కంటెంట్‌కు వెళ్లు

దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడా?

దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడా?

బైబిలు ఇచ్చే జవాబు

లేదు. దేవుడు మనుషుల్ని అలాగే రకరకాల “జాతుల” జంతువుల్ని, మొక్కల్ని సృష్టించాడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. * (ఆదికాండం 1:12, 21, 25, 27; ప్రకటన 4:11) మొదటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వ నుండి మనుషులందరూ వచ్చారని బైబిలు చెప్తుంది. (ఆదికాండం 3:20; 4:1) దేవుడు రకరకాల జీవుల్ని, మొక్కల్ని సృష్టించడానికి పరిణామాన్ని ఉపయోగించాడనే సిద్ధాంతాన్ని (theistic evolution) బైబిలు సమర్థించట్లేదు. అయితే, ప్రతీ జాతిలో మార్పులు జరుగుతాయని సైంటిస్టులు గమనించిన విషయాల్ని మాత్రం బైబిలు కాదనట్లేదు.

 దేవుడు పరిణామాన్ని ఉపయోగించాడా?

దేవుడు సృష్టిని చేయడానికి పరిణామాన్ని ఉపయోగించాడనే సిద్ధాంతంలో చాలా అంశాలు ఉన్నాయి. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెప్తున్నట్టు, ఆ సిద్ధాంతంలో ఉన్న ఒక అంశం ఏంటంటే, “దేవుడు ప్రకృతిని శాసించడానికి ఉపయోగించే ప్రక్రియల్లో ఒకటి, ప్రకృతి వరణం (natural selection).” *

దేవుడు సృష్టిని చేయడానికి పరిణామాన్ని ఉపయోగించాడనే సిద్ధాంతంలో ఈ అంశాలు కూడా ఉండవచ్చు:

  • చాలాకాలం క్రితం, జీవరాశులన్నీ ఒకే మూలం నుండి వచ్చాయి.

  • ఒక జాతిప్రాణి పరిణామం చెంది పూర్తిగా ఒక కొత్త జాతిప్రాణిగా మారగలదు. ఉదాహరణకు, కోతులు పరిణామం చెంది మనుషులుగా మారగలవు.

  • ఈ ప్రక్రియలన్నిటికీ ఏదోవిధంగా దేవుడే కారణం.

 దేవుడు పరిణామాన్ని ఉపయోగించాడనే సిద్ధాంతం, బైబిలు చెప్పేవాటికి సరిపోతుందా?

ఆదికాండం పుస్తకంలో సృష్టి గురించి ఉన్న విషయాలు కొంతవరకు నిజం కాదని ఆ సిద్ధాంతం చెప్తుంది. కానీ ఆదికాండం పుస్తకంలో ఉన్న విషయాలు నిజమని యేసు చెప్పాడు. (ఆదికాండం 1:26, 27; 2:18-24; మత్తయి 19:4-6) భూమ్మీదికి రాకముందు యేసు పరలోకంలో దేవునితో పాటు ఉన్నాడని, ‘అన్నిటినీ’ సృష్టించడంలో దేవునితో కలిసి పని చేశాడని బైబిలు చెప్తుంది. (యోహాను 1:3) కాబట్టి, దేవుడు సృష్టిని చేయడానికి పరిణామాన్ని ఉపయోగించాడనే సిద్ధాంతం బైబిలు చెప్పేవాటికి విరుద్ధంగా ఉంది.

 మొక్కల్లో, జంతువుల్లో జరిగే మార్పుల్ని పరిణామం అనొచ్చా?

ఒకే జాతిలో ఎంతవరకు మార్పులు జరగవచ్చో బైబిలు వివరించట్లేదు. అదేవిధంగా, బైబిలు ఈ వాస్తవాన్ని ఖండించట్లేదు: దేవుడు సృష్టించిన రకరకాల జాతుల జంతువులు, మొక్కలు పునరుత్పత్తి చేస్తుండగా లేదా కొత్త వాతావరణ పరిస్థితులకు అలవాటు పడుతుండగా వాటిలో మార్పులు జరగవచ్చు. కొంతమంది అలాంటి మార్పుల్ని కూడా పరిణామమే అంటారు. కానీ నిజానికి, పూర్తిగా ఒక కొత్త జాతి ఆవిర్భవించట్లేదు కాబట్టి దాన్ని పరిణామం అని అనలేం.

^ పేరా 1 బైబిలు ఉపయోగించే “జాతులకు”, సైంటిస్టులు ఉపయోగించే “జాతుల” కన్నా విస్తృతమైన అర్థం ఉంది. కొన్నిసార్లు సైంటిస్టులు కొత్త జాతులు ఆవిర్భవించాయని చెప్పినప్పుడు, నిజానికి అది పూర్తిగా ఒక కొత్త జాతి ఆవిర్భవించినట్టు కాదుగానీ ఆదికాండంలో ఉపయోగించిన “జాతుల్లో” జరిగిన మార్పు మాత్రమే.

^ పేరా 2 ప్రకృతి వరణం అంటే వాతావరణానికి తట్టుకునే జంతువులు లేదా మొక్కలే సజీవంగా ఉంటాయని, అలా తట్టుకోలేనివి చివరికి నశించిపోతాయని అర్థం.