కంటెంట్‌కు వెళ్లు

బాప్తిస్మం అంటే ఏంటి?

బాప్తిస్మం అంటే ఏంటి?

బైబిలు ఇచ్చే జవాబు

 బాప్తిస్మం, నీళ్లలో పూర్తిగా మునిగి బయటికి రావడాన్ని సూచిస్తుంది. a యేసు కూడా ఒక నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. (మత్తయి 3:13, 16) అలాగే, ఒక ఇతియోపీయుడు “నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు” తనకు బాప్తిస్మం ఇవ్వమని అడిగాడు.—అపొస్తలుల కార్యములు 8:36-40.

బాప్తిస్మం అంటే ఏంటి?

 బైబిలు, బాప్తిస్మాన్ని పాతిపెట్టడంతో పోలుస్తుంది. (రోమీయులు 6:4; కొలొస్సయులు 2:12) నీటి బాప్తిస్మం, ఒక వ్యక్తి తన పాత ప్రవర్తన విషయంలో చనిపోయి, దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా కొత్త జీవితం మొదలుపెట్టడాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు బలిమీద విశ్వాసం ఉంచుతూ, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, దానికి తగిన అర్హతలు సంపాదించడం ద్వారా, మంచి మనస్సాక్షి పొందే అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. (1 పేతురు 3:21) అందుకే, తన శిష్యులవ్వాలనుకునే వాళ్లందరూ తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలని యేసు చెప్పాడు.—మత్తయి 28:19, 20.

నీటి బాప్తిస్మం మన పాపాల్ని కడిగేస్తుందా?

 లేదు. యేసు చిందించిన రక్తం మాత్రమే మన పాపాల్ని కడిగివేయగలదని బైబిలు చెప్తుంది. (రోమీయులు 5:8, 9; 1 యోహాను 1:7) అయితే, యేసు ఇచ్చిన బలి నుండి ప్రయోజనం పొందాలంటే, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయన బోధించినవాటి ప్రకారం మన జీవితంలో మార్పులు చేసుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి.—అపొస్తలుల కార్యములు 2:38; 3:19.

పసిపిల్లలకు బాప్తిస్మం ఇవ్వమని బైబిలు చెప్తుందా?

 లేదు. బైబిలు అలా చెప్పట్లేదు. కొన్ని చర్చీల్లో, పసిపిల్లలకు బాప్తిస్మం ఇచ్చి (నీళ్లు చిలకరించి లేదా తలపై నీళ్లు పోసి) పేరు పెడతారు. కానీ, ‘దేవుని రాజ్య సువార్తను’ అర్థం చేసుకొని, దానిమీద విశ్వాసం ఉంచగలిగేంత వయసున్నవాళ్లు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. (అపొస్తలుల కార్యములు 8:12) అంటే దేవుని వాక్యాన్ని విని, దాన్ని అంగీకరించి, పశ్చాత్తాపపడేవాళ్లే బాప్తిస్మం తీసుకోవాలి. పసిపిల్లలు వీటన్నిటినీ చేయలేరు కదా!—అపొస్తలుల కార్యములు 2:22, 38, 41.

 అంతేకాదు, క్రైస్తవ తల్లిదండ్రుల విశ్వాసాన్నిబట్టి, వాళ్ల పిల్లల్ని దేవుడు పరిశుద్ధులుగా లేదా పవిత్రులుగా ఎంచుతాడని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 7:14) ఒకవేళ పసిపిల్లల బాప్తిస్మాన్ని దేవుడు అంగీకరిస్తే, వాళ్ల తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా! b

క్రైస్తవ బాప్తిస్మం గురించిన అపోహలు

 అపోహ: నీళ్లలో పూర్తిగా మునగకుండా, నీళ్లు చిలకరించినా లేదా తలమీద పోసినా బాప్తిస్మం తీసుకున్నట్టే.

 నిజమేంటంటే: బైబిల్లో, బాప్తిస్మం తీసుకున్న వాళ్లందరూ నీళ్లలో పూర్తిగా మునిగే బాప్తిస్మం తీసుకున్నారు. ఉదాహరణకు, శిష్యుడైన ఫిలిప్పు ఇతియోపీయునికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు, వాళ్లిద్దరూ ‘నీళ్లలోకి దిగారు’. తర్వాత, ‘నీళ్లలోనుండి’ బయటికి వచ్చారు.—అపొస్తలుల కార్యములు 8:36-39. c

 అపోహ: ఫిలిప్పీలో ఉన్న ఒక చెరసాల అధికారి గురించి బైబిలు ఇలా చెప్తుంది: “అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.” అంటే బాప్తిస్మం తీసుకున్నవాళ్లలో ఆ ఇంట్లోని పసిపిల్లలు కూడా ఉన్నారని బైబిలు ఉద్దేశం.—అపొస్తలుల కార్యములు 16:31-34.

 నిజమేంటంటే: ఆ సందర్భంలో బాప్తిస్మం తీసుకున్న వాళ్లందరూ ‘దేవుని వాక్యాన్ని’ అర్థం చేసుకున్నారని, దాన్నిబట్టి చాలా ‘ఆనందించారని’ ఆ వృత్తాంతం చెప్తుంది. (అపొస్తలుల కార్యములు 16:32, 34) పసిపిల్లలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి, చెరసాల అధికారి ఇంట్లో బాప్తిస్మం తీసుకున్నవాళ్లలో పసిపిల్లలు లేరని చెప్పవచ్చు.

 అపోహ: యేసు చిన్నపిల్లల్ని చూసి, దేవుని రాజ్యం ఇలాంటివాళ్లదే అని చెప్పాడు. అంటే, పసిపిల్లలు కూడా బాప్తిస్మం తీసుకోవాలని యేసు చెప్తున్నాడు.—మత్తయి 19:13-15; మార్కు 10:13-16.

 నిజమేంటంటే: ఆ సందర్భంలో యేసు బాప్తిస్మం గురించి మాట్లాడట్లేదు. ఆయన వాళ్లను చూపించి, దేవుని రాజ్యంలో అర్హత సంపాదించాలంటే, చిన్నపిల్లల్లా వినయంగా ఉండాలని, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.—మత్తయి 18:4; లూకా 18:16, 17.

a “బాప్తిస్మం” అని అనువదించబడిన గ్రీకు పదానికి “ముంచడం” అని అర్థం. థియోలాజికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌, 1వ సంపుటి, 529వ పేజీ చూడండి.

b “కొత్త నిబంధనలో పసిపిల్లల బాప్తిస్మం గురించి ఎక్కడా లేదు” అని ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది. బాప్తిస్మం మన పాపాల్ని కడిగేస్తుందని “తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే” ఈ ఆచారం ప్రాచుర్యంలోకి వచ్చిందని కూడా అది చెప్తుంది.—1వ సంపుటి, 416-417 పేజీలు.

cన్యూ క్యాతలిక్‌ ఎన్‌సైక్లోపీడియాలో “బాప్తిస్మం (బైబిల్లో)” అనే శీర్షిక కింద ఇలా ఉంది: “మొదట్లో చర్చీవాళ్లు, నీళ్లలో పూర్తిగా ముంచే బాప్తిస్మం ఇచ్చేవాళ్లు.”—2వ సంపుటి, 59వ పేజీ.