కంటెంట్‌కు వెళ్లు

దేవుని రాజ్యమంటే మీ హృదయంలో ఉండేదా?

దేవుని రాజ్యమంటే మీ హృదయంలో ఉండేదా?

బైబిలు ఇచ్చే జవాబు

కాదు, దేవుని రాజ్యమంటే అది క్రైస్తవుల హృదయంలో ఉండే ఒక స్థితి కాదు. * బైబిలు దాన్ని “పరలోకరాజ్యము” అని పిలుస్తోంది. కాబట్టి అది పరలోకంలో ఉండేదని చెప్పవచ్చు. (మత్తయి 4:17) దేవుని రాజ్యం, పరలోకం నుండి పరిపాలిస్తున్న నిజమైన ప్రభుత్వమని బైబిలు ఎలా చెప్తుందో పరిశీలించండి.

  • ఆ రాజ్యానికి పరిపాలకులు, ప్రజలు, చట్టాలు ఉన్నాయి. అలాగే దేవుని ఇష్టాన్ని పరలోకంలో, భూమ్మీద నెరవేర్చడానికి దానికి అధికారం కూడా ఉంది.—మత్తయి 6:9-10; ప్రకటన 5:9-10.

  • దేవుని ప్రభుత్వం లేదా రాజ్యం సకల ‘జనులను, రాష్ట్రాలను, భాషలు మాట్లాడేవాళ్లను’ పరిపాలిస్తుంది. (దానియేలు 7:13, 14) అలా పరిపాలించే అధికారం మనుషులు కాదుగానీ స్వయంగా దేవుడే ఆ రాజ్యానికి ఇస్తాడు.—కీర్తన 2:4-6; యెషయా 9:7.

  • తన నమ్మకమైన అపొస్తలులు పరలోక రాజ్యంలో తనతోపాటు “సింహాసనముల మీద” కూర్చొని పరిపాలిస్తారని యేసు వాళ్లతో చెప్పాడు.—లూకా 22:28-30.

  • ఆ రాజ్యానికి శత్రువులు కూడా ఉన్నారు, వాళ్లను అది నాశనం చేస్తుంది.—కీర్తన 2:1, 2, 8, 9; 110:1, 2; 1 కొరింథీయులు 15:25, 26.

పరలోక రాజ్యం హృదయంలో ఉండేదని అంటే అది ఒక వ్యక్తి హృదయం నుండి పరిపాలిస్తుందని బైబిలు బోధించడం లేదు. బదులుగా, “రాజ్యమునుగూర్చిన వాక్యము” లేదా “రాజ్య సువార్త” మన హృదయాల మీద ప్రభావం చూపించగలదని, అలా చూపించాలని అది చెప్తుంది.—మత్తయి 13:19; 24:14.

దేవుని రాజ్యం మీలో ఉంది అంటే ఏమిటి?

లూకా 17:21 ని కొన్ని బైబిల్లో అనువదించిన దాన్నిబట్టి కొంతమందికి ఆ రాజ్యం ఎక్కడ ఉంది అనేదానిపై చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు, ఈ వచనాన్ని కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌, “దేవుని రాజ్యం మీలో ఉంది” అని అనువదించింది. అయితే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం దాని సందర్భాన్ని పరిశీలించాలి.

యేసును చంపాలనుకున్న కఠినమైన తన శత్రువుల హృదయంలో దేవుని రాజ్యం లేదు

యేసు పరిసయ్యులతో అంటే తనను వ్యతిరేకించి, తనను చంపాలనుకున్న వాళ్లతో చేతులు కలిపిన ఓ మతనాయకుల గుంపుతో మాట్లాడుతున్నాడు. (మత్తయి 12:14; లూకా 17:20) మరి దేవుని రాజ్యాన్ని అలాంటి వాళ్ల కఠినమైన హృదయాల్లో ఉండే స్థితి అని అనుకుంటే దానిలో అర్థం ఉంటుందా? యేసు వాళ్లతో ఇలా అన్నాడు, మీరు “లోపల వేషధారణతోను అక్రమముతోను నిండియున్నారు.”—మత్తయి 23:27-28.

లూకా 17:21లోని యేసు మాటల్ని వేరే అనువాదాలు ఇలా సరిగ్గా అనువదించాయి, “దేవుని రాజ్యం ఇక్కడ మీతో ఉంది.” (ఇటాలిక్కులు మావి; కంటెంపరరీ ఇంగ్లీషు వర్షన్‌) “దేవుని రాజ్యం మీ మధ్య ఉంది.” (నూతనలోక అనువాదం, అధస్సూచి) దేవుడు ఎన్నుకున్న రాజైన యేసు వాళ్ల ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ భావంలో దేవుని రాజ్యం పరిసయ్యులతో లేదా వాళ్ల మధ్య ఉంది.—లూకా 1:32, 33.

^ పేరా 1 దేవుని రాజ్యం అనేది ఓ వ్యక్తిలో లేదా ఒకరి హృదయంలో ఉండేదని చాలా క్రైస్తవ శాఖలు బోధిస్తాయి. ఉదాహరణకు, అమెరికాలోని సదరన్‌ బాప్టిస్ట్‌ కన్వెన్షన్‌ దేవుని రాజ్యం “ఒక వ్యక్తి హృదయంలో, జీవితంలో జరిగే దేవుని పరిపాలనలో” ఓ భాగం అని ప్రకటించింది. అదేవిధంగా, పోప్‌ బెనడిక్ట్‌ XVI జీసస్‌ ఆఫ్‌ నాజరెత్‌ అనే తన పుస్తకంలో “వినే హృదయం ద్వారా దేవుని రాజ్యం వస్తుంది” అని రాశాడు.