కంటెంట్‌కు వెళ్లు

పునరుత్థానం అంటే ఏమిటి?

పునరుత్థానం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిల్లో “పునరుత్థానం” అని అనువదించిన పదం ఆనస్టాశీస్‌ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ పదానికి “లేవడం” లేదా “మళ్లీ నుంచోవడం” అనే అర్థాలున్నాయి. పునరుత్థానమైన ఓ వ్యక్తి మరణం నుండి బ్రతికి, ఇంతకుముందులాగే మళ్లీ జీవిస్తాడు.—1 కొరింథీయులు 15:12, 13.

 “పునరుత్థానం” అనే మాట, మనం తరచూ పాత నిబంధన అని పిలిచే హీబ్రూ లేఖనాల్లో లేకపోయినా అలాంటి బోధ అక్కడ కనబడుతుంది. ఉదాహరణకు హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ఇలా వాగ్దానం చేశాడు “పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును.”—హోషేయ 13:14; యోబు 14:13-15; యెషయా 26:19; దానియేలు 12:2, 13.

 ప్రజలు ఎక్కడికి పునరుత్థానం అవుతారు? కొంతమంది క్రీస్తుతోపాటు రాజులుగా పరిపాలించేందుకు పరలోకానికి పునరుత్థానం అవుతారు. (2 కొరింథీయులు 5:1; ప్రకటన 5:9, 10) బైబిలు దీన్ని “మొదటి పునరుత్థానం”, “తొలి పునరుత్థానం” అని పిలుస్తుంది. ఈ రెండు మాటలు దీని తర్వాత మరో పునరుత్థానం కూడా ఉందని సూచిస్తున్నాయి. (ప్రకటన 20:6; ఫిలిప్పీయులు 3:10, 11) ఈ తర్వాత చెప్పిన పునరుత్థానం ద్వారా బ్రతికిన చాలామంది ప్రజలు భూమ్మీదే సంతోషంగా జీవిస్తారు.—కీర్తన 37:29.

 ఎలా పునరుత్థానం అవుతారు? చనిపోయిన వాళ్లను బ్రతికించే శక్తిని దేవుడే యేసుకు ఇస్తాడు. (యోహాను 11:25) యేసు “సమాధులలో” ఉన్న వాళ్లందరినీ వాళ్ల సొంత గుర్తింపుతో, వాళ్లకున్న వ్యక్తిత్వంతో, ఇదివరకటి జ్ఞాపకాలతో మళ్లీ బ్రతికిస్తాడు. (యోహాను 5:28, 29) పరలోకానికి వెళ్లేవాళ్లు ఆత్మగా పునరుత్థానమైతే, భూమ్మీద జీవించడానికి పునరుత్థానం అయ్యేవాళ్లు పూర్తి ఆరోగ్యవంతమైన శరీరంతో లేస్తారు.—యెషయా 33:24; 35:5, 6; 1 కొరింథీయులు 15:42-44, 50.

 ఎవరు పునరుత్థానం అవుతారు? “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని” బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యములు 24:14, 15) నోవహు, శారా, అబ్రహాము లాంటి మంచి విశ్వాసంగల ప్రజలు ఆ నీతిమంతుల్లో ఉంటారు. (ఆదికాండము 6:9; హెబ్రీయులు 11:11; యాకోబు 2:21) దేవుని ప్రమాణాలకు తగ్గట్టు జీవించకపోయినా, వాటి గురించి తెలుసుకొని వాటిని పాటించే అవకాశం దొరకకుండానే చనిపోయినవాళ్లు అనీతిమంతులుగా పునరుత్థానం అవుతారు.

 ఇక ఎప్పటికీ మారడానికి ఇష్టపడని చెడ్డవాళ్ల పరిస్థితి ఏమిటి? వాళ్లు పునరుత్థానం అవ్వరు. అలాంటివాళ్లు చనిపోయినప్పుడు, మళ్లీ బ్రతుకుతారని ఆశించే అవకాశం లేకుండా పూర్తిగా నాశనమౌతారు.—మత్తయి 23:33; హెబ్రీయులు 10:26, 27.

 పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? పరలోకానికి వెళ్లే ప్రజలు క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో పునరుత్థానం అవుతారని బైబిలు ముందే చెప్పింది. ఆ ప్రత్యక్షతా కాలం 1914లో మొదలైంది. (1 కొరింథీయులు 15:21-23) ఇక భూమ్మీద జీవించే ప్రజలు యేసుక్రీస్తు వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో పునరుత్థానం అవుతారు. అప్పుడే భూమంతా పరదైసుగా మారుతుంది.—లూకా 23:43; ప్రకటన 20:6, 12, 13.

