కంటెంట్‌కు వెళ్లు

పొగతాగడం తప్పా?

పొగతాగడం తప్పా?

బైబిలు ఇచ్చే జవాబు

 పొగతాగడం a లేదా ఇతర విధానాల్లో పొగాకును ఉపయోగించడం గురించి బైబిలు ఏమి చెప్పట్లేదు. అయితే ఆరోగ్యాన్ని పాడుచేసే అపరిశుభ్రమైన అలవాట్లను దేవుడు ఏ మాత్రం ఇష్టపడడని తెలిపే కొన్ని సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే పొగతాగడం తప్పే అని అర్థమౌతుంది.

  •   జీవాన్ని గౌరవించండి. “దేవుడు . . . అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు.” (అపొస్తలుల కార్యాలు 17:24, 25) జీవం దేవుడిచ్చిన బహుమానం, కాబట్టి మన ఆయుష్షును తగ్గించే పొగతాగడం లాంటి అన్నీ అలవాట్లకు మనం దూరంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది చనిపోవడానికి ఒక ముఖ్య కారణం పొగతాగడమే, ఒకవేళ పొగతాగకపోతే వాళ్లు ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు.

  •   సాటిమనిషిని ప్రేమించండి. “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.” (మత్తయి 22:39) ప్రజలు ఉండే చోట పొగతాగితే వాళ్లను ప్రేమించినట్లు కాదు. పొగతాగడం వల్ల కొన్ని రకాల జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు, పొగతాగే వాళ్లకన్నా వాళ్ల దగ్గర్లో ఉండి తరచూ దాన్ని పీల్చే వాళ్లకే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

  •   పవిత్రంగా ఉండండి. “మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అర్పించుకోండి.” (రోమీయులు 12:1) “మన శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.” (2 కొరింథీయులు 7:1) పొగతాగడం అంటే పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండడానికి పూర్తి విరుద్ధమైన పని. ఎందుకంటే పొగాకును ఉపయోగించేవాళ్లు ఉద్దేశపూర్వకంగా శరీరానికి హాని కలిగించే విష పదార్థాలను తీసుకుంటారు.

ఉల్లాసంగా ఉండడం కోసం గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను ఉపయోగించే విషయంలో బైబిలు ఏమైనా చెప్తుందా?

 బైబిల్లో, గంజాయి (వీడ్‌, పాట్‌ అని కూడా పిలుస్తారు) లేదా అలాంటి మత్తుపదార్థాల పేర్ల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కానీ మనల్ని బానిసలుగా చేసుకునే అలాంటి పదార్థాలను ఉల్లాసంగా ఉండడం కోసం తీసుకోకూడదని చెప్పే సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఈ కింది సూత్రాలతోపాటు పైన చర్చించిన సూత్రాలు కూడా దీనికి వర్తిస్తాయి:

  •   మన మానసిక సామర్థ్యాలను అదుపులో ఉంచుకోవాలి. “నువ్వు నీ దేవుడైన యెహోవాను . . . నీ నిండు మనసుతో ప్రేమించాలి.” (మత్తయి 22:37, 38) “మీ ఆలోచనా సామర్థ్యాల్ని పూర్తిగా ఉపయోగించండి.” (1 పేతురు 1:13) ఒక వ్యక్తి మత్తు పదార్థాన్ని తీసుకున్నప్పుడు తన మనసును పూర్తిగా అదుపులో ఉంచుకోలేడు. వాటిని తీసుకునే చాలామంది వాటికి బానిసలైపోతారు. వాళ్ల మనసంతా మంచి విషయాల మీద కాకుండా మత్తు పదార్థాలను కొనడం, వాటిని ఉపయోగించడం మీదే ఎప్పుడూ ఉంటుంది.—ఫిలిప్పీయులు 4:8.

  •   ప్రభుత్వ చట్టాలకు లోబడండి. ‘ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడి ఉండండి.’ (తీతు 3:1) చాలా దేశాల్లో కొన్నిరకాల మత్తు పదార్థాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం. మనం దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలకు లోబడాలి.—రోమీయులు 13:1.

a ఇక్కడ పొగతాగడం అంటే సిగరెట్టు, బీడీలు, చుట్టలు, గొట్టాలు ద్వారా పొగాకును ఇష్టపూర్వకంగా పీల్చడం. ఇప్పుడు చర్చించబోయే సూత్రాలు పొగాకు నమలడం, ముక్కుపొడి పీల్చడం, నికొటీన్‌ ఉండే ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు తాగడం అలాంటి మరితర వాటికి కూడా వర్తిస్తాయి.