కంటెంట్‌కు వెళ్లు

వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

ఎదిగిన పిల్లలకు వయసుపైబడిన తమ తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకునే ముఖ్యమైన బాధ్యత ఉంది. పిల్లలకు బైబిలు ఇలా చెప్తుంది, ‘వాళ్లు తమ కుటుంబాన్ని పట్టించుకోవాలి. ఆ విధంగా తమ మతానికి సంబంధించిన కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగజేస్తుంది.’ (1 తిమోతి 5:4, న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌) ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకుంటే, ‘అమ్మానాన్నలను గౌరవించాలి’ అనే బైబిలు ఆజ్ఞకు కూడా లోబడతారు.—ఎఫెసీయులు 6:2, 3.

వయసుపైబడిన తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకోవడం గురించి బైబిల్లో నిర్దిష్టమైన సూచనలు లేవు. అయితే అలా పట్టించుకున్న విశ్వాసులైన స్త్రీపురుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అంతేకాదు తల్లిదండ్రుల్ని చూసుకునేవాళ్లకు అది మంచి సలహాల్ని కూడా ఇస్తుంది.

 బైబిలు కాలాల్లో, కొంతమంది వయసుపైబడిన తమ తల్లిదండ్రుల బాగోగుల్ని ఎలా పట్టించుకున్నారు?

వాళ్లు తమ పరిస్థితులకు తగ్గట్టు వేర్వేరు విధాలుగా పట్టించుకున్నారు.

 • యోసేపు, వృద్ధుడైన తన తండ్రి యాకోబుకు దూరంగా నివసించేవాడు. యోసేపు సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు, తన తండ్రి తన దగ్గరికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు తన తండ్రికి ఇంటిని, ఆహారాన్ని ఇచ్చి సంరక్షించాడు.—ఆదికాండము 45:9-11; 47:11, 12.

 • రూతు తన అత్త సొంత దేశానికి వలస వెళ్లింది. అక్కడ ఆమెను చూసుకోవడానికి రూతు బాగా కష్టపడి పనిచేసింది.—రూతు 1:16; 2:2, 17, 18, 23.

 • యేసు తాను చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు, అప్పటికే విధవరాలిగా ఉన్న తన తల్లి బాగోగుల్ని పట్టించుకునే బాధ్యతను వేరొకరికి అప్పగించాడు.—యోహాను 19:26, 27. *

 తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకునేవాళ్లకు బైబిలు ఎలాంటి సలహాల్ని ఇస్తుంది?

వయసుపైబడిన తల్లిదండ్రుల్ని పట్టించుకునేవాళ్లు కొన్నిసార్లు శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. అలాంటి సమయంలో వాళ్లకు సహాయం చేసే మంచి సూత్రాలు బైబిల్లో ఉన్నాయి.

 • మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి.

  బైబిలు ఏం చెప్తుంది? “నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.”—నిర్గమకాండము 20:12.

  ఆ సూత్రాన్ని ఎలా పాటించవచ్చు? మీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నారని చూపించడానికి వాళ్ల పరిస్థితులు అనుమతించినంత మేరకు, వాళ్లను ఎప్పటిలాగే స్వేచ్ఛగా జీవించనివ్వండి. వాళ్ల బాగోగుల గురించి వాళ్లే నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛనివ్వండి. అదే సమయంలో మీరు వాళ్లకు చేయగలిగిన సహాయం చేయండి.

 • అర్థం చేసుకుంటూ, క్షమిస్తూ ఉండండి.

  బైబిలు ఏం చెప్తుంది? “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.”—సామెతలు 19:11.

  ఆ సూత్రాన్ని ఎలా పాటించవచ్చు? ఒకవేళ వయసుపైబడిన తల్లిగానీ, తండ్రిగానీ కోపంగా మాట్లాడితే లేదా మీరు చూపిస్తున్న శ్రద్ధకు కృతజ్ఞత లేనట్లు ప్రవర్తిస్తే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి ‘ఒకవేళ వాళ్ల స్థితిలో నేను ఉంటే ఎలా ప్రవర్తిస్తాను?’ మీరు వాళ్లను అర్థం చేసుకుంటూ, క్షమించడానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవ్వకుండా ఉంటుంది.

 • ఇతరులతో మాట్లాడండి.

  బైబిలు ఏం చెప్తుంది? “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.”—సామెతలు 15:22.

