కంటెంట్‌కు వెళ్లు

యేసు చూడడానికి ఎలా ఉండేవాడు?

యేసు చూడడానికి ఎలా ఉండేవాడు?

బైబిలు ఇచ్చే జవాబు

యేసు చూడడానికి ఎలా ఉండేవాడో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఆయన రూపురేఖల గురించి బైబిల్లో ఎలాంటి వివరాలు లేవు. దీన్నిబట్టి ఆయన రూపురేఖలు ఎలా ఉండేవో తెలుసుకోవడం ముఖ్యం కాదని చెప్పవచ్చు. కాకపోతే ఆయన ఎలా ఉండేవాడో ఉహించుకోవడానికి సహాయం చేసే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి.

  • రూపురేఖలు: యేసు యూదుడు. బహుశా ఆ జాతికి సంబంధించిన కొన్ని పోలికలు తల్లి నుండి ఆయనకు వచ్చివుంటాయి. (హెబ్రీయులు 7:14) ఆయన చూడడానికి ప్రత్యేకంగా ఉండేవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఎందుకంటే ఒక సందర్భంలో ఆయన గలిలయ నుండి యెరూషలేము వరకు రహస్యంగా వెళ్లాడు, ఎవ్వరూ ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. (యోహాను 7:10, 11) తన సన్నిహిత శిష్యుల్లా ఆయన కూడా సాధారణ మనిషిలానే ఉండేవాడు. అందుకే బంధించడానికి వచ్చిన సైనికులు యేసును గుర్తుపట్టేందుకు ఇస్కరియోతు యూదా ఒక సూచన ఇవ్వాల్సి వచ్చింది.—మత్తయి 26:47-49.

  • జుట్టు పొడవు: యేసు జుట్టు పొడవుగా ఉండేది కాదు. ఎందుకంటే “పొడవు జుట్టు పురుషునికి అవమానమని” బైబిలు చెప్తోంది.—1 కొరింథీయులు 11:14.

  • గడ్డం: యేసుకు గడ్డం ఉండేది. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, పురుషులు ‘గడ్డం ప్రక్కలను గొరగకూడదు.’ కాబట్టి ఆయన ఆ ఆచారాన్ని పాటించేవాడు. (లేవీయకాండము 19:27; గలతీయులు 4:4) అంతేకాదు, ఆయన అనుభవించబోయే బాధల్ని వివరించే ప్రవచనంలో, ఆయన చెంపలపై ఉండే వెంట్రుకలు లేదా గడ్డం గురించిన ప్రస్తావన ఉంది.—యెషయా 50:6.

  • శరీరం: ఉన్న వివరాలన్నిటినిబట్టి చూస్తే యేసు శరీరదారుఢ్యంగల వ్యక్తి అని తెలుస్తోంది. పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించాడు. (మత్తయి 9:35) ఒక సందర్భంలో, రూకలు మార్చేవాళ్ల బల్లల్ని విసిరేశాడు, మరో సందర్భంలో జంతువుల్ని ఆలయం నుండి కొరడాతో వెళ్లగొట్టాడు. అలా యూదుల ఆలయాన్ని రెండుసార్లు శుభ్రపర్చాడు. (లూకా 19:45, 46; యోహాను 2:14, 15) మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియో ప్రకారం, “ఆయన [యేసు] ఉత్సాహాన్నంతా గమనిస్తే ఆయన చాలా ఆరోగ్యంగా, బలంగా ఉండేవాడని తెలుస్తోంది.”—IVవ సంపుటి, 884వ పేజీ.

  • ముఖకవళికలు: యేసు చాలా ఆప్యాయంగా, కనికరంతో మాట్లాడేవాడు. ఆయన ముఖకవళికల్లో ఆ లక్షణాలు ఖచ్చితంగా కనిపించి ఉంటాయి. (మత్తయి 11:28, 29) అన్నిరకాల ప్రజలు ఓదార్పు కోసం, సాయం కోసం ఆయన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్లు. (లూకా 5:12, 13; 7:37, 38) పిల్లలు సైతం ఆయన దగ్గర సరదాగా ఉండేవాళ్లు.—మత్తయి 19:13-15; మార్కు 9:35-37.

యేసు రూపురేఖల గురించిన అపోహలు

అపోహ: ప్రకటన పుస్తకం యేసు వెంట్రుకల్ని ఉన్నితో, పాదాల్ని మెరిసే రాగితో పోలుస్తోంది కాబట్టి ఆయన ఆఫ్రికా జాతికి చెందినవాడని కొంతమంది వాదిస్తారు.—ప్రకటన 1:14, 15.

