కంటెంట్‌కు వెళ్లు

కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?

కోపం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 అదుపులేని కోపం దాన్ని చూపించేవాళ్లకు, వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లకు ప్రమాదకరమని బైబిలు చెప్తుంది. (సామెతలు 29:22) కొన్నిసార్లు కోపం చూపించడం సరైనదే అయినా “విపరీతమైన కోపం” చూపిస్తూ ఉండేవాళ్లు రక్షణ పొందరని బైబిలు చెప్తుంది. (గలతీయులు 5:19-21) కోపాన్ని అదుపు చేసుకోవడానికి సహాయం చేసే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి.

 కోపం చూపించడం ఎప్పుడూ తప్పేనా?

 కాదు. కొన్ని సందర్భాల్లో కోప్పడడం తప్పు కాకపోవచ్చు. ఉదాహరణకు, తన తోటి ఆరాధకులు బాధపడుతున్నారని తెలిసినప్పుడు నమ్మకస్థుడైన నెహెమ్యా ‘మిగుల కోపపడ్డాడు.’—నెహెమ్యా 5:6.

 కొన్ని సందర్భాల్లో దేవుడికి కూడా కోపం వస్తుంది. ఉదాహరణకు, ఇశ్రాయేలు ప్రజలు తనను మాత్రమే ఆరాధించాలని చేసుకున్న ఒప్పందాన్ని మీరి అబద్ధ దేవుళ్లను పూజించినప్పుడు “యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను.” (న్యాయాధిపతులు 2:13, 14) అయితే, యెహోవా దేవుని వ్యక్తిత్వంలో కోపం ప్రధాన భాగం కాదు. ఆయన కోపం ఎప్పుడూ సరైనది, అది అదుపు చేసుకోగలిగేది.—నిర్గమకాండము 34:6; యెషయా 48:9.

 కోపం చూపించడం ఎప్పుడు తప్పు?

 అదుపులేకుండా లేదా సరైన కారణం లేకుండా కోపం చూపించడం తప్పు. అపరిపూర్ణ మనుషులు తరచూ అలా చేస్తారు. ఉదాహరణకు:

  •   దేవుడు తన అర్పణను తిరస్కరించినప్పుడు కయీనుకు “మిక్కిలి కోపం” వచ్చింది. కయీను తన తమ్ముణ్ణి చంపేంతగా కోపాన్ని పెంచుకున్నాడు.—ఆదికాండము 4:3-8.

  •   దేవుడు నీనెవె ప్రజల మీద కనికరం చూపించినప్పుడు యోనా ప్రవక్త కూడా ఎంతో ‘కోపగించుకున్నాడు.’ యోనా కోపగించుకోవడం న్యాయం కాదని చెప్తూ దేవుడు అతన్ని సరిదిద్దాడు. అంతేకాకుండా పశ్చాత్తాపపడిన ఆ పాపుల మీద దయ చూపించాలని అతనికి చెప్పాడు.—యోనా 3:10–4:1, 4, 11. a

 ఈ ఉదాహరణలు, అపరిపూర్ణ మనుషుల “కోపం దేవుడు కోరే నీతిని సాధించదు” అని స్పష్టంగా చూపిస్తున్నాయి.—యాకోబు 1:20.

 కోపాన్ని ఎలా అదుపు చేసుకోవచ్చు?

  •   అదుపులేని కోపం వల్ల వచ్చే ప్రమాదాల్ని పసిగట్టండి. కొంతమంది కోపం చూపించడమే బలమని అనుకుంటారు. నిజానికి కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం తీవ్రమైన బలహీనత. “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.” (సామెతలు 25:28; 29:11) ఇంకో మాటలో చెప్పాలంటే, కోపాన్ని అదుపుచేసుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటే మనకు నిజమైన బలం, వివేచన ఉందని చూపిస్తాం. (సామెతలు 14:29) బైబిలు ఇలా చెప్తోంది: “కోప్పడే విషయంలో నిదానించేవాడు బలశాలి కన్నా బలవంతుడు.”—సామెతలు 16:32, NW.

  •   పశ్చాత్తాపపడే పరిస్థితి రాకుండా, ముందే మీ కోపాన్ని అదుపుచేసుకోండి. “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము” అని కీర్తన 37:8 చెప్తుంది. మనకు కోపం వచ్చినప్పుడు ‘కీడు’ చేయకముందే దాన్ని తగ్గించుకోవడం మన చేతిలో పనని గమనించారా! ఎఫెసీయులు 4:26 చెప్తున్నట్లు, “మీకు కోపం వచ్చినా పాపం మాత్రం చేయకండి.”

  •   గొడవ పెద్దదౌతున్నప్పుడు వీలైతే అక్కడినుండి వెళ్లిపోండి. “కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము” అని బైబిలు చెప్తోంది. (సామెతలు 17:14) త్వరగా గొడవలు పరిష్కరించుకోవడం తెలివైన పనే అయినప్పటికీ, ప్రశాంతంగా మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకోవాలంటే, ముందు మీరిద్దరూ కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండాలి.

  •    వాస్తవాల్ని తెలుసుకోండి. “ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును” అని సామెతలు 19:11 చెప్తుంది. ఒక ముగింపుకు వచ్చేముందు వాస్తవాలన్నీ తెలుసుకోవడం తెలివైన పని. మనం జాగ్రత్తగా విని, విషయాన్ని అన్ని వైపుల నుండి చూసినప్పుడు, సరైన కారణం లేకుండా కోపం తెచ్చుకునే అవకాశం తక్కువ ఉంటుంది.—యాకోబు 1:19.

  •    మనశ్శాంతి కోసం ప్రార్థించండి. ప్రార్థన వల్ల మీరు “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి” పొందగలుగుతారు. (ఫిలిప్పీయులు 4:7) దేవుని పవిత్రశక్తి పొందడానికి ప్రార్థన ఒక ముఖ్యమైన మార్గం. అది మనలో శాంతి, సహనం, ఆత్మనిగ్రహం వంటి లక్షణాల్ని కలిగిస్తుంది.—లూకా 11:13; గలతీయులు 5:22, 23.

  •   స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. మనం ఎవరితో స్నేహం చేస్తామో వాళ్లలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) కాబట్టి మంచి కారణంతోనే బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము.” ఎందుకని? “నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.”—సామెతలు 22:24, 25.

a దేవుడిచ్చిన దిద్దుబాటును స్వకరించి, యోనా తన కోపాన్ని తీసేసుకొని ఉంటాడు. ఎందుకంటే బైబిల్లోని యోనా పుస్తకాన్ని రాయడానికి దేవుడు అతన్ని ఉపయోగించుకున్నాడు.