  ఆ సూత్రాన్ని ఎలా పాటించవచ్చు? బహుశా మీ తల్లిదండ్రులకు ఎలాంటి అనారోగ్య సమస్యల్ని రావచ్చో, అవి వచ్చినప్పుడు ఏం చేయవచ్చో పరిశోధన చేయండి. వాళ్లకు సహాయం చేయడానికి స్థానికంగా ఏమేమి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో కనుక్కోండి. మీకు తోబుట్టువులు ఉంటే, వాళ్లూ మీరూ కలిసి మీ తల్లిదండ్రుల అవసరాలేంటో, వాటిని ఎలా తీర్చవచ్చో, ఆ బాధ్యతను ఎలా పంచుకోవచ్చో మాట్లాడుకోవడం మంచిది.

  మీ తల్లిదండ్రుల బాగోగుల గురించి కుటుంబమంతా కలిసి చర్చించుకోగలరేమో ఆలోచించండి.

 • అణకువగా ఉండండి.

  బైబిలు ఏం చెప్తుంది? ‘అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.’—సామెతలు 11:2, NW.

  ఆ సూత్రాన్ని ఎలా పాటించవచ్చు? మీ పరిమితులేంటో గుర్తించండి. ఉదాహరణకు ప్రతీఒక్కరికి సమయం, శక్తి పరిమితంగానే ఉంటాయి. దాన్నిబట్టే మీరు మీ తల్లిదండ్రులకు నిజంగా ఎంత సహాయం చేయగలరో తెలుస్తుంది. వయసుపైబడిన మీ తల్లిదండ్రులు కోరే వాటన్నిటినీ తీర్చడం ఒక్కోసారి మీకు కష్టమవ్వచ్చు. అలాంటి పరిస్థితిలో మీ కుటుంబంలోని ఇతరుల సహాయం తీసుకోవడం గురించి లేదా వేరేవాళ్లను సంప్రదించడం గురించి ఆలోచించండి.

 • మీ గురించి కూడా ఆలోచించుకోండి.

  బైబిలు ఏం చెప్తుంది? “ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు.”—ఎఫెసీయులు 5:29.

  ఆ సూత్రాన్ని ఎలా పాటించవచ్చు? తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ, మీ అవసరాల గురించి కూడా మీరు పట్టించుకోవాలి; ఒకవేళ మీకు పెళ్లైతే మీ కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు చక్కగా తినండి. తగినంత విశ్రాంతి తీసుకోండి, సరిపడా నిద్రపోండి. (ప్రసంగి 4:6) వీలైనప్పుడల్లా, విరామం తీసుకోవడం అవసరం. ఇవన్నీ చేయడం వల్ల మీరు భావోద్వేగంగా, మానసికంగా, శారీరకంగా అలసిపోకుండా ఉంటారు. అలాగే మీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోగలుగుతారు.

 వయసుపైబడిన తల్లిదండ్రుల్ని ఇంట్లోనే ఉంచి చూసుకోవాలని బైబిలు చెప్తుందా?

ఎదిగిన పిల్లలు తమ తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి చూసుకోవాలా లేదా అనే విషయం గురించి బైబిల్లో ఎలాంటి నిర్దేశం లేదు. కొన్ని కుటుంబాలు వయసుపైబడిన తల్లిదండ్రుల్ని తమ ఇంట్లోనే ఉంచుకొని వీలైనంత ఎక్కువకాలం చూసుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఒక సమయంలో ఇంట్లో కాకుండా, వృద్ధుల్ని శ్రద్ధగా చూసుకునే చోట ఉంచడం వాళ్లకు మంచిదనిపించవచ్చు. అలాంటప్పుడు, అందరికీ ఏది మంచిదో కుటుంబమంతా కలసి చర్చించుకోవచ్చు.—గలతీయులు 6:4, 5.

^ పేరా 12 ఈ వృత్తాంతం గురించి ఒక బైబిలు కామెంటరీ ఇలా చెప్తుంది: “బహుశా యోసేపు [మరియ భర్త] చనిపోయి చాలాకాలం అయ్యుంటుంది, కాబట్టి యేసు తన తల్లి బాగోగుల్ని పట్టించుకున్నాడు. ఇప్పుడు ఆయన కూడా చనిపోతున్నాడు, మరి ఆమె పరిస్థితి ఏంటి?... క్రీస్తు, వయసుపైబడిన తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకునే విషయంలో పిల్లలకు మంచి ఆదర్శం ఉంచాడు.”—ద ఎన్‌ఐవి మాథ్యూ హెన్రీ కామెంటరీ ఇన్‌ వన్‌ వాల్యూమ్‌లో 428-429 పేజీలు చూడండి.