కంటెంట్‌కు వెళ్లు

ప్రధానదూతైన మిఖాయేలు ఎవరు?

ప్రధానదూతైన మిఖాయేలు ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

మిఖాయేలు లేదా కొన్ని మతాలు ప్రస్తావించే “సెయింట్‌ మిఖాయేలు” అనేది యేసుకు ఉన్న మరో పేరు అని చెప్పవచ్చు. మనిషిగా భూమ్మీద పుట్టకముందు అలాగే పునరుత్థానం చేయబడి పరలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత యేసుకు ఇవ్వబడిన పేరు మిఖాయేలు అని చెప్పడానికి సరైన రుజువులు ఉన్నాయి. * మోషే చనిపోయి తర్వాత అతని శరీరం గురించి సాతానుతో మిఖాయేలు వాదించాడు. అంతేకాదు దేవుని సందేశాన్ని దానియేలు ప్రవక్తకు చేరవేయడానికి ఒక దేవదూతకు సహాయం చేశాడు. (దానియేలు 10:13, 21; యూదా 9) మిఖాయేలు అనే పేరుకు “దేవుని వంటివాడు ఎవడు?” అని అర్థం. యేసు దేవుని పరిపాలనను సమర్థిస్తున్నాడు, దేవుని శత్రువులతో పోరాడుతున్నాడు కాబట్టి ఆయనకు మిఖాయేలు అనే పేరు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.—దానియేలు 12:1; ప్రకటన 12:7.

ప్రధానదూత అయిన మిఖాయేలు యేసేనని చెప్పడానికిగల కారణాల్ని పరిశీలించండి.

  • మిఖాయేలు “ప్రధానదూత.” (యూదా 9) “ప్రధానదూత” అంటే “దేవదూతల్లో ముఖ్యుడు” అని అర్థం. అయితే “ప్రధానదూత” అనే మాట బైబిల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే కనిపిస్తుంది. అంతేకాదు ఆ రెండు చోట్ల ఆ మాటను ఏకవచనంలో మాత్రమే ఉపయోగించారనే వాస్తవాన్ని గమనిస్తే కేవలం ఒక్క దూతకు మాత్రమే ప్రధానదూత అనే బిరుదు ఉందని అర్థమౌతోంది. ఒక వచనంలో, పునరుత్థానమైన యేసు ప్రభువు ‘అధికారం ఉట్టిపడే స్వరంతో, ప్రధానదూత స్వరంతో పరలోకం నుండి దిగివస్తాడని’ ఉంది. (1 థెస్సలొనీకయులు 4:16) యేసే ప్రధానదూత అయిన మిఖాయేలు కాబట్టి ఆయనకు “ప్రధానదూత స్వరం” ఉంది.

  • దూతల సైన్యాన్ని మిఖాయేలు నడిపిస్తాడు. “మిఖాయేలు, ఆయన దూతలు మహాసర్పంతో” అంటే సాతానుతో యుద్ధంచేశారు. (ప్రకటన 12:7) ఆత్మప్రాణులందరిలో మిఖాయేలుకు ఎక్కువ అధికారం ఉంది. అందుకే ఆయనకు ‘ప్రధానాధిపతుడు,’ “మహా అధిపతియగు మిఖాయేలు” అనే బిరుదులు ఉన్నాయి. (దానియేలు 10:13, 21; 12:1) ఈ బిరుదులన్నిటిని బట్టి మిఖాయేలు “దూతల సైన్యాలకు ప్రధానాధిపతి” అని చెప్పవచ్చని కొత్త నిబంధన నిపుణుడైన డేవిడ్‌ ఇ. ఆన్‌ చెప్పాడు.

    దూతల సైన్యాలపై అధికారం ఉన్న మరో వ్యక్తి గురించి కూడా బైబిలు మాట్లాడుతుంది. ‘మండుతున్న అగ్నిలో యేసు ప్రభువు శక్తిమంతులైన తన దేవదూతలతో కలిసి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన పగ తీర్చుకుంటాడు.’ (2 థెస్సలొనీకయులు 1:7, 8; మత్తయి 16:27) అంతేకాదు యేసు ‘పరలోకానికి వెళ్లాడు. దేవదూతలు, అధికారాలు ఆయనకు లోబడివుండేలా దేవుడు చేశాడు’ అని కూడా బైబిలు చెప్తుంది. (1 పేతురు 3:21, 22) దేవదూతలపై ప్రధానాధిపతిగా ఉండేందుకు దేవుడు ఇద్దరు వ్యక్తులను అంటే యేసును, మిఖాయేలు ఎందుకు నియమిస్తాడు? అలా నియమించడంలో అర్థం ఉండదు. బదులుగా యేసు, మిఖాయేలు అనే పేర్లు ఒకే వ్యక్తికి ఉన్నాయని చెప్పడం సబబుగా ఉంటుంది.

  • అనుకోని “ఆపద” వచ్చినప్పుడు మిఖాయేలు చర్య తీసుకుంటాడు. (దానియేలు 12:1) హీబ్రూ భాషలోని దానియేలు పుస్తకంలో, ప్రత్యేకమైన చర్య తీసుకునే రాజు వస్తాడని చెప్పడానికి “నిలుచునట్టి” అనే మాటను తరచుగా ఉపయోగించారు. (దానియేలు 11:2-4, 21) “దేవుని వాక్యం” అనే పేరున్న యేసుక్రీస్తు, ‘రాజులకు రాజుగా’ దేవుని శత్రువులందర్నీ నాశనం చేసి దేవుని ప్రజల్ని కాపాడడానికి ప్రత్యేక చర్య తీసుకుంటాడు. (ప్రకటన 19:11-16) ఆయన ఆ చర్యను “మహాశ్రమ” వచ్చినప్పుడు తీసుకుంటాడు. బైబిలు మహాశ్రమను వర్ణిస్తూ, “లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలాంటి శ్రమ రాలేదు” అని చెప్తోంది.—మత్తయి 24:21, 42.

^ పేరా 3 వేర్వేరు పేర్లున్న ఇతర వ్యక్తుల గురించి కూడా బైబిల్లో ఉంది. ఉదాహరణకు యాకోబు (ఇతనికి ఇశ్రాయేలు అనే మరోపేరు ఉంది), పేతురు (ఇతనికి సీమోను అనే మరోపేరు ఉంది), తద్దయి (ఇతనికి యూదా అనే మరోపేరు ఉంది).—ఆదికాండము 49:1, 2; మత్తయి 10:2, 3; మార్కు 3:18; అపొస్తలుల కార్యములు 1:13.