కంటెంట్‌కు వెళ్లు

నేను పరిశుద్ధులకు ప్రార్థించాలా?

నేను పరిశుద్ధులకు ప్రార్థించాలా?

బైబిలు ఇచ్చే జవాబు

 ప్రార్థించకూడదు. మనం యేసు పేరిట యెహోవాకు మాత్రమే ప్రార్థించాలని బైబిలు చెప్తోంది. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “మీరిట్లు ప్రార్థింపుడు, ‘పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పవిత్రపరపబడును గాక!’” (మత్తయి 6:9, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) దేవునికి తప్ప పరిశుద్ధులకు గానీ, దేవదూతలకు గానీ, వేరే ఎవరికైనా గానీ ప్రార్థించమని యేసు తన శిష్యులకు ఎప్పుడూ చెప్పలేదు.

 “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు” అని కూడా యేసు తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 14:6, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) మన తరఫున వేడుకునే అధికారం దేవుడు యేసుకు మాత్రమే ఇచ్చాడు.—హెబ్రీయులు 7:25.

నేను దేవునికి, పరిశుద్ధులకు కూడా ప్రార్థన చేస్తే ఏమౌతుంది?

 పది ఆజ్ఞల్లో ఒక చోట దేవుడు ఇలా చెప్పాడు: “ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను.” (నిర్గమకాండము 20:5) ఏవిధంగా దేవుడు “రోషము” గలవాడు? ఎలాగంటే ఆయన, ప్రజలు “తనపట్ల మాత్రమే భక్తి కలిగివుండాలని కోరుకుంటున్నాడు” అని న్యూ అమెరికన్‌ బైబిల్‌ (ఇంగ్లీష్‌) లోని అధస్సూచి చెప్తోంది. ప్రజలు భక్తితో లేదా ఆరాధనా భావంతో చేసే పనులు తన కోసం మాత్రమే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాటిలో ప్రార్థన కూడా ఒకటి.—యెషయా 48:11.

 మనం దేవునికి తప్ప పరిశుద్ధులకైనా, దేవదూతలకైనా లేదా ఇంకెవరికైనా సరే ప్రార్థిస్తే దేవుణ్ణి బాధపెట్టినవాళ్లమౌతాం. అపొస్తలుడైన యోహాను ఒక దేవదూతకు నమస్కరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ దూత, “వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను, సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము” అని అతన్ని ఆపాడు.—ప్రకటన 19:10.