కంటెంట్‌కు వెళ్లు

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం తప్పేమీ కాదని, నిజానికి తగిన స్థాయిలో మీరు ప్రేమించుకోవడం మంచిదని బైబిలు చెప్తుంది. అలాంటి ప్రేమలో మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం, ఆత్మ గౌరవం కలిగి ఉండడం, మిమ్మల్ని మీరు విలువైన వాళ్లుగా ఎంచడం ఇమిడి ఉన్నాయి. (మత్తయి 10:31) అయితే బైబిలు స్వార్థాన్ని ప్రోత్సహించట్లేదు గానీ, సరైన విధంగా మనల్ని మనం ప్రేమించుకోవాలని చెప్తుంది.

మనం ఎవర్ని మొదట ప్రేమించాలి?

  1. మనం మన హృదయాల్లో అన్నిటికంటే ఎక్కువగా యెహోవాను ప్రేమించాలి. “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో . . . ప్రేమించాలి” అనేదే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని బైబిలు బోధిస్తుంది.—మార్కు 12:28-30; ద్వితీయోపదేశకాండము 6:5.

  2. రెండవ ఆజ్ఞ ఏంటంటే, “‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.’”—మార్కు 12:31; లేవీయకాండము 19:18.

  3. మిమ్మల్ని మీరు ప్రేమించుకోమని బైబిలు ప్రత్యేకంగా చెప్పకపోయినా, “‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి’” అనే ఆజ్ఞలో తగిన స్థాయిలో మీ మీద మీకు ప్రేమ, గౌరవం కలిగి ఉండడం సాధారణమేనని, అది ఉపయోగకరమని సూచిస్తుంది.

యేసు మొదట ఎవర్ని ప్రేమించాడు?

యేసు దేవున్ని ప్రేమించడంలో, ఇతరుల్ని ప్రేమించడంలో, తనని తాను ప్రేమించుకోవడంలో సరైన సమతూకాన్ని పాటించాడు. ఆ విషయంలో శిష్యులు కూడా తనని అనుకరించాలని ఆయన చెప్పాడు.—యోహాను 13:34, 35.

  1. యేసు మొదటిగా యెహోవాను ప్రేమించాడు, ఆయన పని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేశాడు. అందుకే యేసు “నాకు తండ్రి మీద ప్రేమ ఉందని లోకం తెలుసుకోవడం కోసం, తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లే నేను చేస్తున్నాను” అని అన్నాడు.—యోహాను 14:31.

  2. ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధ చూపించడం ద్వారా, చివరికి తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా యేసు పొరుగువాళ్ల మీద ప్రేమ చూపించాడు.—మత్తయి 20:28.

  3. విశ్రాంతి తీసుకోవడం, భోజనం చేయడం, తన అనుచరులతో, శిష్యులతో కలిసి వాళ్ల సహవాసాన్ని ఆనందించడం ద్వారా యేసు తగిన స్థాయిలో తన మీద తాను ప్రేమ చూపించుకున్నాడు.—మార్కు 6:31, 32; లూకా 5:29; యోహాను 2:1, 2; 12:2.

మీకన్నా ఇతరుల్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల మీ సంతోషం లేదా ఆత్మ గౌరవం తగ్గిపోతుందా?

ఎంతమాత్రం కాదు. ఎందుకంటే మనం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. నిస్వార్థంగా ప్రేమ చూపించడమే ఆయన ప్రధాన లక్షణం. (ఆదికాండము 1:27; 1 యోహాను 4:8) కాబట్టి మనం ఇతరుల్ని ప్రేమించేలా సృష్టించబడ్డాం. మనల్ని మనం ప్రేమించుకోవడం మంచిదే, అయితే అన్నిటికన్నా ఎక్కువగా దేవున్ని ప్రేమిస్తూ, ఇతరులకు మంచి చేస్తూ ఉన్నప్పుడు మనం మరింత సంతోషంగా జీవించగలుగుతాం. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “‘తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.’”

ఈ రోజుల్లో చాలామంది, మొదట మన గురించి మనం ఆలోచించుకుంటేనే సంతోషంగా ఉంటామని భావిస్తారు. అలాంటి వాళ్లు “ఇతరుల్ని” ప్రేమించాల్సిన స్థానంలో కూడా తమను తామే ప్రేమించుకుంటున్నారు. కానీ, “ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఎప్పుడూ ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచించాలి” అని బైబిలు ఇచ్చే సలహాను పాటించేవాళ్లు ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని ఆధునిక అనుభవాలు రుజువు చేస్తున్నాయి.—1 కొరింథీయులు 10:24.