కంటెంట్‌కు వెళ్లు

పాపం అంటే ఏమిటి?

పాపం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

దేవుని ప్రమాణాలకు విరుద్ధమైన పనైనా, భావనైనా, ఆలోచనైనా పాపమే. దేవుని దృష్టిలో ఏది తప్పో, ఏది అవినీతో అది చేసి దేవుని నియమాల్ని ఉల్లఘించడం కూడా పాపమే. (1 యోహాను 3:4; 5:17) అయితే, మంచి పనులు చేయకపోవడం కూడా పాపమని బైబిలు చెప్తుంది.—యాకోబు 4:17.

బైబిలును రాసిన భాషల్లో, పాపం అనే పదాలకు లక్ష్యం లేదా “గురి తప్పడం” అనే అర్థముంది. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలు సైనికులు రాళ్లు విసరడంలో ఎంత ప్రవీణులంటే వాళ్లు గురి “తప్పేవాళ్లు కాదు.” ఆ మాటను ఉన్నదున్నట్టుగా అనువదిస్తే, “పాపం చేసేవాళ్లు కాదు” అని వస్తుంది. (న్యాయాధిపతులు 20:16) దీన్నిబట్టి, పాపం అంటే దేవుని పరిపూర్ణ ప్రమాణాలకు అనుగుణంగా జీవించే విషయంలో గురి తప్పడం.

మన సృష్టికర్తగా, మనుషులకు ప్రమాణాలు విధించే అర్హత దేవునికి ఉంది. (ప్రకటన 4:10, 11) మనం చేసే ప్రతీదానికి మనం ఆయనకు లెక్క చెప్పాలి.—రోమీయులు 14:11, 12.

అస్సలు పాపం చేయకుండా ఉండడం సాధ్యమేనా?

సాధ్యం కాదు. “ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అని బైబిలు చెప్తోంది. (రోమీయులు 3:23; 1 రాజులు 8:46; ప్రసంగి 7:20; 1 యోహాను 1:8) ఎందుకలా?

దేవుడు సృష్టించినప్పుడు, మొదటి మనుషులైన ఆదాము, హవ్వలలో ఏ పాపం లేదు. ఎందుకంటే, దేవుడు వాళ్లను పరిపూర్ణులుగా, తన స్వరూపంలో సృష్టించాడు. (ఆదికాండము 1:27) అయితే వాళ్లు, దేవుడు చేయవద్దన్న పనిచేసి పరిపూర్ణతను పోగొట్టుకున్నారు. (ఆదికాండము 3:5, 6, 17-19) వాళ్లకు పిల్లలు పుట్టినప్పుడు పాపం, అపరిపూర్ణత అనే లోపాలు ఆ పిల్లలకు వారసత్వంగా సంక్రమించాయి. (రోమీయులు 5:12) ఇశ్రాయేలీయుల్ని పాలించిన దావీదు రాజు, ‘నేను పాపములో పుట్టాను’ అన్నాడు.—కీర్తన 51:5.

కొన్ని పాపాలు మిగతా పాపాల కన్నా ఘోరమైనవా?

అవును. ఉదాహరణకు, ప్రాచీన సొదొమ పట్టణంలోని మనుషుల్ని ‘దుష్టులు, బహు పాపులు’ అనీ, వాళ్ల పాపం “బహు భారమైనది” అనీ బైబిలు చెప్తోంది. (ఆదికాండము 13:13; 18:20) ఒక వ్యక్తి చేసిన పాపం ఎంత పెద్దదో, ఎంత ఘోరమైనదో మూడు విషయాల్ని బట్టి చెప్పవచ్చు, అవేంటో చూడండి.

  1. తీవ్రత. లైంగిక పాపాలు, విగ్రహారాధన, దొంగతనం, త్రాగుబోతుతనం, దౌర్జన్యం, హత్య, మంత్రతంత్రాలు వంటి పెద్దపెద్ద పాపాలకు పాల్పడవద్దని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. (1 కొరింథీయులు 6:9-11; ప్రకటన 21:8) ఆ పాపాలకూ, అనాలోచితంగా అనుకోకుండా చేసే పాపాలకూ తేడా ఉందని బైబిలు చెప్తోంది. ఉదాహరణకు, ఇతరులను బాధపెట్టే మన మాటలు, చేతలు అందులోకే వస్తాయి. (సామెతలు 12:18; ఎఫెసీయులు 4:31, 32) అయినా, ఏ పాపాన్నీ తక్కువ అంచనా వేయకూడదని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. ఎందుకంటే, చిన్నచిన్న పాపాలే ఘోరమైన పాపాలకు దారితీస్తాయి.—మత్తయి 5:27, 28.

  2. ఉద్దేశం. మనుషులు, దేవుని నియమాలు తెలియక కొన్ని పాపాలు చేస్తారు. (అపొస్తలుల కార్యములు 17:30; 1 తిమోతి 1:12, 13) అలాంటి పాపాలు చేయడం తప్పు కాదని బైబిలు చెప్పట్లేదు. కానీ వాటికీ, దేవుని నియమాల్ని కావాలని ఉల్లంఘించి చేసే పాపాలకూ తేడా ఉందని బైబిలు చెప్తోంది. (సంఖ్యాకాండము 15:30, 31) కావాలని చేసే పాపాలకు కారణం, హృదయంలోని చెడు ఉద్దేశాలే.—యిర్మీయా 16:12.

  3. మళ్లీమళ్లీ చేయడం. ఏదో ఒక్కసారి చేసే పాపానికి, కొంతకాలంపాటు మళ్లీమళ్లీ చేస్తుండే పాపానికి తేడా ఉందని కూడా బైబిలు చెప్తోంది. (1 యోహాను 3:4-8, NW) ఏది మంచో తెలుసుకున్న తర్వాత కూడా ‘కావాలని పాపం చేస్తూ’ ఉండేవాళ్లు దేవుని తీర్పుకు గురౌతారు.—హెబ్రీయులు 10:26, 27.

ఏదైనా పెద్ద పాపం చేసినవాళ్లు, తాము చేసిన పాప భారంతో కుంగిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు, దావీదు రాజు, “నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి” అని రాశాడు. (కీర్తన 38:4) అయినా, బైబిలు మనకు ఈ నమ్మకాన్ని ఇస్తోంది: “భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.”—యెషయా 55:7.