నిజం: ప్రకటన పుస్తకంలోని విషయాలు “సూచనల” రూపంలో రాయబడ్డాయి. (ప్రకటన 1:1) యేసు వెంట్రుకలు, పాదాలు గురించి ప్రకటనలో ఉన్న సూచనార్థక వర్ణన, పునరుత్థానమయ్యాక ఆయనకున్న లక్షణాల్ని సూచిస్తోంది. అంతేగానీ భూమ్మీద మనిషిగా ఉన్నప్పటి రూపురేఖల్ని సూచించట్లేదు. ప్రకటన 1:14 లో “ఆయన తల, తలవెంట్రుకలు తెల్లని ఉన్నిలా, మంచులా” ఉన్నాయని వర్ణించినప్పుడు, బైబిలు ఆ పదార్థాల రంగును మాత్రమే పోలికగా తీసుకుంది, ఆ పదార్థాల్ని కాదు. నిజానికి, ఆయనకు వయసుతో వచ్చిన జ్ఞానం గురించి ఆ వచనం మాట్లాడుతోంది. (ప్రకటన 3:14) అంతేగానీ యేసు జుట్టు పట్టుకోవడానికి ఉన్నిలాగో లేదా మంచులాగో ఉంటుందని ఆ వచనం చెప్పట్లేదు.

యేసు పాదాలు “కొలిమిలో మెరిసే రాగిలా” ఉన్నాయని బైబిలు చెప్తోంది. (ప్రకటన 1:15) అంతేకాదు ఆయన ముఖం “ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది” అని కూడా చెప్తోంది. (ప్రకటన 1:16) ఇలాంటి చర్మరంగు ఏ జాతికీ చెందిన ప్రజలకు ఉండదు కాబట్టి ఆ దర్శనం ఖచ్చితంగా సూచనార్థకమైనది అయ్యుండాలి. అంతేకాదు పునరుత్థానమైన యేసు, “దగ్గరికి వెళ్లలేనంత తేజస్సులో” ఉన్నాడని ఆ వర్ణన చూపిస్తోంది.—1 తిమోతి 6:16.

అపోహ: యేసు బలహీనంగా, పీలగా ఉండేవాడు.

నిజం: యేసు ధైర్యంగల వ్యక్తి. ఉదాహరణకు, ఆయుధాలు ధరించి తనను పట్టుకోవడానికి వచ్చినవాళ్లతో తానే యేసునని ఎంతో ధైర్యంగా చెప్పాడు. (యోహాను 18:4-8) అంతేకాదు ఆయన పనిముట్లతో వడ్రంగి పనిచేసేవాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన శరీరదారుఢ్యంగల వ్యక్తి అయ్యుండాలి.—మార్కు 6:3.

అలాగైతే, హింసాకొయ్యను మోయడానికి ఆయనకు సహాయం ఎందుకు అవసరమైంది? పైగా తనతోపాటు వేలాడదీయబడిన ఇద్దరు వ్యక్తులు చనిపోకముందే యేసు ఎందుకు చనిపోయాడు? (లూకా 23:26; యోహాను 19:31-33) చనిపోవడానికి ముందు ఆయన బాగా బలహీనమయ్యాడు. మనోవేదనవల్ల రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. (లూకా 22:42-44) ఆ రాత్రి యూదులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు, ఆ తర్వాతి ఉదయం రోమన్లు ఆయన్ను హింసించారు. (మత్తయి 26:67, 68; యోహాను 19:1-3) అలాంటి కారణాలవల్ల ఆయన త్వరగా చనిపోయి ఉంటాడు.

అపోహ: యేసు ఎప్పుడూ గంభీరంగా, బాధగా ఉండేవాడు.

నిజం: యేసు తన పరలోక తండ్రైన యెహోవా లక్షణాల్ని అచ్చుగుద్దినట్లు చూపించాడు. బైబిలు యెహోవాను “సంతోషంగల దేవుడు” అని వర్ణిస్తోంది. (1 తిమోతి 1:11; యోహాను 14:9) నిజానికి ఎలా సంతోషంగా ఉండాలో యేసు ఇతరులకు నేర్పించాడు. (మత్తయి 5:3-9; లూకా 11:28) వీటినిబట్టి యేసు ముఖం ఎప్పుడూ సంతోషంగా ఉండేదని చెప్పవచ్చు.