కంటెంట్‌కు వెళ్లు

రక్షణ అంటే ఏమిటి?

రక్షణ అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

ప్రమాదం లేదా విపత్తును తప్పించుకోవడం అనే ఆలోచనను తెలియజేయడానికి, బైబిలు రచయితలు కొన్నిసార్లు “రక్షించడం,” “రక్షణ” అనే పదాల్ని ఉపయోగించారు. (నిర్గమకాండము 14:13, 14; అపొస్తలుల కార్యములు 27:20, 21) అయితే చాలాచోట్ల ఈ పదాలు, పాపం నుండి విడుదల పొందడం అనే అర్థాన్ని ఇస్తాయి. (మత్తయి 1:21) పాపం వల్లే మరణం వచ్చింది కాబట్టి, పాపం నుండి విడుదల పొందినవాళ్లు నిరంతరం జీవించే అవకాశం పొందుతారు.—యోహాను 3:16, 17. *

రక్షణ పొందడం ఎలా?

రక్షణ పొందాలంటే యేసును విశ్వసించాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించి ఆ విశ్వాసాన్ని చూపించాలి.—అపొస్తలుల కార్యములు 4:10, 12; రోమీయులు 10:9, 10; హెబ్రీయులు 5:9, 10.

మీ విశ్వాసం నిజమైనదని నిరూపించుకోవాలంటే మీరు దాన్ని చేతల్లో చూపించాలని, విధేయతతో కూడిన పనులు చేయాలని బైబిలు చెప్తోంది. (యాకోబు 2:24, 26) అలాగని, రక్షణ అనేది సంపాదించుకోగలిగేది మాత్రం కాదు. అది, దేవుడు ‘కృపతో,’ ‘అపారదయతో’ ఇచ్చే బహుమతి.—ఎఫెసీయులు 2:8, 9, NW.

మనం రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉందా?

ఉంది. నీళ్లలో మునిగిపోతున్న ఒక వ్యక్తిని కాపాడిన తర్వాత కూడా, అతను మళ్లీ నీళ్లలో పడిపోయే అవకాశం ఉంది లేదా అతనే నీళ్లలోకి దూకేసే అవకాశం ఉంది. అలాగే, పాపం నుండి రక్షణ పొందిన వ్యక్తి కూడా విశ్వాసాన్ని చూపించకపోతే, రక్షణను పోగొట్టుకుంటాడు. అందుకే, రక్షణ పొందిన క్రైస్తవులను ‘విశ్వాసం కోసం గట్టిగా పోరాడమని’ బైబిలు ప్రోత్సహిస్తోంది. (యూదా 3NW) అంతేకాదు, రక్షింపబడినవాళ్లను “భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి,” అని అది హెచ్చరిస్తోంది.—ఫిలిప్పీయులు 2:12.

రక్షకుడు ఎవరు? దేవుడా, యేసా?

బైబిలు దేవుణ్ణి చాలాచోట్ల “రక్షకుడు” అని సంబోధిస్తూ, ఆయన్ని రక్షణకు ప్రాథమిక మూలంగా గుర్తిస్తోంది. (1 సమూయేలు 10:19; యెషయా 43:11; తీతు 2:9, 10; యూదా 24, 25) పూర్వం ఇశ్రాయేలు దేశాన్ని కాపాడడానికి దేవుడు కొందరు మనుషుల్ని ఉపయోగించుకున్నాడు. బైబిలు వాళ్లను కూడా ‘రక్షకులు’ అంటోంది. (నెహెమ్యా 9:27; న్యాయాధిపతులు 3:9, 15; 2 రాజులు 13:5) * అలాగే, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ద్వారా దేవుడు మనకు పాపం నుండి విడుదలను ఏర్పాటు చేశాడు కాబట్టి, బైబిలు యేసును ‘రక్షకుడు’ అంటోంది.—అపొస్తలుల కార్యములు 5:31; తీతు 1:4. *

అందరూ రక్షించబడతారా?