 పునరుత్థానాన్ని నమ్మడం ఎందుకు సరైనది? తొమ్మిది పునరుత్థానాల గురించి బైబిలు చక్కగా వివరిస్తుంది. వీటిని కళ్లారా చూసిన సాక్షులు ఆ విషయాన్ని ధృవీకరించారు. (1 రాజులు 17:17-24; 2 రాజులు 4:32-37; 13:20, 21; లూకా 7:11-17; 8:40-56; యోహాను 11:38-44; అపొస్తలుల కార్యములు 9:36-42; అపొస్తలుల కార్యములు 20:7-12; 1 కొరింథీయులు 15:3-6) వీటిలో ప్రత్యేకంగా గమనించాల్సింది యేసు లాజరును పునరుత్థానం చేయడం. ఎందుకంటే లాజరు చనిపోయి అప్పటికే నాలుగు రోజులైంది. దానికితోడు యేసు ఆ అద్భుతాన్ని చాలామంది చూస్తుండగా చేశాడు. (యోహాను 11:39, 42) ఆఖరికి యేసును వ్యతిరేకించేవాళ్లు కూడా ఈ సంఘటనకు సంబంధించిన వాస్తవాలను కాదనలేకపోయారు. అందుకే వాళ్లు యేసును, లాజరును చంపాలని ఆలోచించారు.—యోహాను 11:47, 53; 12:9-11.

 దేవునికి చనిపోయిన వాళ్లను బ్రతికించే సామర్థ్యం, అలా బ్రతికించాలనే కోరిక రెండూ ఉన్నాయని బైబిలు చూపిస్తుంది. తన సర్వోన్నత శక్తితో పునరుత్థానం చేసే వాళ్లందరికీ సంబంధించిన ప్రతీ విషయం ఆయన తన అంతులేని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. (యోబు 37:23; మత్తయి 10:30; లూకా 20:37, 38) చనిపోయినవాళ్లను దేవుడు మళ్లీ బ్రతికించగలడు, అలా చేయాలనుకుంటున్నాడు కూడా! భవిష్యత్తులో జరగబోయే ఈ పునరుత్థానం గురించి బైబిలు ఇలా చెప్తుంది: “నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.”—యోబు 14:15.

పునరుత్థానానికి సంబంధించిన తప్పుడు అభిప్రాయాలు

 అపోహ: పునరుత్థానం అంటే ఆత్మను మళ్లీ శరీరంతో కలపడం.

 నిజం: ఆత్మ అంటే ఒక వ్యక్తి. అంతేగానీ చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండే మనిషిలోని ఒక భాగం కాదని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 2:7, అధస్సూచి; యెహెజ్కేలు 18:4) పునరుత్థానమైనప్పుడు ఒక వ్యక్తిని అతని ఆత్మతో కలపడం లాంటిదేమీ ఉండదు. దేవుడు అతన్ని ఒక జీవించే ఆత్మగా (శరీరం ఉన్న మనిషిగా) మళ్లీ తయారుచేస్తాడు.

 అపోహ: కొంతమందిని బ్రతికించి మళ్లీ వెంటనే నాశనం చేసేస్తాడు.

 నిజం: “కీడు” చేసినవారికి తీర్పు “పునరుత్థానము” ఉంటుందని బైబిలు చెప్తుంది. (యోహాను 5:29) అయితే, చనిపోకముందు చేసిన పనులు బట్టి కాదుగానీ, పునరుత్థానం అయిన తర్వాత చేసే పనులు బట్టి వాళ్లు తీర్పు పొందుతారు. యేసు ఇలా చెప్పాడు, ‘మృతులు దేవుని కుమారుని శబ్దము వినును; దానిని వినువారు జీవింతురు’. (యోహాను 5:25) అలా పునరుత్థానమైన తర్వాత వాళ్లు నేర్చుకునే విషయాల మీద ఎవరైతే శ్రద్ధపెట్టి, వాటి ప్రకారం జీవిస్తారో వాళ్ల పేర్లు ‘జీవగ్రంథంలో’ ఉంటాయి.—ప్రకటన 20:12, 13.

 అపోహ: ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఎలాంటి శరీరంతో చనిపోతాడో మళ్లీ పునరుత్థానమైనప్పుడు కూడా అదే శరీరంతో లేస్తాడు.

 నిజం: చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి శరీరం మెల్లమెల్లగా పాడైపోయి, ఇక లేకుండా పోతుంది.—ప్రసంగి 3:19, 20.