కంటెంట్‌కు వెళ్లు

రక్తం ఎక్కించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

రక్తం ఎక్కించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

మనం రక్తాన్ని తినకూడదు, ఎక్కించుకోకూడదు అని బైబిలు ఆజ్ఞాపిస్తుంది. కాబట్టి రక్తాన్నిగానీ అందులోని ప్రధాన భాగాల్నిగానీ మనం తినకూడదు లేదా ఎక్కించుకోకూడదు. ఈ కింది లేఖనాలను గమనించండి:

  • ఆదికాండము 9:4. జలప్రవయం తర్వాత దేవుడు, నోవహుకు ఆయన కుటుంబానికి జంతు మాంసాన్ని ఆహారంగా ఇచ్చాడు కానీ రక్తాన్ని మాత్రం తినకూడదని ఆజ్ఞాపించాడు. ఆయన నోవహుతో “మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము” అని అన్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞ నోవహు వారసులుగా మనుషులందరికీ వర్తిస్తుంది.

  • లేవీయకాండము 17:14. “మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందును.” రక్తంలో ప్రాణం ఉంటుందని దేవుడు భావిస్తున్నాడు, అది ఆయనకే చెందుతుంది. ఈ ఆజ్ఞను దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినప్పటికీ, రక్తాన్ని తినడాన్ని దేవుడు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది.

  • అపొస్తలుల కార్యములు 15:20. ‘రక్తాన్ని విసర్జించండి.’ నోవహుకు ఇచ్చిన ఆజ్ఞనే దేవుడు క్రైస్తవులకు కూడా ఇచ్చాడు. తొలి క్రైస్తవులు రక్తాన్ని తినడానికి లేదా వైద్యంలో ఉపయోగించడానికి నిరాకరించారని చరిత్ర చూపిస్తుంది.

రక్తాన్ని విసర్జించమని దేవుడు మనకెందుకు ఆజ్ఞాపిస్తున్నాడు?

రక్తాన్ని ఎక్కించుకోవడం మన ఆరోగ్యానికి ప్రమాదకరమని చెప్పడానికి వైద్యపరంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు రక్తాన్ని పవిత్రంగా ఎంచుతున్నాడు కాబట్టి మనం దాన్ని విసర్జిస్తాం.—లేవీయకాండము 17:11; కొలొస్సయులు 1:19-20.