కంటెంట్‌కు వెళ్లు

దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?

దేవుని ప్రభుత్వం అంటే ఏమిటి?

బైబిలు ఇచ్చే జవాబు

యెహోవా స్థాపించిన ప్రభుత్వమే దేవుని ప్రభుత్వం. దేవుని ప్రభుత్వం పరలోకం నుండి పరిపాలిస్తుంది కాబట్టి దాన్ని “పరలోక రాజ్యం” అని కూడా పిలుస్తాం. (మార్కు 1:14, 15; మత్తయి 4:17) దేవుని ప్రభుత్వానికి, మనుషుల ప్రభుత్వానికి మధ్య కొన్ని పోలికలు ఉన్నా అది అన్నిటిలో ఎంతో ఉన్నతంగా ఉంటుంది.

  • పాలకులు. దేవుడు తన ప్రభుత్వానికి రాజుగా యేసుక్రీస్తును నియమించాడు, ఏ మనిషికి లేనంత గొప్ప అధికారం ఆయనకు ఇచ్చాడు. (మత్తయి 28:18) యేసుక్రీస్తు నమ్మదగిన, దయగల మంచి పరిపాలకుడని ముందే నిరూపించుకున్నాడు కాబట్టి తనకున్న అధికారాన్ని మంచి కోసమే ఉపయోగిస్తాడు. (మత్తయి 4:23; మార్కు 1:40, 41; 6:31-34; లూకా 7:11-17) యేసుక్రీస్తు దేవుడిచ్చిన నిర్దేశంతో తనతోపాటు రాజులుగా పరిపాలించడానికి ప్రతి జనములోనుండి కొంతమందిని ఎంచుకున్నాడు.—ప్రకటన 5:9, 10.

  • ఎంతకాలం. మానవ ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని ప్రభుత్వానికి ‘ఎన్నటికి నాశనము’ ఉండదు.—దానియేలు 2:44.

  • పౌరులు. ఏ దేశములో పుట్టినా ఏ వంశానికి చెందినవాళ్లయినా దేవుడు చెప్పింది చేస్తే ఆ ప్రభుత్వంలో పౌరులుగా ఉంటారు.—అపొస్తలుల కార్యములు 10:34, 35.

  • నియమాలు. దేవుని ప్రభుత్వ నియమాలు లేదా ఆజ్ఞలు కేవలం ప్రజలను చెడు చేయకుండా ఆపడం మాత్రమే కాదు, వాళ్లలో నీతినియమాలను కూడా పెంచుతాయి. ఉదాహరణకు, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే” అని బైబిలు చెప్తుంది. (మత్తయి 22:37-39) దేవుని మీద, తోటివాళ్ల మీద ఉన్న ప్రేమే ఆ ప్రభుత్వ పౌరులు ఇతరులకు మంచి చేసేలా పురికొల్పుతుంది.

  • విద్య. దేవుని ప్రభుత్వం దాని పౌరులకు ఉన్నత ప్రమాణాలు పెడుతుంది, వాటిని ఎలా పాటించాలో కూడా నేర్పిస్తుంది.—యెషయా 48:17, 18.

  • లక్ష్యం. దేవుని ప్రభుత్వం, దాని పౌరుల కష్టంతో రాజులను సంపన్నులుగా చేయదు. బదులుగా, దేవుని ప్రేమించే వాళ్లందరూ భూమ్మీదకు వచ్చే మంచి పరిస్థితుల్లో నిరంతరము జీవించాలనే దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.—యెషయా 35:1, 5, 6; మత్తయి 6:10; ప్రకటన 21:1-4.