కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు

భాష ఎంచుకోండి తెలుగు

మేకప్‌ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

మేకప్‌ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

మేకప్‌ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం, లేదా ఇతర అలంకరణలు చేసుకోవడం గురించి బైబిలు వివరంగా చర్చించట్లేదు, అలాగని వాటిని ఖండించట్లేదు. అయితే, పైకి కనిపించే అలంకరణ మీద కాకుండా “చెరిగిపోని” అలంకరణ మీద దృష్టి పెట్టమని బైబిలు చెప్తుంది. అందులో ఇలా ఉంది: “ప్రశాంతత, సౌమ్యత అనే లక్షణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి.”—1 పేతురు 3:3, 4.

అలంకరించుకోవడం తప్పుకాదు

  •  బైబిల్లో ఉన్న నమ్మకమైన స్త్రీలు తమనుతాము అలంకరించుకున్నారు. అబ్రాహాము కొడుకైన ఇస్సాకును పెళ్లిచేసుకున్న రిబ్కా తనకు కాబోయే మామగారు బహుమతిగా పంపించిన బంగారు ముక్కు పోగును, బంగారు కడియాల్ని, ఇతర ఖరీదైన నగల్ని వేసుకుంది. (ఆదికాండము 24:22, 30, 53) అలాగే, పర్షియా సామ్రాజ్యానికి రాణి అయ్యే క్రమంలో ఎస్తేరు “సౌందర్య పోషణ” చేయించుకోవడానికి అంగీకరించింది. (ఎస్తేరు 2:7, 9, 12) ఆ సౌందర్య పోషణలో ‘పరిమళ ద్రవ్యాలు’ లేదా ‘భిన్న భిన్నమైన అలంకరణ సామాగ్రి’ ఉండివుండవచ్చు.—పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

  •  బైబిల్లో మంచివాటిని పోల్చడానికి నగలను ఉపయోగించారు. ఉదాహరణకు, తెలివైన సలహా ఇచ్చే వ్యక్తి “వినేవాడి చెవికి బంగారు చెవిపోగు లాంటివాడు” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 25:12) అంతేకాదు భర్త తన భార్యను కడియాలతో, హారంతో, చెవి పోగులతో అలంకరించినట్లు, తాను ఇశ్రాయేలు జనాంగాన్ని అలంకరించానని దేవుడు చెప్పాడు. ఇలాంటి అలంకరణ ఆ జనాంగాన్ని ‘మిక్కిలి సౌందర్యవతిగా’ చేసింది.—యెహెజ్కేలు 16:11-13.

మేకప్‌ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం గురించిన అపోహలు

అపోహ: 1 పేతురు 3:3 లో “జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం” తప్పని బైబిలు చెప్తుంది.

నిజం: ఈ సందర్భంలో, పైకి కనిపించే అలంకరణ కంటే అంతరంగ సౌందర్యం ఎంత గొప్పదో బైబిలు వివరిస్తుంది. (1 పేతురు 3:3-6) బైబిల్లో వేరేచోట్ల కూడా ఆ తేడాను వివరించారు.—1 సమూయేలు 16:7; సామెతలు 11:22; 31:30; 1 తిమోతి 2:9, 10.

అపోహ: చెడ్డరాణి అయిన యెజెబెలు కళ్లకు రంగు వేసుకుంది కాబట్టి మేకప్‌ వేసుకోవడం తప్పు.—2 రాజులు 9:30.

నిజం: యెజెబెలు మంత్రతంత్రాలను ఉపయోగించింది, హత్యలకు పాల్పడింది. అలాంటి చెడ్డపనులు చేసినందుకు దేవుడు ఆమెను శిక్షించాడు గానీ, మేకప్‌ వేసుకున్నందుకు కాదు.—2 రాజులు 9:7, 22, 36, 37.