కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

యేసు రక్షిస్తాడు​​—⁠ఎలా?

యేసు రక్షిస్తాడు​​—⁠ఎలా?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా దేవునికి నమ్మకంగా ఉండే మనుషుల్ని రక్షించాడు. (మత్తయి 20:⁠28) అందుకే బైబిలు యేసును ‘లోక రక్షకుడు’ అని పిలుస్తుంది. (1 యోహాను 4:⁠14) బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “ఇంకెవ్వరి ద్వారా రక్షణ రాదు. ఎందుకంటే, మనల్ని రక్షించడానికి ప్రజల్లో నుండి దేవుడు ఎంచుకున్న వేరే ఏ పేరూ భూమ్మీద లేదు.”​—⁠అపొస్తలుల కార్యాలు 4:⁠12.

తన మీద విశ్వాసం ఉంచే “ప్రతీ మనిషి కోసం యేసు మరణాన్ని రుచి చూశాడు.” (హెబ్రీయులు 2:9; యోహాను 3:⁠16) ఆ తర్వాత, “దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాడు.” అప్పుడు, యేసు ఆత్మ ప్రాణిగా తిరిగి పరలోకానికి వెళ్లాడు. (అపొస్తలుల కార్యాలు 3:⁠15) “తన పేరున దేవునికి ప్రార్థించేవాళ్లను యేసు పూర్తిస్థాయిలో రక్షించగలడు . . . ఎందుకంటే వాళ్ల తరఫున వేడుకోవడానికి ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు.”​​—⁠హెబ్రీయులు 7:⁠25.

యేసు మన కోసం ఎందుకు వేడుకోవాలి?

మనమందరం పాపులం. (రోమీయులు 3:⁠23) మనకు, దేవునికి పాపం ఓ అడ్డుగోడలా ఉంది, అంతేకాకుండా ఆ పాపం వల్ల మనం చనిపోతున్నాం. (రోమీయులు 6:⁠23) కానీ తన విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచేవాళ్ల తరఫున యేసు ఒక ‘న్యాయవాదిలా’ పనిచేస్తాడు. (1 యోహాను 2:​1, అధస్సూచి) వాళ్ల ప్రార్థనల్ని వినమని, తాను అర్పించిన విమోచన క్రయధన బలి ఆధారంగా వాళ్ల పాపాల్ని క్షమించమని యేసు దేవుణ్ణి వేడుకుంటాడు. (మత్తయి 1:⁠21; రోమీయులు 8:⁠34) దేవుని ఇష్టానికి అనుగుణంగా యేసు చేసే అలాంటి విన్నపాలకు యెహోవా జవాబిస్తాడు. “లోకం తన కుమారుడి ద్వారా రక్షించబడేందుకే” దేవుడు యేసును భూమ్మీదికి పంపించాడు.​​—⁠ యోహాను 3:⁠17.

రక్షణ పొందాలంటే, కేవలం యేసు మీద విశ్వాసం ఉంచితే సరిపోతుందా?

సరిపోదు. రక్షణ పొందాలంటే మనం యేసు మీద విశ్వాసం ఉంచడమే కాకుండా, ఇంకా ఎక్కువే చేయాలి. (అపొస్తలుల కార్యాలు 16:​30, 31) బైబిలు ఇలా చెప్తుంది: “ప్రాణం లేని శరీరంలా చేతలు లేని విశ్వాసం కూడా నిర్జీవమే.” (యాకోబు 2:⁠26) మనం రక్షణ పొందాలంటే ఈ పనులు చేయాలి:

  • యేసు గురించి, ఆయన తండ్రైన యెహోవా గురించి తెలుసుకోవాలి.​​—⁠ యోహాను 17:⁠3.

  • వాళ్ల మీద విశ్వాసం ఉంచాలి.​​—⁠యోహాను 12:⁠44; 14:⁠1.

  • వాళ్లు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడడం ద్వారా విశ్వాసాన్ని మన చేతల్లో చూపించాలి. (లూకా 6:⁠46; 1 యోహాను 2:⁠17) “ప్రభువా” అని తనను పిలిచే ప్రతీఒక్కరు రక్షణ పొందరుగానీ “పరలోకంలో ఉన్న [తన] తండ్రి ఇష్టాన్ని చేస్తున్నవాళ్లే” రక్షణ పొందుతారని యేసు బోధించాడు.​​—⁠మత్తయి 7:⁠21.

  • కష్టాలు వచ్చినా మనం విశ్వాసం చూపిస్తూనే ఉండాలి. ఎందుకంటే “అంతం వరకు సహించిన వాళ్లే రక్షించబడతారు” అని యేసు స్పష్టంగా చెప్పాడు.​​—⁠మత్తయి 24:⁠13.