కంటెంట్‌కు వెళ్లు

భూమి బల్లపరుపుగా ఉందని బైబిలు చెప్తుందా?

భూమి బల్లపరుపుగా ఉందని బైబిలు చెప్తుందా?

బైబిలు ఇచ్చే జవాబు

లేదు, భూమి బల్లపరుపుగా ఉందని బైబిలు చెప్పట్లేదు. * బైబిలు సైన్సు పుస్తకమేమీ కాకపోయినా, సైన్సు నిజమని నిరూపించిన విషయాలతో అది ఏకీభవిస్తుంది. బైబిలు చెప్పేవి “ఇప్పుడూ, ఎప్పుడూ ... ఆధారపడదగినవి.”—కీర్తన 111:8, NW.

 “భూమి ... నాలుగు దిగంతములు” అనడంలో బైబిలు ఉద్దేశమేంటి?

భూమి చతురస్రాకారంలో ఉండడం వల్లే లేదా భూమికి అంచులు ఉండడం వల్లే బైబిలు “నాలుగు దిగంతములు,” “భూమ్యంతము” అనే పదాలను ఉపయోగించిందని అనుకోకూడదు. వీటిని అక్షరార్థంగా తీసుకోకూడదు. (యెషయా 11:12; యోబు 37:3) బదులుగా భూమంతటిని సూచించడానికి ఈ పదాలను అలంకారిక భావంలో ఉపయోగించారు. ఆ భావంలోనే బైబిలు ‘తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం’ అనే నాలుగు దిక్కులను ప్రస్తావించింది.—లూకా 13:29.

“దిగంతములు” లేదా “భూమ్యంతము” అని అనువదించబడిన హీబ్రూ పదం, “రెక్కలు” కోసం ఉపయోగించే పదం మీద ఆధారపడిన ఒక జాతీయం కావచ్చు. “పక్షి తన రెక్కలతో పిల్లల్ని కప్పి ఉంచుతుంది. కాబట్టి [ఈ హీబ్రూ పదం] ఏదైనా చాచబడిన దాని అంచుల్ని సూచిస్తుంది” అని ద ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా చెప్తుంది. యోబు 37:3, యెషయా 11:12లో “ఆ పదానికి తీరాలు, సరిహద్దులు లేదా భూమి అంచులు అనే అర్థాలు ఉన్నాయి” * అని కూడా అది చెప్తుంది.

 అపవాది యేసును శోధించిన సందర్భం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

యేసును శోధించడానికి “అపవాది ఆయన్ని చాలా ఎత్తైన ఒక కొండ మీదికి తీసుకెళ్లి, లోకంలోని రాజ్యాలన్నిటినీ వాటి మహిమనూ ఆయనకు” చూపించాడు. (మత్తయి 4:8) ఈ వృత్తాంతాన్ని బట్టి, ఒక చోటు నుండి లోకమంతా కనిపిస్తుందంటే భూమి బల్లపరుపుగా ఉన్నట్టు బైబిలు బోధిస్తుందని కొందరు వాదిస్తారు. అయితే, ఈ వృత్తాంతంలో ఉన్న “చాలా ఎత్తైన ఒక కొండ” నిజమైన చోటు కాకపోవచ్చు. ఈ ముగింపు ఎందుకు సరైనదో కారణాల్ని గమనించండి.

  • లోకరాజ్యాలన్నీ కనిపించే నిజమైన పర్వతమేదీ భూమ్మీద లేదు.

  • అపవాది యేసుకు లోకరాజ్యాలనే కాదు “వాటి మహిమను” కూడా చూపించాడు. అలాంటి వివరాలను చాలా దూరం నుండి చూసే అవకాశం లేదు. కాబట్టి అపవాది ఒకలాంటి దర్శనాన్ని ఉపయోగించి యేసుకు అవన్నీ చూపించివుంటాడు. ఇది ఒక వ్యక్తి ప్రొజెక్టర్‌, స్క్రీన్‌ ఉపయోగించి ఆయా స్థలాలను చూపించడం వంటిది కావచ్చు.

  • ఇదే వృత్తాంతం గురించి లూకా 4:5 ఇలా చెప్తుంది; అపవాది యేసుకు “భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క క్షణంలో” చూపించాడు. మనుషులు అలా చూడలేరు. కాబట్టి అపవాది యేసుకు వేరేరకంగా వాటిని చూపించి శోధించి ఉంటాడు.

^ పేరా 3 దేవుడు “భూమండలముమీద ఆసీనుడై యున్నాడు” అని బైబిలు చెప్తుంది. (యెషయా 40:22) ఇక్కడ “మండలం” అని అనువదించిన పదానికి గోళము అనే అర్థం కూడా ఉండవచ్చని కొన్ని పుస్తకాలు చెప్తున్నాయి. అయితే ఈ విషయంలో విద్వాంసులకు వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ భూమి బల్లపరుపుగా ఉందనే విషయాన్ని బైబిలు సమర్థించట్లేదు.

^ పేరా 8 రివైజ్డ్‌ ఎడిషన్‌, 2వ సంపుటి, 4వ పేజీ.