కంటెంట్‌కు వెళ్లు

ప్రకటన 13వ అధ్యాయంలోని ఏడు తలల క్రూరమృగం ఎవరు?

ప్రకటన 13వ అధ్యాయంలోని ఏడు తలల క్రూరమృగం ఎవరు?

బైబిలు ఇచ్చే జవాబు

ప్రకటన 13:1లో ఉన్న ఆ ఏడు తలల క్రూరమృగం ప్రపంచవ్యాప్త రాజకీయ వ్యవస్థను సూచిస్తోంది.

  • దానికి అధికారం, బలం, సింహాసనం ఉన్నాయి. అంటే అది రాజకీయ సంబంధమైనదని అర్థమవుతోంది.—ప్రకటన 13:2.

  • “ప్రతి వంశముమీదను ప్రతి ప్రజమీదను ఆ యా భాషలు మాటలాడువారిమీదను ప్రతిజనము మీదను” దానికి అధికారం ఉంది, కాబట్టి అది ఒక దేశ ప్రభుత్వం కంటే గొప్పది.—ప్రకటన 13:7.

  • దానియేలు 7:2-8లోని ప్రవచనంలో వర్ణించబడిన నాలుగు క్రూరమృగాల లక్షణాలు దీనిలో కనబడుతున్నాయి. వాటిలో కొన్ని, చిరుతపులి ఆకారం, ఎలుగుబంటి పాదాలు, సింహం నోరు, పది కొమ్ములు. దానియేలు ప్రవచనంలోని ఒక్కొక్క మృగం ఒక్కొక్క రాజును లేదా రాజ్యాన్ని సూచిస్తున్నాయి, అవి ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే సామ్రాజ్యాలు. (దానియేలు 7:17, 23) ఆ విధంగా, ప్రకటన 13వ అధ్యాయంలోని క్రూరమృగం సంయుక్త రాజకీయ సంస్థను సూచిస్తోంది.

  • అది “సముద్రములో నుండి” పైకి వచ్చింది. సముద్రం మానవ ప్రభుత్వాలకు మూలమైన అల్లకల్లోల మానవజాతిని సూచిస్తుంది.—ప్రకటన 13:1; యెషయా 17:12, 13.

  • ఆ మృగానికున్న పేరు లేదా దాని సంఖ్య 666 అని, అది “మనుష్యుని సంఖ్య” అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 13:17, 18) ఆ మాటను బట్టి, ప్రకటన 13వ అధ్యాయంలోని మృగం మనుష్యులకు సంబంధించిందేనని, ఆత్మలకుగానీ దయ్యాలకుగానీ సంబంధించింది కాదని అర్థమౌతుంది.

చాలా విషయాల్లో దేశాలన్నీ ఏకాభిప్రాయానికి రాకపోయినా, దేవుని రాజ్య పరిపాలనకు లోబడకుండా తామే అధికారంలో ఉండాలనుకునే విషయంలో మాత్రం అవన్నీ ఒక్కమాట మీద ఉంటాయి. (కీర్తన 2:2) హార్‌మెగిద్దోనులో ఆ దేశాలు కొన్ని శక్తులతో కలిసి, యేసుక్రీస్తు నడిపించే దేవుని సైన్యంతో యుద్ధానికి తలపడతాయి. కానీ ఆ యుద్ధంలో దేశాలు నాశనం అవుతాయి.—ప్రకటన 16:14-16; 19:19, 20.

‘పది కొమ్ములు, ఏడు తలలు’

బైబిల్లో కొన్ని సంఖ్యలను గుర్తులుగా వాడారు. ఉదాహరణకు, పది, ఏడు అంకెలు సంపూర్ణతను సూచిస్తున్నాయి. ప్రకటన 13వ అధ్యాయంలోని మృగానికి ఉన్న ‘పది కొమ్ములు, ఏడు తలలు’ గురించి అర్థంచేసుకోవడానికి ‘క్రూరమృగము యొక్క ప్రతిమ’ ఉపయోగపడుతుంది. ప్రకటనలో తర్వాతి అధ్యాయాల్లో కనిపించే ఆ ప్రతిమ, ఏడు తలలు, పది కొమ్ములు ఉన్న ఎర్రని మృగం. (ప్రకటన 13:1, 14, 15; 17:3) ఈ ఎర్రని మృగానికున్న ఏడు తలలు “ఏడుగురు రాజులు” లేదా ఏడు ప్రభుత్వాలు అని బైబిలు చెప్తుంది.—ప్రకటన 17:9, 10.

అదేవిధంగా, ప్రకటన 13:1లోని మృగానికున్న ఏడుతలలు ఏడు ప్రభుత్వాలను సూచిస్తున్నాయి. మానవ చరిత్రలో ప్రపంచం మీద అధికారం చెలాయించిన ముఖ్య రాజకీయ శక్తులే ఆ ప్రభుత్వాలు. దేవుని ప్రజల్ని అణగద్రొక్కడంలో అవి ముఖ్య పాత్ర పోషించాయి. ఆ ప్రభుత్వాలు ఏవంటే, ఐగుప్తు, అష్షూరు, బబులోను, మాదీయ-పారసీక, గ్రీసు, రోము, ఆంగ్లో-అమెరికా. ఇక పది కొమ్ములు, చిన్న-పెద్ద సార్వభౌమ రాజ్యాలన్నిటిని సూచిస్తున్నాయి. ఆ కొమ్ముల మీద కిరీటాలు ఉన్నాయి, అంటే తమ కాలంలో అధికారం చెలాయిస్తోన్న రాజకీయ శక్తితోపాటు ఆ రాజ్యాలు కూడా పరిపాలన చేస్తాయని అర్థమవుతుంది.