కంటెంట్‌కు వెళ్లు

దేవుడు ప్రతీచోట ఉంటాడా? ఆయన సర్వాంతర్యామా?

దేవుడు ప్రతీచోట ఉంటాడా? ఆయన సర్వాంతర్యామా?

బైబిలు ఇచ్చే జవాబు

దేవుడు అన్నీ చూడగలడు, ఎక్కడ ఏం చేయాలనుకుంటే అక్కడ అది చేయగలడు. (సామెతలు 15:3; హెబ్రీయులు 4:13) కానీ, దేవుడు సర్వాంతర్యామి అని, అంటే ఆయన అన్ని చోట్ల, అన్నిటిలో ఉంటాడని బైబిలు చెప్పట్లేదు. బదులుగా ఆయన ఒక వ్యక్తి అని, ఆయన నివసించే స్థలం ఒకటుందని బైబిలు చెప్తుంది.

  • దేవుని స్వరూపం: దేవుడు ఒక అదృశ్య ప్రాణి. (యోహాను 4:​24) ఆయన మనుషులకు కనిపించడు. (యోహాను 1:​18) బైబిల్లో నమోదైన దేవుని దర్శనాలు ఎప్పుడూ, ఆయన ఒక ప్రత్యేక స్థలంలో ఉన్నట్టు వర్ణించాయి. ఆయన ప్రతీచోట ఉన్నట్టు ఎన్నడూ వర్ణించలేదు.—యెషయా 6:​1, 2; ప్రకటన 4:​2, 3, 8.

  • దేవుడు ఉండే స్థలం: దేవుడు అదృశ్య ప్రాణులు ఉండే చోట ఉంటాడు, అది ఈ భౌతిక సృష్టిలా ఉండదు. ఆ స్థలంలోనే ఒకచోట, అంటే ‘పరలోకంలోని నీ నివాస స్థలంలో’ ఆయన ఉంటాడు. (1 రాజులు 8:​30) “దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన” * ఒక సందర్భం గురించి బైబిలు చెప్పింది. ఆ లేఖనాన్ని బట్టి దేవుడు ఒక ప్రత్యేక స్థలంలో ఉంటాడని అర్థమౌతుంది.​—యోబు 1:6.

దేవుడు సర్వాంతర్యామి కానప్పుడు, మరి ఆయన నన్ను వ్యక్తిగతంగా పట్టించుకుంటాడా?

పట్టించుకుంటాడు. దేవునికి ప్రతీ ఒక్కరి పట్ల ఎంతో శ్రద్ధ ఉంది. ఆయన అదృశ్య ప్రాణులు ఉండే స్థలంలో నివసిస్తున్నప్పటికీ, తనను నిజంగా సంతోషపెట్టాలని కోరుకునే వాళ్లు ఈ భూమ్మీద ఎవరున్నారని ఆయన చూస్తాడు. అంతేకాదు, ఆయన వాళ్లకు సహాయం చేస్తాడు. (1 రాజులు 8:​39; 2 దినవృత్తాంతములు 16:9) తనను మనస్ఫూర్తిగా ఆరాధించేవాళ్లపట్ల యెహోవా ఎలా శ్రద్ధ చూపిస్తాడో గమనించండి.

  • మీరు ప్రార్థించినప్పుడు: మీరు తనకు ప్రార్థించిన క్షణంలోనే యెహోవా మీ ప్రార్థన వింటాడు.​—2 దినవృత్తాంతములు 18:31.

  • మీరు కృంగుదలలో ఉన్నప్పుడు: “విరిగిన హృదయులకు యెహోవా దగ్గరలో ఉన్నాడు. నలిగిపోయిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు.”​—కీర్తన 34:18, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

  • మీకు నిర్దేశం అవసరమైనప్పుడు: యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా ఉపదేశమిస్తాడు, నడవాల్సిన మార్గాన్ని బోధిస్తాడు.​—కీర్తన 32:8.

సర్వాంతర్యామి అనే విషయంలో అపోహలు

అపోహ: దేవుడు సృష్టిలో ప్రతీచోట ఉన్నాడు.

నిజం: దేవుడు ఈ భూమ్మీదగానీ, ఈ భౌతిక విశ్వంలో మరెక్కడాగానీ ఉండడు. (1 రాజులు 8:​27) నిజమే నక్షత్రాలు, ఆయన చేసిన మిగతా సృష్టి “దేవుని మహిమను వివరించుచున్నవి.” (కీర్తన 19:1) కానీ, ఒక చిత్రకారుడు తను గీసిన చిత్రంలో ఎలాగైతే నివసించడో అలాగే దేవుడు కూడా తాను చేసిన సృష్టిలో నివసించడు. అయినప్పటికీ, ఆ చిత్రాన్ని చూసినప్పుడు చిత్రకారుని గురించి మనకు ఎంతోకొంత తెలుస్తుంది. అదేవిధంగా, మన కంటికి కనిపించే ఈ ప్రపంచం సృష్టికర్త ‘అదృశ్య లక్షణాలైన’ శక్తి, జ్ఞానం, ప్రేమ గురించి చెప్తుంది.​—రోమీయులు 1:​20.

అపోహ: దేవునికి అన్ని విషయాలు తెలియాలన్నా, ఆయన సర్వశక్తిమంతుడవ్వాలన్నా ఆయన ఖచ్చితంగా సర్వాంతర్యామి అయ్యుండాలి.

నిజం: దేవుని పవిత్రశక్తి లేదా చురుకైన శక్తి అనేది దేవుడు ఉపయోగించే శక్తి. తన పవిత్రశక్తి ద్వారా దేవుడు దేన్నైనా తెలుసుకోగలడు, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఏదైనా చేయగలడు. దానికోసం ఆయనే అక్కడ ఉండనక్కర్లేదు.​—కీర్తన 139:7.

అపోహ: “నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు” అని కీర్తన 139:8లో ఉన్న మాటలు దేవుడు సర్వాంతర్యామి అని చెప్తున్నాయి.

నిజం: ఈ లేఖనం దేవుడు ఉండే స్థలం గురించి మట్లాడట్లేదు. కానీ, దేవుడు చేరుకోలేని స్థలమంటూ ఏదీ ఉండదు, ఆయన మన తరఫున చర్య తీసుకుంటాడు అని ఆ లేఖనం కవితా రూపంలో చెప్తుంది.

^ పేరా 5 బైబిలు చెప్తున్నట్లు యెహోవా అనేది దేవుని పేరు.