లేదు. కొంతమందికి రక్షణ ఉండదు. (2 థెస్సలొనీకయులు 1:9, 10) ఒకసారి యేసుని, “రక్షణపొందు వారు కొద్దిమందేనా?” అని అడిగినప్పుడు ఆయన, “ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదు” అని చెప్పాడు.—లూకా 13:23, 24.

మనుషులందరూ రక్షణ పొందుతారనే విషయంలో అపోహలు

అపోహ: మొదటి కొరింథీయులు 15:22 లో “క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు,” అని ఉంది కాబట్టి మనుషులందరూ రక్షణ పొందుతారని బైబిలు బోధిస్తోంది.

వాస్తవం: ఈ వచనంలోని సందర్భం, చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతకడం గురించి మాట్లాడుతోంది. (1 కొరింథీయులు 15:12, 13, 20, 21, 35) కాబట్టి, “క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు” అనే మాటకు, పునరుత్థానమయ్యే వాళ్లందరూ యేసుక్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదం పొందుతారని అర్థం.—యోహాను 11:25.

అపోహ: తీతు 2:11 వ వచనం, “సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప” గురించి మాట్లాడుతూ మనుషులందరూ రక్షణ పొందుతారని బోధిస్తోంది.

వాస్తవం: ఈ వచనంలో “సమస్త” అని అనువదించిన గ్రీకు పదానికి “అన్నిరకాల” అనే అర్థం కూడా ఉంది. * దీన్నిబట్టి, తీతు 2:11 వ వచనానికి సరైన అర్థం ఏమిటంటే, దేవుడు “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చే ప్రజలతో సహా అన్నిరకాల ప్రజలకు రక్షణ దయచేస్తాడు.—తీతు 2:11; ప్రకటన 7:9, 10.

అపోహ: “యెవడును నశింపవలెనని” దేవుడు కోరుకోవడం లేదు అని చెప్తూ 2 పేతురు 3:9 వ వచనం, మనుషులందరూ రక్షణ పొందుతారని బోధిస్తోంది.

వాస్తవం: ప్రజలు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ రక్షణ ఏర్పాటును అంగీకరించమని వాళ్లను ఆయన బలవంతం చేయడు. తీర్పు రోజున, “భక్తిహీనుల ... నాశనము” కూడా జరుగుతుంది.—2 పేతురు 3:7.

^ పేరా 1 ఒక వ్యక్తి పాపం, మరణం నుండి అసలైన విడుదల ఇంకా పొందకపోయినా, అతను లేదా ఆమె రక్షించబడ్డారని బైబిలు చెప్తోంది.—ఎఫెసీయులు 2:4, 5; రోమీయులు 13:11.

^ పేరా 5 కొన్ని అనువాదాలు, ఈ వచనాల్లో “రక్షకుడు” అనే పదాన్ని కాకుండా “విజేత,” “విడిపించేవాడు,” “యోధుడు,” “నాయకుడు” లేదా “ఒకడు” అనే పదాలు వాడాయి. కానీ అసలైన హీబ్రూ లేఖనాల్లో, యెహోవా దేవుడిని రక్షకుడని చెప్తున్నప్పుడు ఉపయోగించిన పదాన్నే ఈ మానవ రక్షకుల కోసం కూడా వాడారు.—కీర్తన 7:10.

^ పేరా 5 యేసు అనే పేరు యెహోషువ అనే హీబ్రూ పేరు నుండి వచ్చింది, ఆ పేరుకు “యెహోవాయే రక్షణ” అని అర్థం.

^ పేరా 10 వైన్స్‌ కంప్లీట్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్ట్స్‌ చూడండి. తన శిష్యులమీద ప్రజలు “అన్ని రకాల” చెడ్డమాటలు చెప్తారని యేసు చెప్పిన మత్తయి 5:11 వ వచనంలో కూడా సరిగ్గా ఇదే గ్రీకు పదం కనిపిస్తుంది.—పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.