కంటెంట్‌కు వెళ్లు

ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా?

ఒక మతంలో సభ్యునిగా ఉండడం నిజంగా అవసరమా?

బైబిలు ఇచ్చే జవాబు

అవసరం, ఎందుకంటే ప్రజలు తనను ఆరాధించడానికి సమకూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది: ‘ప్రేమ చూపించడానికి, మంచిపనులు చేయడానికి పురికొల్పుకునేలా మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానకుండా ఉందాం.’—హెబ్రీయులు 10:24, 25.

యేసు, “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది” అని చెప్పడం ద్వారా తన అనుచరులు ఒక గుంపుగా ఏర్పడతారని తెలియజేశాడు. (యోహాను 13:35) క్రీస్తు శిష్యులు ముఖ్యంగా తోటి విశ్వాసులతో సహవసించడం ద్వారా తమ మధ్య ప్రేమ ఉందని చూపిస్తారు. వాళ్లు సంఘాలుగా ఏర్పడి ఆరాధన కోసం క్రమంగా సమకూడతారు. (1 కొరింథీయులు 16:19) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో అలా సమకూడే వాళ్లందరూ సహోదరసహోదరీల్లా కలిసిమెలిసి ఉంటారు.—1 పేతురు 2:17.

కేవలం మతంలో ఒక సభ్యునిగా ఉంటే సరిపోదు

దేవున్ని సంతోషపెట్టాలంటే ఒక మతంలో సభ్యునిగా ఉంటే సరిపోతుందని బైబిలు చెప్పట్లేదు. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలు ఒకచోట సమకూడాలని అది చెప్తుంది. ఏదైనా మతం దేవుని ఆమోదం పొందాలంటే, అది ఆ మత సభ్యుల మీద మంచి ప్రభావం చూపించాలి. ఉదాహరణకు, బైబిలు ఇలా చెప్తుంది: “మన తండ్రైన దేవుని దృష్టిలో శుద్ధమైన, కళంకంలేని మతం ఏమిటంటే కష్టాల్లో ఉన్న అనాథలను, విధవరాళ్లను ఆదుకోవడం; ఈ లోక మలినం అంటకుండా చూసుకోవడం.”—యాకోబు 1:27, అధస్సూచి.