కంటెంట్‌కు వెళ్లు

వేరే భాషల్లో మాట్లాడే వరం గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?

వేరే భాషల్లో మాట్లాడే వరం గురించి బైబిలు ఏమి బోధిస్తోంది?

బైబిలు ఇచ్చే జవాబు

మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులకు ‘వేరే భాషల్లో మాట్లాడే’ అద్భుతమైన సామర్థ్యం ఉండేది, దానివల్ల వాళ్లు ఆ భాషల్ని నేర్చుకోకుండానే చక్కగా మాట్లాడగలిగేవాళ్లు. (అపొస్తలుల కార్యాలు 10:46) ఆ భాష తెలిసిన వాళ్లెవరైనా సరే వాళ్లు చెప్పే విషయాల్ని తేలిగ్గా అర్థం చేసుకునేవాళ్లు. (అపొస్తలుల కార్యాలు 2:4-8) యెహోవా మొదటి శతాబ్దంలోని కొంతమంది క్రైస్తవులకు ఇచ్చిన పవిత్రశక్తి వరాల్లో, వేరే భాషలు మాట్లాడే వరం కూడా ఒకటి.—హెబ్రీయులు 2:4; 1 కొరింథీయులు 12:4, 30.

 వేరే భాషల్లో మాట్లాడడం ఎక్కడ మొదలైంది? ఎప్పుడు?

ఈ అద్భుతం మొదటిసారిగా, యెరూషలేములో క్రీ.శ. 33 యూదుల పెంతెకొస్తు పండుగ రోజు ఉదయాన జరిగింది. దాదాపు 120 మంది యేసు శిష్యులు ఒక చోట కలుసుకున్నారు, అప్పుడు ‘వాళ్లంతా పవిత్రశక్తితో నిండిపోయి, వేర్వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.’ (అపొస్తలుల కార్యాలు 1:15; 2:1-4) వాళ్లు ‘ప్రతీ ఒక్కరి మాతృభాషలో మాట్లాడడం’ “భూమ్మీదున్న అన్నిదేశాల నుండి వచ్చిన” చాలామంది ప్రజలు విన్నారు.—అపొస్తలుల కార్యాలు 2:5, 6.

 వేరే భాషల్లో మాట్లాడే వరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు?

  1. దేవుని మద్దతు క్రైస్తవులకు ఉందని చూపించడానికి. గతంలో, మోషే వంటి నమ్మకమైన ప్రజలకు తన మద్దతు ఉందని చూపించడానికి దేవుడు కొన్ని అద్భుతాలను గుర్తుగా ఇచ్చాడు. (నిర్గమకాండము 4:1-9, 29-31; సంఖ్యాకాండము 17:10) వేరే భాషల్లో మాట్లాడే వరం కూడా అలాంటి ఒక అద్భుతమే. కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘానికి దేవుని మద్దతు ఉందని అది చూపించింది. “భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే గుర్తు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు.—1 కొరింథీయులు 14:22.

  2. క్రైస్తవులు పూర్తిస్థాయిలో సాక్ష్యమివ్వడానికి. పెంతెకొస్తు రోజున యేసు శిష్యుల మాటలు విన్నవాళ్లు ఇలా అన్నారు, “దేవుని శక్తివంతమైన కార్యాల గురించి వీళ్లు మన భాషల్లో మాట్లాడడం మనమందరం వింటున్నాం.” (అపొస్తలుల కార్యాలు 2:11) కాబట్టి, యేసు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం క్రైస్తవులు ‘పూర్తిస్థాయిలో సాక్ష్యమిచ్చి’ “అన్ని దేశాల ప్రజలను శిష్యుల్ని” చేయాలనే ఉద్దేశంతో దేవుడు ఆ అద్భుత వరాన్ని ఇచ్చాడు. (అపొస్తలుల కార్యాలు 10:42; మత్తయి 28:19) ఆ అద్భుతాన్ని కళ్లారా చూసి, శిష్యుల మాటల్ని విన్న దాదాపు 3,000 మంది అదే రోజున శిష్యులయ్యారు.—అపొస్తలుల కార్యాలు 2:41.

 వేరే భాషల్లో మాట్లాడే వరం శాశ్వతమైనదా?

కాదు. వేరే భాషల్లో మాట్లాడే వరంతో సహా, పవిత్రశక్తి వరాలన్నీ తాత్కాలికమైనవి. దానిగురించి బైబిలు ముందుగానే ఇలా చెప్పింది, “ప్రవచించే వరాలైనా, భాషలు మాట్లాడడమైనా, . . . ఆగిపోతాయి.”—1 కొరింథీయులు 13:8.

 వేరే భాషల్లో మాట్లాడే వరం ఎప్పుడు ఆగిపోయింది?

సాధారణంగా అపొస్తలుల సమక్షంలో ఇతర క్రైస్తవులు పవిత్రశక్తి వరాల్ని పొందేవాళ్లు. అపొస్తలులు వాళ్ల మీద చేతులు ఉంచినప్పుడు అలా జరిగేది. (అపొస్తలుల కార్యాలు 8:18; 10:44-46) అయితే ఆ విధంగా పవిత్రశక్తి వరాల్ని పొందినవాళ్లు వాటిని ఇతరులకు ఇవ్వలేదని చెప్పవచ్చు. (అపొస్తలుల కార్యాలు 8:5-7, 14-17) ఉదాహరణకు, ఒక ప్రభుత్వ అధికారి ఒక వ్యక్తికి డ్రైవింగ్‌​ లైసెన్స్‌​ ఇస్తాడే తప్ప, ఇతరులకు లైసెన్స్‌​ ఇచ్చే చట్టపరమైన అధికారాన్ని ఇవ్వడు. వేరే భాషల్లో మాట్లాడే వరం కూడా అలాంటిదే. అపొస్తలులు, అలాగే వాళ్ల ద్వారా ఆ వరాన్ని పొందినవాళ్లు మరణించినప్పుడే ఆ వరం ఆగిపోయిందని తెలుస్తోంది.

 వేరే భాషల్లో మాట్లాడే వరం నేడు ఎవరికైనా ఉందా?

క్రీ.శ. మొదటి శతాబ్దం చివరికల్లా వేరే భాషల్లో మాట్లాడే అద్భుత వరం ఆగిపోయి ఉండవచ్చు. కాబట్టి దేవుని శక్తితో వేరే భాషల్లో మాట్లాడగలుగుతున్నామని నేడు ఎవ్వరూ చెప్పలేరు.

 నిజ క్రైస్తవుల్ని ఎలా గుర్తించవచ్చు?

స్వయంత్యాగపూరితమైన ప్రేమను బట్టి నిజ క్రైస్తవుల్ని గుర్తించవచ్చని యేసు అన్నాడు. (యోహాను 13:34, 35) అదేవిధంగా అపొస్తలుడైన పౌలు కూడా, నిజ క్రైస్తవులకు ప్రేమే శాశ్వతమైన గుర్తుగా ఉంటుందని చెప్పాడు. (1 కొరింథీయులు 13:1, 8) దేవుని పవిత్రశక్తి క్రైస్తవుల్లో కొన్ని లక్షణాలు పుట్టిస్తుందని ఆయన చెప్పాడు. వాటన్నిటిని కలిపి ‘పవిత్రశక్తి పుట్టించే లక్షణాలు’ అనవచ్చు. వాటిలో మొదటిది ప్రేమే.—గలతీయులు 5:22, 23.