కంటెంట్‌కు వెళ్లు

ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 నేడు వస్తున్న ప్రకృతి విపత్తులకు కారణం దేవుడు కాదు. కానీ వాటివల్ల బాధపడేవాళ్ల గురించి ఆయనకు శ్రద్ధ ఉంది. దేవుని రాజ్యం మనుషుల బాధలకు కారణమైన వాటన్నిటిని తీసేసినప్పుడు ప్రకృతి విపత్తులను కూడా తీసేస్తుంది. అప్పటివరకు ప్రకృతి విపత్తుల వల్ల బాధపడుతున్న వాళ్లకు దేవుడు ఓదార్పు కలుగచేస్తాడు.—2 కొరింథీయులు 1:3.

 ప్రకృతి విపత్తులు దేవుని నుండి వచ్చే శిక్ష కాదని మనం ఎందుకు చెప్పవచ్చు?

 దేవుడు బైబిల్లో ప్రకృతి శక్తులను ఉపయోగించిన విధానానికి, ఇప్పుడు వస్తున్న ప్రకృతి విపత్తులకు తేడా ఉంది.

  •   ప్రకృతి విపత్తుల వల్ల ఎవరైనా చనిపోతారు, నష్టపోతారు. దానికి భిన్నంగా దేవుడు తీర్పు తీర్చడానికి ప్రకృతి శక్తులను ఉపయోగించినప్పుడు చెడ్డవాళ్లను మాత్రమే శిక్షించాడు. ఉదాహరణకు దేవుడు ప్రాచీన పట్టణాలైన సొదొమ గొమొర్రాలను నాశనం చేసినప్పుడు, ఆయన మంచివాడైన లోతును అతని కూతుర్లను కాపాడాడు. (ఆదికాండము 19:29, 30) దేవుడు అప్పుడున్నవాళ్ల హృదయాలను చూసి చెడ్డవాళ్లుగా తీర్పుతీర్చిన వాళ్లను మాత్రమే నాశనం చేశాడు.—ఆదికాండము 18:23-32; 1 సమూయేలు 16:7.

  •   ప్రకృతి విపత్తులు చాలా తక్కువ హెచ్చరికతో లేదా అసలు ఏ హెచ్చరిక లేకుండా వస్తాయి. కానీ దేవుడు మాత్రం దుష్టుల మీదికి ప్రకృతి శక్తులు తీసుకురావాలని అనుకున్నప్పుడు వాళ్లకు ముందుగానే హెచ్చరికలు ఇచ్చాడు. హెచ్చరికను విన్నవాళ్లు ఆ విపత్తు నుండి తప్పించుకోగలిగారు.—ఆదికాండము 7:1-5; మత్తయి 24:38, 39.

  •   కొంతవరకు ప్రకృతి విపత్తులకు కారణం మనుషులే. ఎలా? భూమిని పాడుచేయడం ద్వారా, భూకంపాలు, వరదలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించడం ద్వారా ఇది జరుగుతుంది. (ప్రకటన 11:18) మనుషులు తీసుకున్న అలాంటి నిర్ణయాలకు దేవున్ని నిందించలేం.—సామెతలు 19:2, 3.

 ప్రకృతి విపత్తులు చివరి రోజులకు గుర్తులా?

 అవును, ఈ వ్యవస్థ ముగింపులో, చివరి రోజుల్లో విపత్తులు వస్తాయని బైబిలు ప్రవచనాలు చెప్తున్నాయి. (మత్తయి 24:3; 2 తిమోతి 3:1) ఉదాహరణకు, మన కాలం గురించి యేసు, “ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి” అని చెప్పాడు. (మత్తయి 24:7) త్వరలో దేవుడు ప్రకృతి విపత్తులతో పాటు భూమి మీద నుండి బాధలు, కష్టాలు కలిగించే వాటన్నిటినీ తీసేస్తాడు.—ప్రకటన 21:3, 4.

 ప్రకృతి విపత్తుల వల్ల బాధపడేవాళ్లకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు?

  •   దేవుడు బాధితుల్ని తన వాక్యమైన బైబిలు ద్వారా ఓదారుస్తాడు. దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడని, మన గురించి బాధపడతాడని బైబిలు చెప్తుంది. (యెషయా 63:9; 1 పేతురు 5:6, 7) ప్రకృతి విపత్తులు ఉండని కాలం గురించి కూడా బైబిలు చెప్తుంది.—“ ప్రకృతి విపత్తుల వల్ల బాధపడుతున్న వాళ్లను ఓదార్చే బైబిలు వచనాలు” చూడండి.

  •   తన ఆరాధకుల ద్వారా దేవుడు బాధితులకు సహాయం చేస్తాడు. యేసు చూపించిన మాదిరిని అనుకరించేలా దేవుడు భూమి మీదున్న తన ఆరాధకులను ఉపయోగిస్తాడు. “నలిగిన హృదయముగలవారిని,” “దుఃఖాక్రాంతులందరిని” యేసు ఓదారుస్తాడని ప్రవచించబడింది. (యెషయా 61:1, 2) దేవుని ఆరాధకులు కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తారు.—యోహాను 13:15.

     అంతేకాదు ప్రకృతి విపత్తులకు గురైనవాళ్లకు కావాల్సిన సహాయాన్ని అందించడానికి దేవుడు తన భక్తులను ఉపయోగిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 11:28-30; గలతీయులు 6:10.

ప్యూర్టోరికోలో తుఫానుకు గురైన వాళ్లందరికీ కావాల్సిన సహాయాన్ని అందిస్తున్న యెహోవాసాక్షులు

 ప్రకృతి విపత్తులకు సిద్ధపడి ఉండడానికి బైబిలు సహాయం చేస్తుందా?

 సహాయం చేస్తుంది. బైబిలు, ప్రకృతి విపత్తులకు ముందుగా సిద్ధపడడానికి సూచనలు ఉన్న పుస్తకం కాదు, కానీ సహాయపడే కొన్ని సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఉదాహరణకు:

  •   విపత్తులు వచ్చేముందే వాటికి సిద్ధపడి ఉండండి. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 22:3) అత్యవసర సమయంలో ఏమి చేయాలి అని ముందుగానే ఆలోచించడం లేదా ప్రణాళిక వేసుకోవడం తెలివైన పని. ఒక ఎమర్జెన్సీ కిట్‌ను పెట్టుకోవాలి, అంటే అత్యవసర పరిస్థితుల్లో కావాల్సిన వస్తువులను మనతో తీసుకెళ్లడానికి వీలుగా ఒక బ్యాగులో సర్దిపెట్టుకోవాలి. తర్వాత విపత్తు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులంతా ఎక్కడ కలుసుకోవాలి ఏమి చేయాలి అనేది ముందుగానే ఒకసారి చేసి చూడడం లేదా చెప్పుకుని ఉండడం లాంటివన్నీ ఆ ప్రణాళికలో భాగమే.

  •   వస్తువులు, ఆస్తులకన్నా ప్రాణానికి ఎక్కువ విలువ ఇవ్వండి. బైబిలు ఇలా చెప్తుంది: “మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం.” (1 తిమోతి 6:7, 8) విపత్తు నుండి తప్పించుకోవడానికి మనం మన ఇంటిని, వస్తువుల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. వస్తువులు, ఆస్తులకన్నా ప్రాణం చాలా ముఖ్యమైనదనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.—మత్తయి 6:25.