కంటెంట్‌కు వెళ్లు

దేవుని వాక్యం అంటే ఏమిటి? లేదా అది ఎవర్ని సూచిస్తుంది?

దేవుని వాక్యం అంటే ఏమిటి? లేదా అది ఎవర్ని సూచిస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

సాధారణంగా “దేవుని వాక్యం” అనే మాట దేవుని సందేశాన్ని లేదా దేవుని సందేశాల సమాహారాన్ని సూచిస్తుంది. (లూకా 11:28) అయితే కొన్ని సందర్భాల్లో, “దేవుని వాక్యం” లేదా “వాక్యం” అనే మాటలు ఒక వ్యక్తికి బిరుదుగా ఉపయోగించబడ్డాయి.—ప్రకటన 19:13; యోహాను 1:14.

దేవుని సందేశం. తాము చెప్తున్న సందేశాలు దేవుని మాటలు లేదా దేవుని వాక్యం అని ప్రవక్తలు చెప్పేవాళ్లు. ఉదాహరణకు దేవుని సందేశాల్ని చెప్పే ముందు యిర్మీయా ప్రవక్త “యెహోవా వాక్కు [లేదా యెహోవా వాక్యం] నాకు ప్రత్యక్షమై” అని అనేవాడు. (యిర్మీయా 1:4-5, 11, 13; 2:1) యెహోవా సౌలును రాజుగా ఎన్నుకున్నాడనే విషయాన్ని సౌలుతో చెప్పడానికి ముందు సమూయేలు ప్రవక్త ఇలా అన్నాడు, ‘నువ్వు మాత్రం ఇక్కడే నిలబడు. నేను నీకు దేవుని మాట [లేదా దేవుని వాక్యం] చెప్తాను.’—1 సమూయేలు 9:27, NW.

వ్యక్తికి బిరుదు. “వాక్యం” అనే మాట యేసుక్రీస్తుకు బిరుదుగా కూడా ఉపయోగించినట్లు బైబిల్లో గమనిస్తాం. ఆయన ఆత్మప్రాణిగా పరలోకంలో ఉన్నప్పుడు, అలాగే మనిషిగా భూమ్మీద ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ బిరుదు ఉంది. అందుకు రుజువులు ఏమిటంటే:

  • సృష్టి అంతటికన్నా ముందు వాక్యం ఉంది. “మొదట్లో వాక్యం ఉన్నాడు,” “ఆరంభంలో ఆయన దేవునితోపాటు ఉన్నాడు” అని బైబిలు చెప్తోంది. (యోహాను 1:1, 2) యేసే “మొత్తం సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి.” ఆయన ‘అన్నిటికన్నా ముందే ఉన్నాడు.’—కొలొస్సయులు 1:13-15, 17.

  • వాక్యం మనిషి రూపంలో భూమ్మీదకు వచ్చాడు. “వాక్యం శరీరంతో పుట్టి, మన మధ్య జీవించాడు” అని బైబిలు చెప్తోంది. (యోహాను 1:14) యేసుక్రీస్తు “అన్నీ వదులుకొని, దాసునిలా మారి, మనిషిగా వచ్చాడు.”—ఫిలిప్పీయులు 2:5-7.

  • వాక్యం దేవుని కుమారుడు. పైన గమనించినట్లు “వాక్యం శరీరంతో పుట్టి” అని చెప్పిన తర్వాత అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు, “మనం ఆయన మహిమను చూశాం, అది తండ్రి ఒక్కగానొక్క కొడుకుకు ఉండేలాంటి మహిమ.” (యోహాను 1:14) యోహాను ఇంకా ఇలా రాశాడు, ‘యేసు దేవుని కుమారుడు.’—1 యోహాను 4:15.

  • వాక్యానికి దేవునికి ఉన్నలాంటి లక్షణాలు ఉన్నాయి. “ఆ వాక్యం ఒక దేవుడై ఉన్నాడు” లేదా దేవునిలా ఉన్నాడు. (యోహాను 1:1) యేసు “దేవుని మహిమకు ప్రతిబింబం, దేవుని అచ్చమైన ప్రతిరూపం.”—హెబ్రీయులు 1:2, 3.

  • వాక్యం రాజుగా పరిపాలన చేస్తున్నాడు. దేవుని వాక్యం అనే వ్యక్తి తలపై “చాలా కిరీటాలు ఉన్నాయి” అని బైబిలు చెప్తోంది. (ప్రకటన 19:12, 13) వాక్యానికి “రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు” అనే మరో పేరు కూడా ఉంది. (ప్రకటన 19:16) యేసుకు కూడా అదే బిరుదు ఉంది.—1 తిమోతి 6:14, 15.

  • వాక్యం దేవుని ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. “వాక్యం” అనే బిరుదు, తన తరఫున సమాచారం, నిర్దేశాలు చేరవేయడానికి దేవుడు ఆయన్ని ఉపయోగిస్తున్నాడని సూచిస్తోంది. “నేను ఏం చెప్పాలో, నేను ఏం మాట్లాడాలో నన్ను పంపించిన తండ్రే నాకు ఆజ్ఞాపించాడు. ... కాబట్టి, నేను ఏం మాట్లాడినా తండ్రి నాకు చెప్పినట్లే మాట్లాడతాను” అని తన గురించి యేసు చెప్పాడు.—యోహాను 12:49, 50.