యేసు బ్రతికే ఉన్నాడని చెప్పారని” స్త్రీలు ఇచ్చిన సాక్ష్యం గురించి మాట్లాడుకున్నారు. (లూకా 24:15-24) ఒకవేళ ష్రౌడ్‌ యేసు సమాధిలో ఉంటే, ఆయన శిష్యులు దాని గురించి, దాని మీదున్న ఆనవాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుని ఉండేవాళ్లు. కానీ వాళ్లు అలా మాట్లాడుకున్నట్లు బైబిలు చెప్పడం లేదు.

ష్రౌడ్‌ని పూజించాలా?

పూజించకూడదు. ఒకవేళ ష్రౌడ్‌ నిజమైనదే అయినా దాన్ని పూజించడం తప్పు. ఎందుకో ఈ బైబిలు సూత్రాలు వివరిస్తాయి.

 1. పూజించడం అనవసరం. “దేవుడు అదృశ్య వ్యక్తి, ఆయన్ని ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించాలి” అని యేసు చెప్పాడు. (యోహాను 4:24) సత్యారాధనలో మతపరమైన పురాతన వస్తువుల్ని గానీ, చిహ్నాల్ని గానీ ఉపయోగించకూడదు.

 2. పూజించడం తప్పు. విగ్రహారాధన తప్పని పది ఆజ్ఞల్లో ఉంది. (ద్వితీయోపదేశకాండము 5:6-10) అంతేకాదు, “విగ్రహాలకు దూరంగా ఉండండి” అని బైబిలు క్రైస్తవులకు ఆజ్ఞాపిస్తుంది. (1 యోహాను 5:21) ష్రౌడ్‌ తమ మత విశ్వాసానికి ఒక గుర్తు లేదా చిహ్నం మాత్రమే గానీ, విగ్రహం కాదని కొంతమంది వాదించవచ్చు. కానీ దాన్ని పూజించే వ్యక్తికి ఆ చిహ్నం ఒక విగ్రహంతో సమానం అవుతుంది. * కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునే వ్యక్తి ష్రౌడ్‌నే కాదు ఏ వస్తువునూ పూజించడు, అతిగా గౌరవించడు.

^ పేరా 15 విగ్రహం అంటే ఒక ప్రతిమ, చిహ్నం, లేదా పూజ్య భావంతో చూసే ఒక గుర్తు.